అసెంబ్లీకి బాల్క సుమన్ | Balka Suman Will Contest As MLA | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి బాల్క సుమన్‌..

Published Thu, Sep 6 2018 4:32 PM | Last Updated on Thu, Sep 6 2018 6:35 PM

Balka Suman Will Contest As MLA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఊహాగానాలకు తెరదించుతూ కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు అందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ ఖరారు చేసిన గులాబీ అధినేత.. పార్టీలోకి కొత్తగా చేరిన వారి కోసం కొన్ని మార్పులు చేశారు. ముందుగా ఊహించినట్లుగానే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను అసెంబ్లీకి పంపేందుకే నిర్ణయించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సుమన్‌ను ప్రకటించారు. చెన్నూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్‌ నిరాకరించి.. ఆ స్థానాన్ని సుమన్‌కు కట్టబెట్టారు. మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో.. వివేక్‌ లోక్‌సభకు పంపించేందుకే బాల్క సుమన్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది.

టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వివేక్‌ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో.. ఆయన స్థానంలో గత ఎన్నికల్లో విద్యార్థి నాయకుడైన సుమన్‌కు కేసీఆర్‌ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వివేక్‌పై సుమన్‌ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివేక్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్‌ను ఖరారు చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ సర్దుబాటులో భాగంగానే సుమన్‌ అసెంబ్లీకి పంపినట్టు వినిపిస్తోంది. ఇక, పెద్దపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాసరి మోహన్‌రెడ్డికి మరోసారి టికెట్‌ కన్ఫామ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement