పాటకు పట్టాభిషేకం! | 'Music World' rajesh special interview | Sakshi
Sakshi News home page

పాటకు పట్టాభిషేకం!

Published Tue, Aug 12 2014 10:53 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

పాటకు పట్టాభిషేకం! - Sakshi

పాటకు పట్టాభిషేకం!

మీలో గానప్రతిభ ఉంది.
ఆ  ప్రతిభకు తగిన వేదిక గురించి మీకు తెలియకపోవచ్చు.
మీకు సంగీతం అంటే బోలెడు ఇష్టం ఉంది.

 
సంగీతానికి సంబంధించిన సరికొత్త ముచ్చట్లను, బంగారంలాంటి పాత పాటలను,  అంతగా ఎవరూ వినని అద్భుతమైన పాటలను... ఇతరులతో పంచుకోవాలనే ఉత్సాహం మీలో ఉంది. మీలో ఇవన్నీ ఉన్నవి నిజమే అయితే ఫేస్‌బుక్‌లో  ఆదరణ పొందుతున్న ‘మ్యూజిక్ వరల్డ్’ మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. మీలో ప్రతిభను ప్రపంచానికి చాటుతుంది....
 
 
 రాజేష్‌శ్రీ, సురేఖాదాస్, అరుణా రమేష్....హైదరాబాద్‌కు చెందిన ఈ  ముగ్గురికి ఉన్నత సాహిత్యవిలువలు ఉన్న పాటలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే వారిని ఒకచోట కలిపింది. ఒకరికొకరు సినీ పాటల సంగీత మాధుర్యాలను క్రమం తప్పకుండా ‘ఫేస్‌బుక్’లో షేర్ చేసుకునేవారు. ‘‘మనలాంటి అభిరుచి ప్రపంచంలో ఎంతో మందికి ఉంటుంది. వారందరినీ ఎందుకు కలుపుకుపోకూడదు!’’ అని  భావించారు.

ఉత్తమ పాటల సేకరణ...

అలా వారి ఆలోచనల నుండి పుట్టుకొచ్చిందే ‘మ్యూజిక్ వరల్డ్’. 2011లో ఫేస్‌బుక్‌లో ప్రారంభమైన ఈ సంస్థ పేరుకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ‘మ్యూజిక్ వరల్డ్’ ద్వారా టాలెంట్ హంట్ సాగించారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందులో ఎన్ని మంచి పాటలు ఉన్నా వాటికి అంతగా ప్రాచుర్యం లభించదు. గొప్పగా ఉండి కూడా ప్రాచుర్యానికి నోచుకోని తెలుగు సినిమా పాటలు బోలెడు ఉన్నాయి. అలాంటి పాటలను సేకరించి వాటిలోని రచనా వైశిష్ట్యాన్ని, స్వరరచనలోని గొప్పదనాన్ని విశ్లేషిస్తూ అన్ని వివరాలతో ‘పాటకు పట్టాభిషేకం’ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో పెట్టేవారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎన్నో లైక్‌లతో కొద్దికాలానికే  ఎంతో మంది సభ్యులయ్యారు.

వర్ధమాన గాయనీ గాయకులను అనేక టీవీ చానళ్లు పరిచయం చేస్తున్నాయి. అయితే అక్కడికి చేరుకోవడం ఎలాగో చాలా మందికి తెలియదు. అలాంటి వారికి ఒక వేదికగా ‘పాటకు పట్టాభిషేకం’ను ఫేస్‌బుక్‌లో తీర్చిదిద్దారు. ఔత్సాహిక గాయకులు తాము పాడిన పాటను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పోస్ట్ చేస్తారు. ఇలా వచ్చిన పాటలను ‘మీరు పాడిన పాటలు’ పేరుతో ప్రతి శని, ఆదివారాల్లో వినవచ్చు. తద్వారా ఔత్సాహిక గాయకులలోని గానప్రతిభ ప్రపంచానికంతా తెలుస్తుంది. కేవలం పాడే వారి కోసమే కాదు, రాసే వారి కోసం కూడా ఒక వేదిక కలిపించడానికి ‘మీరు రాసిన పాటలు’ ప్రతి గురువారం ఫేస్‌బుక్‌లో సిద్ధంగా ఉంటుంది. లలిత సంగీతం, జానపద గీతాల కోసం ప్రతి శుక్రవారం, శని, ఆదివారాలు కేటాయించారు. సినీ సంగీతకారుల పుట్టిన రోజుల్లో ప్రత్యేక వ్యాసాలు, ప్రత్యేక కార్యక్రమం, వీడియోలు పోస్ట్ చేస్తారు.

ఈ స్నేహం... భగవంతుడి వరం

గ్రాఫిక్స్ డిజైనర్ అయినా రాజేశ్‌శ్రీకి  సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టం ఆయనతో పాటు పెరిగి పెద్దదైంది. పాత, కొత్త సినిమా పాటలపై ఫేస్‌బుక్‌లో విశ్లేషణలు రాయడం ద్వారా తన అభిరుచిని లోకంతో పంచకునేవారు. ఆలా ఆయనకు ఎందరో తోడయార్యురు.

గత సంవత్సరం హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ‘మ్యూజిక్ వరల్డ్’ సమావేశానికి దేశం నలుమూలల నుంచి 80 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి 26న కేవలం గాయకుల కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి వందమంది హాజరయ్యారు. ఔత్సాహిక గాయకులను ప్రపంచానికి పరిచయం చేయాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

‘‘నిర్వహణకు సంబంధించిన ఖర్చులను మేము ముగ్గురమే భరిస్తున్నాం. మా ముగ్గురిదీ భగవంతుడు కల్పించిన స్నేహం. అందుకే మ్యూజిక్‌వరల్డ్‌కు సంబంధించిన పనులను భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మా సభ్యుల సంఖ్య పద్నాలుగు వేలకు చేరుకుంది. ఇప్పటి వరకు ముఫ్పైమంది ఔత్సాహిక గాయకులకు మంచి అవకాశం కల్పించామనే తృప్తి ఉంది’’ అంటున్నారు ఆనందంగా రాజేష్‌శ్రీ.

 రాశి కాదు... వాసి ముఖ్యం

‘మ్యూజిక్ వరల్డ్’లో వీలైనంత ఎక్కువమందిని చేర్పిండమే లక్ష్యం కాదు. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిస్తున్నారు. సభ్యత్వం కోరుకునేవారి వ్యక్తిగత వివరాలను పరిశీలిస్తారు. సభ్వత్వం ఇచ్చిన తరువాత వారి ప్రవర్తనను పర్యవేక్షిస్తారు. ఇతర సభ్యుల పట్ల సభ్యతగా వ్యవహరించిన వారికి మాత్రమే సభ్యత్వం ఇచ్చి గుర్తింపు కార్డును జారీచేస్తుంటారు. ‘‘వృత్తిపరమైననులు, ఇంటి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మ్యూజిక్ వరల్డ్ కోసం తగిన సమయం కేటాయిస్తున్నాను. ప్రతిరోజూ నాకు కేటాయించిన పనులు పూర్తి చేస్తుంటాను. ఇష్టమైన పని కావడంతో, పని చేస్తున్నట్లు కాదు...పాటతో చెలిమి చేస్తున్నట్లుగా ఉంటుంది’’ అంటున్నారు సురేఖదాస్.
 ‘‘ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే ఉదయం 8.30 గంటలకు సంగీత కార్యక్రమాలపై దృష్టి పెడతాను. కొంత విరామం తరువాత మళ్లీ 11.30 గంటల నుండి మ్యూజిక్‌వరల్డ్ బాధ్యతల్లో మునిగిపోతాను. రాత్రి 7-9 గంటల మధ్యలో ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంటాను.’’ అంటున్న అరుణా రమేష్ తాను చేస్తున్న పనిలో ఎంతో తృప్తి ఉందని చెబుతుంటారు. ‘మ్యూజిక్ వరల్డ్’ ద్వారా ఈ ముగ్గురు మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని ఆశిద్దాం.

విశాఖపట్టణం దగ్గర ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక యువ గాయకుడు ఆర్థికపరిస్థితి దృష్ట్యా అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నించలేదు.  ఈ నేపథ్యంలో ‘మ్యూజిక్ వరల్డ్’ అతని గానప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది.  
 ఈ కుర్రాడు డీడీలో ప్రసారమయ్యే ‘ఆలాపన’, రకరకాల స్టేజ్ షోలలో పాడాడు. పేరు తెచ్చుకున్నాడు. ఇలా ‘మ్యూజిక్ వరల్ట్’ ఇస్తున్న ప్రోత్సాహంతో అజ్ఞాతంలో ఉన్న ఎందరో గాయకుల ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతోంది.
 

 - కొట్రా నందగోపాల్, సాక్షి, చెన్నై,  ఫోటోలు: వన్నె శ్రీనివాసులు
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement