మా ఆవిడ ఒకప్పుడు విపరీతంగా ఖర్చు చేసేది...
మా ఆవిడకు సౌందర్య స్పృహ కాస్త ఎక్కువ. దీంతో విపరీతంగా ఖర్చు చేసేది. మార్కెట్‌లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా కొనాల్సిందే. కొన్న వస్తువుల గురించి గంటల కొద్దీ తన ఫ్రెండ్స్‌తో మాట్లాడేది. ఇల్లు గడవడానికి పూర్తిగా నా జీతం డబ్బులే ఆధారం. వేరే ఆదాయ వనరులేవీ లేవు. ఇదేమీ గ్రహించకుండా తన ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేసి నా చేతి చమురు వదిలించేది.
ఆమె డబ్బు అడగ్గానే- ‘‘ఎందుకు? ఏమిటి?’’ అని అడిగే సాహసం చేయలేకపోయేవాడిని.
ఒకసారి ఇలా అడిగిన పాపానికి పెద్ద గొడవ అయింది. అందుకే ఆమె ఎంత డబ్బు అడిగినా కిమ్మనకుండా ఇచ్చేవాడిని. ఆమె ఖర్చుల పుణ్యమా అని నేను అప్పులు కూడా చేయడం ప్రారంభించాను. ఒకరోజు మా ఆవిడతో సున్నితంగా చెప్పాను - ‘‘నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ అనసవరపు ఖర్చు ఎందుకు చెప్పు?’’ అని. ‘‘నువ్వు రోజూ తినడం ఎందుకు? వారానికి ఒక్కరోజు తింటే సరిపోతుంది కదా. చాలా డబ్బులు మిగులుతాయి’’ అన్నది వ్యంగ్యంగా.
సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కాలేదు. మరోవైపు ఆమె ఖర్చుల పుణ్యమా అని నా అప్పుల జాబితా అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఓపిక పట్టే శక్తిని పూర్తిగా కోల్పోయాను. ఒకరోజు మాత్రం పెద్ద ఎత్తున మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారం రోజుల పాటు మా మధ్య మాటలు లేవు. హోటల్లోనే తినేవాడిని. పరిస్థితి విషమిస్తోందని తెలిసి, నా ఫ్రెండ్ మా ఇద్దరినీ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. అక్కడికి విడివిడిగా వెళ్లాం.
విందు తరువాత మా ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని డబ్బు విలువ గురించి చెప్పాడు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే డబ్బు లేనప్పుడు ఎలా ఇబ్బంది పడాల్సి వస్తుందో తన సొంత అనుభవాల్లో నుంచి చెప్పాడు. అప్పటి నుంచి ఆమెలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తోంది. అనవర ఖర్చులు తగ్గించి పొదుపు చేయడం నేర్చుకుంది! - సిడిఆర్, విశాఖపట్టణం