సాక్షి, హైదరాబాద్ : అనుకున్నట్టే అసెంబ్లీని రద్దు చేసి ఉత్కంఠ పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను గురువారం ప్రకటించారు. టీఆర్‌ఎస్ భవన్‌లో అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. హుస్నాబాద్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు.
వంద సీట్లు పక్కా
టీఆర్‌ఎస్ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 50 రోజుల్లో వంద సభలను ఏర్పాటు చేసి తమ ఆలోచనలను ప్రజల ముందుంచుతామన్నారు. టీఆర్‌ఎస్ భవన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.
నవంబర్‌లోనే ఎన్నికలు
ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరిగి డిసెంబర్ మొదటివారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా వేశారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ ప్రగతి రధ చక్రం ఆగకుండా కొనసాగాలంటే రాష్ర్టం మళ్లీ టీఆర్‌ఎస్‌కే అప్పగించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలనే తాము తీసుకుంటామనే విశ్వాసం ప్రజలకు ఉందన్నారు.
బీజేపీకి దూరం
రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ లౌకిక పార్టీగా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ ఉన్న సీట్లను కాపాడుకుంటే గొప్పని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతలు లేనిపోనివి ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీతో పొత్తు ఉండదని స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పారని కేసీఆర్ గుర్తుచేశారు. మతతత్వ ఎంఐఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించే పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అమిత్ షానే అన్నారని చెప్పారు
రాహుల్ ఓ బఫూన్
కాంగ్రెస్, బీజేపీలను తీవ్రంగా విమర్శించిన కేసీఆర్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని దేశంలోనే అతిపెద్ద బఫూన్‌గా అభివర్ణించారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, చట్టసభలోనే కన్నుగీటడం వంటి చేష్టలతో రాహుల్ నవ్వులపాలయ్యారన్నారు. ఏ ఒక్క రాష్ర్టంలో కాంగ్రెస్ 20 సీట్లను గెలుచుకునే స్థితిలో లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment