మూగజీవాలే ఆమె ప్రపంచం | Mugajivale the World | Sakshi
Sakshi News home page

మూగజీవాలే ఆమె ప్రపంచం

Published Mon, Mar 17 2014 5:45 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

మూగజీవాలే ఆమె ప్రపంచం - Sakshi

మూగజీవాలే ఆమె ప్రపంచం

జంతువులంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ వాటి కోసం జీవితాన్ని అంకితం చేసేంత ఇష్టం ఉన్నవాళ్లు అరుదుగానే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తే... తమరా రాబ్. రొమేనియాకు చెందిన ఈమె... మూగజీవాలను సంరక్షించడమే ధ్యేయంగా జీవిస్తోంది.

తమరా డబ్బున్న వ్యక్తేమీ కాదు. ఉపాధి కోసం ట్రక్కును నడుపుతూ ఉంటుంది. ఓ పక్క తన విధుల్ని నిర్వర్తిస్తూనే మూగజీవాల సంరక్షణ కోసం పాటు పడుతోంది. చిన్నప్పట్నుంచీ నోరు లేని జీవాలంటే చెప్పలేని జాలి తమరాకి. రోడ్ల మీద ఏదైనా జంతువు కనిపిస్తే తన దగ్గరున్న తినుబండారాల్ని వాటికి పెట్టేసేది. పెద్దయ్యేకొద్దీ ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఓసారి రోడ్డుమీద పడివున్న ఓ కుక్క కళేబరాన్ని చూసి కదలిపోయిందామె. వాహనం కింద పడి నుజ్జునుజ్జయిన ఆ కళేబరాన్ని తీయడానిక్కూడా ఎవరూ ముందుకు రాకపోవడం కలచివేసిందామెని.

మరే జీవికీ అలాంటి చావు రాకూడదు అనుకుంది తమరా. అప్పట్నుంచీ ఎక్కడైనా కుక్కలు, పిల్లుల్లాంటివి కనిపిస్తే వాటిని ఇంటికి తీసుకెళ్లిపోవడం మొదలుపెట్టింది. వాటిని సాకడంలో ఎంతో సంతోషం ఉందని అంటుందామె.
 
ఇంట్లో సగభాగాన్ని జంతువులకే కేటాయించింది తమరా. కుక్కలు, పిల్లులు కలిపి ఓ యాభై వరకూ ఉన్నాయి ఆమె దగ్గర. తన జీతంలో కొంత భాగానికి కొందరు దాతలు ఇచ్చే సొమ్మును జతచేసి వాటిని పోషిస్తూ ఉంటుంది. అయితే ఆమె జంతుప్రేమ అక్కడితో ఆగిపోలేదు.

ప్రతియేటా క్రిస్‌మస్ పండుగకి తన వ్యాన్ నిండా పెట్ ఫుడ్, మందులు వంటివి నింపుకొని బయలుదేరుతుంది తమరా. రొమేనియాలోని జంతు సంరక్షణ కేంద్రా లన్నింటికీ వెళ్లి వాటిని పంచిపెడుతుంది. వాటి ఆహారానికి, వ్యాన్ డీజిల్‌కి ఎంత ఖర్చయినా ఈ పని చేయడం మాత్రం మానదు తమరా. ఇదంతా నీకు కష్టమనిపించడం లేదా అంటే... ‘‘నిజానికి వాటన్నిటినీ తెచ్చుకుని పెంచేసుకోవాలనిపిస్తుంది, కానీ సాధ్యం కాదు కదా, అందుకే చేయగలిగింది చేస్తున్నాను’’ అంటుంది నవ్వుతూ!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement