‘లిక్కర్‌ ఆదాయాన్ని కూడా ఆర్థిక ప్రగతేనన్న కేసీఆర్‌’ | Uttam Kumar Reddy Fires On KCR Over Dissolution Telangana Assembly | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 6 2018 5:47 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Uttam Kumar Reddy Fires On KCR Over Dissolution Telangana Assembly - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. పోయే కాలమొచ్చి కేసీఆర్‌ శాసన సభను రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. తొమ్మిది నెలల ముందుగా ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలన అబద్ధాలు, మోసాలతో నిండిపోయిందని అన్నారు. అధికారం నుంచి దిగిపోతున్నప్పుడు కూడా కేసీఆర్‌ అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ఆర్థికంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్తున్న కేసీఆర్‌ మాటలు వంద శాతం అబద్ధమని చెప్పారు. లిక్కర్‌ అమ్మాకాల్లో, రైతు ఆత్మహత్యల్లో, అప్పుల్లో తెలంగాణను కేసీఆర్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారని ధ్వజమెత్తారు. తెలంగాణ కంటే 6 రెట్లు అధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ మద్యం అమ్మకాల ద్వారా 19 వేల కోట్ల ఆదాయం పొందుతుంటే.. నాలుగు కోట్ల తెలంగాణ 20 వేల కోట్ల ఆదాయం పొందుతోందని తెలిపారు. లిక్కర్‌ దందాలను కూడా ఆర్థిక వృద్ధి అని చెప్తున్న కేసీఆర్‌ దిగజారుడు తనం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధిలో తెలంగాణ నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందని అబద్ధాలు చెప్తున్న కేసీఆర్‌ ఎన్ని హామీలు నెరవేర్చాడో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌కు ఆ వర్గం వారు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజనుకుల 3 ఎకరాల భూమి, ఇంటింటికి ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు.. ఈ హామీలు ఎంతవరకు నెరవేర్చారని ఉత్తమ్‌ కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

గాంధీ కుటుంబాన్ని తిట్టడం అనైతికం
తెలంగాణ ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని తిట్టిన కేసీఆర్‌ బాగుపడడని ఉత్తమ్‌ అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై కేసీఆర్‌ చేస్తున్న అహకార పూరిత, అవమానకర వ్యాఖ్యలను యావత్‌ తెలంగాణ సమాజం ఖండిస్తోందని అన్నారు. బందిపోటు దొంగల ముఠాలాగా.. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకుందని విమర్శించారు. రాబోయే ఎన్నికలు నలుగురు సభ్యులున్న కేసీఆర్‌ కుటుంబానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య పోరు అని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement