న్యూఢిల్లీ: మణిపూర్ అంశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని ప్రకటించినా.. విపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని కేంద్రం అంటోంది. గురివింద గింజ సామెతలాగా.. తమ రాష్ట్రాల్లో నేరాలను ఆయా ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని విపక్షాలపై మండిపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం సమావేశాలైనా సజావుగా జరుగుతాయా? అనే సందిగ్ధం నెలకొనగా.. అనూహ్యంగా క్విడ్ ప్రోకో(రెండు వైపులా లాభం) తెర మీదకు వచ్చింది.
‘‘మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీనే పార్లమెంట్‌లో మాట్లాడాలి. ఇది తేలనిదే పార్లమెంట్ సమావేశాలను ముందుకు సాగనివ్వం’’ విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ప్రధాన డిమాండ్ ఇది. ఈ డిమాండ్‌తోనే గత రాత్రి సైతం పార్లమెంట్ బయట తమ నిరసన గళం వినిపించాయవి. అయితే కేంద్రం మాత్రం అందుకు సన్నద్ధంగా లేదు. పైగా ఈ సమావేశాల్లో 31 బిల్లులకు ఈ సమావేశాల్లో ఆమోదం తెలపాల్సిన అవసరం ఉండగా.. అందునా వివాదాస్పదమైన ఢిల్లీ ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా ఉంది. దీంతో మణిపూర్ గండం దాటుకోవడం ఎలాగ? అనే విషయంలో కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.
శాంతి భద్రతల అంశం కాబట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రసంగం చేస్తారని.. అనుమానాలను నివృత్తి చేస్తారని చెబుతోంది. ఈ క్రమంలోనే క్విడ్ ప్రోకో ఆలోచనతో ముందుకు వచ్చింది. మణిపూర్ అంశంపై స్వల్ప కాలిక చర్చతో సరిపెడతామని.. ప్రతివిమర్శలు చేయబోమని విపక్షాలకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం.. సమావేశాలకు సజావుగా సాగనిచ్చేందుకు, సామరస్యంగా మణిపూర్ చర్చ అంశాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్ష నేతలతో ఫోన్‌లలో మాట్లాడారు. సభను సజావుగా సాగనిచ్చేందుకు సహకరించాలని కోరారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే హోం మంత్రి నివృత్తి చేస్తారని.. చర్చించేందుకు అనుమతించాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీతో కొందరు కేంద్ర మంత్రులు.. హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీలు జరిపారు.
దేశంలో ఏ రాష్ట్రం ఇంతకు ముందెప్పుడూ ఇంత సుదీర్ఘకాలం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని మణిపూర్ సంక్షోభంపై ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం మరోలా ప్రకటన చేసింది. ‘‘1993-97 మధ్యకాలంలో మణిపూర్ ఇంతకన్నా భయంకరమైన పరిస్థితులను చవిచూసింది. ఆ సమయంలో ఏ ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. అలాగే పార్లమెంట్‌లో ఒక్కసారిగా కూడా చర్చించలేదు’’ అని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
మణిపూర్‌పై పరిమిత చర్చ మాత్రమే జరిపి.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేరాలపై ఎలాంటి ప్రస్తావన చేయొద్దని కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారా బిల్లుల ఆమోద ప్రయత్నాలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రతిపక్షాలు కేంద్రం ప్రతిపాదనకు ఎలా స్పందించాయనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేకించి ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో సహకరిస్తాయా? అనేది అనుమానమే!.
ఇదీ చదవండి: రూల్ నెంబర్ 267 వర్సెస్ 176
Comments
Please login to add a commentAdd a comment