ఏ కోరికైనా సరే! సరైన ప్లానింగ్ ఉంటే సాధించటం కష్టమేమీ కాదు. చిరుద్యోగులైనప్పటికీ అనురాధ, రాఘవ దంపతులు తమకిష్టమైన కారు కొనుక్కోగలిగారంటే ప్లానింగ్ వల్లే. ఇక్కడ కారు కొనటం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. కానీ... తాము అనుకున్న రీతిలో, అనుకున్న కారును... ఇంకా చెప్పాలంటే ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం నుంచి డౌన్‌పేమెంట్ వరకు, లోను వ్యవధి వరకు అంతా తాము ప్లాన్ చేసినట్లుగానే చేయగలిగారు వీళ్లిద్దరూ. అదెలా సాధ్యమైందో మీరూ చూడండి.
‘మా ఇద్దరివీ ప్రైవేటు ఉద్యోగాలే. కారు కొనుక్కోవాలన్నది మా చిరకాల కోరిక. కొన్నాళ్లు ఆగినా... ఇక కొనేయాల్సిందేనని అనుకున్నాక ఎలా..? అనే ప్రశ్న తలెత్తింది. ముందు డౌన్‌పేమెంట్ గురించి ఆలోచించాం. మా ఇద్దరి జీతాల్లోంచీ నెలకు రూ.10 వేలు పక్కనపెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదని మాకు తెలుసు. అందుకని నెలవారీ వాయిదా రూ.10 వేలు మించకూడదనుకున్నాం. దాన్నిబట్టి డౌన్‌పేమెంట్‌గా ఎంత చెల్లించాలన్నదానిపైనా ఒక అవగాహనకు వచ్చాం. డౌన్‌పేమెంట్ ఎంత కావాలో తెలిసింది కనుక దానికోసం రెండేళ్లపాటు జీతాల్లో నుంచి కొంత మేర తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టాం.
మారుతి కారు కొనాలని ముందే అనుకున్నాం. కాకపోతే ఏ మోడల్ తీసుకోవాలన్నది మాత్రం అంత త్వరగా తేలలేదు. మా వారు దీనికోసం దాదాపు ఏడాది పాటు స్టడీ చేశారు. ప్రతి మోడల్ ఖరీదు... మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ ఆరా తీసి తెలుసుకున్నారు. మా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని... చివరకు స్విఫ్ట్ డిజైర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. మొత్తం నగదు చెల్లించి కారు తీసుకునే అవకాశమెటూ లేదు. కాబట్టి రుణం తీసుకోక తప్పదు. అయితే మేం ఒక్కటే అనుకున్నాం. రుణం మూడేళ్లలో తీరిపోవాలి. ఈఎంఐ 10వేలు మించకూడదు. దాని ప్రకారమే మా ప్లానింగ్ సాగింది.
ఇంకో విషయం చెప్పాలి. మేం బుక్ చేసుకున్నా కారు అంత సులువుగా రాలేదు. మారుతి ప్లాంటులో కార్మికుల సమ్మె వంటి గొడవల వల్ల డెలివరీకి దాదాపు ఏడాది పట్టేసింది. దాంతో బుక్ చేసినప్పుడున్న రూ. 7.6 లక్షల రేటు చేతికొచ్చేలోగా రెండు సార్లు పెరిగి రూ.7.8 లక్షలకు చేరింది. ఇలాంటివాటికి కూడా సిద్ధమై ఉండాలన్నది అప్పుడు తెలి సింది. మొత్తానికి ఏడాదిన్నర కిందట కారు చేతికొచ్చింది. మరో ఏడాదిన్నర గడిస్తే రుణం కూడా తీరిపోతుంది. క్రమం తప్పని పొదుపు... కొనాలనుకున్నదానిపై కొంత అధ్యయనం... బడ్జెట్ అదుపునకు ప్లానింగ్... ఈ మూడూ ఉంటే ఏదైనా కొనొచ్చని తెలుసుకున్నాం.’
- కామని అనూరాధ, హైదరాబాద్
ఇలాంటి విజయగాథలు మీకూ ఉంటే మాతో పంచుకోండి. మీ వివరాలతో సాక్షి కార్యాలయానికి లేఖ రాయండి. లేదా business@sakshi.comకి ఈమెయిల్ కూడా పంపవచ్చు.