Amit Shah On Manipur Viral Video Leakage Conspiracy - Sakshi
Sakshi News home page

కావాలనే లీక్‌ చేశారు.. మణిపూర్‌ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు

Published Fri, Jul 28 2023 12:28 PM | Last Updated on Fri, Jul 28 2023 3:09 PM

Union Minister Amit Shah On Manipur Viral video leakage conspiracy - Sakshi

దేశాన్ని కుదిపేసిన మణిపూర్‌ కీచక పర్వంపై  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఆ వీడియోను విడుదల చేశారని.. దీని వెనుక కుట్ర దాగి ఉందనేది  తేల్చాల్సి ఉందని  తెలిపారాయన. 

ఢిల్లీ: మణిపూర్‌ పరిణామాలు.. కాంగ్పోక్పి మహిళల నగ్న ఊరేగింపు ఘటన కేసుపై సుప్రీం కోర్టుకు హోం శాఖ నివేదించిన(అఫిడవిట్‌ రూపంలో) అంశాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ క్రమంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990 నుంచి మణిపూర్‌లో జాతుల నడుమ ఘర్షణలు జరుగుతున్నాయని.. తాజా పరిణామాల వరకు మాట్లాడారాయన. కేంద్రంలో మణిపూర్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు.. 1993లో నాగా-కుకీ, 1993 మే నెలలో మెయితీ-పంగల్‌, 1995లో కుకీ-తమిళులు, 1997-98 నడుమ కుకీ-పైతే ఘర్షణలు జరిగాయని గుర్తు చేశారాయన. 

అలాగే.. తాజా కుకీ-మెయితీ ఘర్షణల్లో భాగంగా మే 4వ తేదీన మహిళలపై జరిగిన దారుణంపైనా స్పందించారు.  ఘటనలో వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్‌ అయ్యాడు. అతని నుంచి వీడియో తీసిన మొబైల్‌ ఫోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో..  మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అభాగ్యులైన కుకీ మహిళలతో కూడిన వీడియోను వైరల్‌ చేసి ఉంటారని భావిస్తున్నాం. వీడియోను కుట్రతోనే.. ఉద్దేశపూర్వకంగా లీక్‌ చేసి ఉంటారని అనుకుంటున్నాం.  ఈ కుట్రను తేల్చేందుకే దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారాయన.   

ఇదేకాదు.. మణిపూర్‌ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందు 2022లో మయన్మార్‌లో జరిగిన సంఘటనల తాలుకా రెండు వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా మణిపూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు అని వివరించారాయన. 

"మణిపూర్‌ ఘటనకు సంబంధించిన కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఆరు కేసులను ఇప్పటికే సీబీఐకి పంపాం. ఏడో కేసు ఫైల్ కూడా పంపాల్సి ఉంది. మరో మూడు కేసుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించాం.  దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాం. అలాగే.. మణిపూర్‌ వీడియో ఘటన కేసు  విచారణ కూడా మణిపూర్‌ రాష్ట్రం బయటే జరగడం సబబుగా భావిస్తున్నాం. అందుకే ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాం"

మణిపూర్‌ మహిళల ఊరేగింపు సమయంలో.. అక్కడ పోలీసులుగానీ, ఆర్మీగానీ లేదని తేలింది.  ఇటు నిఘా సంస్థలుగానీ, అటు హోం శాఖ గానీ.. వీడియోకు సంబంధించిన ఎలాంటి క్లూస్‌ దొరకలేదని వెల్లడించారాయన. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మణిపూర్‌ అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా 6,065 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని తెలిపారు. కేంద్రం జోక్యం తర్వాత మణిపూర్‌ పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చింది.  జులై 18వ తేదీ నుంచి మణిపూర్‌లో మరో మరణం సంభవించకుండా చూశాం అని అమిత్‌ షా మీడియాకు వివరించారు. 

మే 3వ తేదీ నుంచి జరుగుతున్న మణిపూర్‌ ఘర్షణలతో ఇప్పటిదాకా 147 మంది మరణించగా.. 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే.. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుఉలోనే ఉన్నాయని.. 72 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారని.. 82 శాతం విద్యార్థులు తిరిగి బడి బాట పట్టారని వెల్లడించారు. వీలైనంత త్వరలో మణిపూర్‌ గడ్డపై శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో సాధారణం అవుతాయని భావిస్తున్నట్లు అమిత్‌ షా తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement