ముంబైలో జరిగిన కార్యక్రమంలో అమిత్ అభివాదం
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పాడాలనుకుంటున్న ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఆయన పాములు, ముంగిసలు, కుక్కలు, పిల్లులతో పోల్చారు. తర్వాత ఆ పార్టీలను జంతువులతో పోల్చడం తన ఉద్దేశం కాదని షా వివరణ ఇచ్చారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన ర్యాలీలో అమిత్ పాల్గొన్నారు. ‘2019 ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారీ వరదలు వచ్చినప్పుడు అంతా కొట్టుకుపోతుంది. వటవృక్షం (మర్రి చెట్టు) మాత్రమే వరదను తట్టుకుని నిలబడుతుంది. పాములు, ముంగిసలు, కుక్కలు, పిల్లులు ఇతర జంతువులన్నీ అప్పుడు వరద నుంచి తమను తాము కాపాడుకోవడానికి వటవృక్షం మీదకే చేరుతాయి. ప్రధాని మోదీ అనే వరద కారణంగా ఆ జంతువులు, సరీసృపాలన్నీ ఎన్నికల కోసం దగ్గరవుతున్నాయి’ అని షా తన ప్రసంగంలో అన్నారు. ప్రతిపక్ష పార్టీలను జంతువులతో పోల్చడం అమిత్ దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. ఇవి ఆయన ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
నా ఉద్దేశం అది కాదు..
తర్వాత షా మీడియాతో మాట్లాడుతూ సారూప్య సిద్ధాంతాలు లేని పార్టీలన్నీ మోదీ భయం వల్లనే ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. ‘పాముకు, ముంగిసకు ఎన్నో తేడాలున్నాయి. ఎంతో భిన్నమైన ఎస్పీ, బీఎస్పీలు కలసి ఇటీవల బీజేపీపై పోటీ చేశాయి. కూటమి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి పార్టీల సిద్ధాంతాలు కూడా వేర్వేరు. కానీ ఎన్నికల కోసం అవి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని అన్నారు.
రిజర్వేషన్లను తొలగించం.. తొలగించనివ్వం
ర్యాలీలో రిజర్వేషన్లపై షా మాట్లాడుతూ ‘రాహుల్, పవార్ (కాంగ్రెస్, ఎన్సీపీల అధ్యక్షులు)! ఇది వినండి. రిజర్వేషన్లను బీజేపీ తొలగించదు. మీరు అలా చేయాలనుకున్నా మేం చేయనివ్వం’ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను తాము ఎత్తేయాలనుకుంటున్నట్లు రాహుల్, మరికొందరు దుష్ప్రచారం చేస్తున్నారనీ, అది పూర్తిగా అబద్ధమని షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకూ ఎంతో చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరును చూసి 2019లో ఓటేయాల్సిందిగా ప్రజలను కోరతామనీ, ప్రతిపక్షాల్లాగా ఒట్టి హామీలు ఇవ్వబోమన్నారు. సిద్ధరామయ్య చెబుతున్నట్లు తాను జైన మతస్తుడను కాదనీ, హిందూ వైష్ణవుడనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment