కేరళ రాష్ట్ర చేప ‘కరిమీన్’కు మంచి కాలం వచ్చింది. ఈ చేప చర్మంపై గుండ్రటి చుక్కలు మాదిరిగా ఉండి కాంతులీనుతూ ఉంటాయి. అందుకే దీన్ని ఆంగ్లంలో పెర్ల్ స్పాట్ ఫిష్’ అని పిలుస్తూ ఉంటారు. దీని పేరు మన కొర్రమీను మాదిరిగా, రూపం చందువా మాదిరిగా ఉంటుంది. కరిమీన్ అత్యంత రుచికరమైన చేప. దీనితో చేసిన వంటకాలను కేరళీయులతోపాటు పర్యాటకులు లొట్టలేసుకుంటూ తింటారు. కిలో రూ. 500–600 దాకా పలుకుతుంది. విదేశాల్లోనూ గిరాకీ ఉంది.
కేరళలో నదులు, వంకలు సముద్రంలో కలిసే అలెప్పీ తదితర ప్రాంతాల్లో ఈ చేపలు సహజసిద్ధంగా మత్స్యకారుల వలలకు పడుతూ ఉంటాయి. పశ్చిమ దిశగా పారే కర్ణాటక నదుల్లో, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా కరిమీన్ కనిపిస్తూ ఉంటుంది. కేరళ బ్యాక్‌వాటర్స్‌లో స్థానికులు కరిమీన్ పిల్లలను పట్టుకొని, వాటిని కొందరు రైతులు చెరువుల్లో పెంచుతూ ఉంటారు. నీటిలో పెరిగే నాచు, మొక్కలు, కీటకాలను తిని కరిమీన్ పెరుగుతుంది. కరిమీన్ పిల్లలకు చాలా గిరాకీ ఉంది కాబట్టి, ఈ చేప పిల్లల కోసం చాలా మంది జల్లెడపడుతూ ఉంటారు. కాలక్రమంలో ఈ చేపల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (ఎంపెడా) రంగంలోకి దిగింది. కరిమీన్ చేప పిల్లల ఉత్పత్తిని ప్రారంభించింది.
కొచ్చిన్ సమీపంలోని వల్లార్‌పాదంలో ఎంపెడా ఏర్పాటు చేసిన మల్టీస్పెసీస్ ఆక్వాకల్చర్ కాంప్లెక్స్(మాక్)లో కరిమీన్ చేప పిల్లల ఉత్పత్తిని ప్రారంభమైంది. తొలి బ్యాచ్ కరిమీన్ చేప పిల్లల అమ్మకాలను ఇటీవల ఎంపెడా చైర్మన్ కె.ఎస్. శ్రీనివాస్ ప్రారంభించారు. మాక్ కేంద్రంలో ఏడాది పొడవునా కరిమీన్ చేప పిల్లల ఉత్పత్తి జరుగుతూ ఉంటుందని, రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కొని సాగు చేసుకోవచ్చని ఆయన అన్నారు. కరిమీన్ చేపల ఎగుమతిని కూడా ఎంపెడా ప్రోత్సహిస్తుందన్నారు. వల్లార్‌పాదం మాక్ కేంద్రంలో గిఫ్ట్ తిలాపియా, కరిమీన్‌తోపాటు టైగర్ రొయ్యల సీడ్‌ను కూడా ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తామన్నారు. వాణిజ్యపరంగా సాగు చేయడానికి వీలున్న ఇతర రకాల చేపల సీడ్‌ను కూడా రానున్న కాలంలో ఈ మాక్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తామని ఎంపెడా చైర్మన్ ప్రకటించారు.
కరిమీన్ సీడ్‌ను రైతుకు అందిస్తున్న ఎంపెడా చైర్మన్ కె. ఎస్. శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment