శాంతి కపోతం | Naina jaiswal Ambassador For World Peace | Sakshi
Sakshi News home page

శాంతి కపోతం

Published Sat, Jun 13 2020 8:25 AM | Last Updated on Sat, Jun 13 2020 8:25 AM

Naina jaiswal Ambassador For World Peace - Sakshi

∙వరల్డ్‌ పీస్‌ అంబాసిడర్‌ సర్టిఫికెట్‌తో నైనా

చిన్నప్పుడే పెద్ద చదువులు చదివింది చిన్నప్పుడే జాతీయ అంతర్జాతీయ విజయాలను సొంతం చేసుకుంది చిన్నప్పుడే తనకంటే పెద్ద వాళ్లను చైతన్యపరిచింది.ఐక్యరాజ్య సమితి ఇరవై ఏళ్ల నైనా జైస్వాల్‌ను
ప్రపంచ శాంతి రాయభారిగా నియమించింది.ఈ శాంతి కపోతం ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం పని చేస్తోంది.

నైనా జైస్వాల్‌... బాల మేధావి. తరచూ వార్తల్లో ఉంటుంది. ఎనిమిదేళ్లకు టెన్త్‌ క్లాసు, పదేళ్లకు ఇంటర్, పదమూడేళ్లకు గ్రాడ్యుయేషన్, పదిహేనేళ్లకు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తోంది. పరిశోధన పూర్తయింది, ప్రెజెంటేషన్‌కు కొరోనా అడ్డొచ్చింది. చదువుతోపాటు క్రీడాకారిణిగా కూడా రాణించింది. టేబుల్‌ టెన్నిస్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌లో మొత్తం పాతిక టైటిల్స్‌ని సొంతం చేసుకుంది. మోటివేషనల్‌ స్పీకర్‌గా తొలి ఉపన్యాసం ఇచ్చే నాటికి ఆమె వయసు ఎనిమిది, ఇప్పుడు ఇరవై. దేశవిదేశాల్లో వందలాది ఉపన్యాసాలిచ్చింది. ఇవన్నీ చూసిన ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ) ఈ నెల ఎనిమిదవ తేదీన ఆమెను ‘వరల్డ్‌ పీస్‌ అంబాసిడర్‌’గా నియమించింది. ఈ కొత్త బాధ్యతల్లో నైనా జైస్వాల్‌  ఐక్యరాజ్య సమితి చేపట్టిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మోటివేషనల్‌ స్పీకర్‌గా నైనా విద్యాసంస్థలతోపాటు మారుమూల ప్రదేశాల్లో నివసించే మహిళలను కూడా చైతన్యవంతం చేస్తోంది. ఈ సామాజిక చైతన్య కార్యక్రమాలే నైనాను ఐక్యరాజ్య సమితి పీస్‌ అంబాసిడర్‌ని చేశాయి.

ఇప్పుడేం చేయాలి?
నైనా జైస్వాల్‌ ఇప్పటి వరకు చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి పెట్టింది కీర్తికిరీటం మాత్రమే కాదు, అంతకంటే పెద్ద బాధ్యత కూడా. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఐక్యరాజ్య సమితి చేపట్టిన సామాజిక లక్ష్యాలు పదిహేడు. అవి ఆకలి బాధలు, దారిద్య్రం లేని సమాజ నిర్మాణం. మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, స్త్రీ పురుష సమానత్వ సాధన, అందరికీ పరిశుభ్రమైన నీటిని అందించడం, సౌర శక్తి వనరును అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, గౌరవప్రదమైన ఉద్యోగ వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక రంగాల ఏర్పాటు, అసమానత్వాన్ని తగ్గించడం, నగరాలు– నివాస ప్రాంతాల నిరంతరత, బాధ్యతాయుతమైన వినియోగం– ఉత్పాదకత, వాతావరణ మార్పులు, నీటిలోపల నివసించే జీవుల జీవనభద్రత, భూమి మీద నివసించే జీవుల పరిరక్షణ, శాంతియుతమైన, న్యాయబద్ధమైన సంస్థల నిర్వహణ, లక్ష్యాల సాధనలో ప్రజలను భాగస్వాములను చేయడం. వీటిలో ప్రతి పదం వెనుక విస్తృతమైన పరిధి ఉంది. ఎంత చేసినా తరగని గనిలా పని ఉంటుంది. ఇంతపెద్ద బాధ్యతను లేద భుజాల మీద పెట్టింది యూఎన్‌ఓ. ఈ బాధ్యతకు ఎంపికైన తొలి ఇండియన్‌ నైనా జైస్వాల్‌. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు కూడా. ఈ ఏడాది సెప్టెంబర్‌ 21వ తేదీన బెర్లిన్‌ నగరం, బ్రాండెన్‌ బర్గ్‌ గేట్‌ వద్ద జరిగే వరల్డ్‌ పీస్‌డే సదస్సుకు హాజరయ్యి సదస్సులో ప్రసంగించనుంది. ఈ సదస్సులో వందకు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారు. 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సంగీత కవాతు కూడా ఉంటుంది.

ఊహించని వరమే
నైనా పీహెచ్‌డీతోపాటు ఆమె ప్రవృత్తిగా ఎంచుకున్న మోటివేషనల్‌ స్పీకర్‌గా ప్రసంగాలు కూడా సమాజం, మహిళలు, యువత, పిల్లల అభివృద్ధి ప్రధానాంశాలుగా ఉంటాయి. ‘రోల్‌ ఆఫ్‌ మైక్రో ఫైనాన్స్‌ ఇన్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌’ ఆమె పరిశోధనాంశం. మనదేశంలో మారుమూల ప్రదేశాల నుంచి యూఎస్‌లోని ప్రధాన నగరాల వరకు ఆమె వందకు పైగా ప్రదేశాల్లో పర్యటించి ప్రసంగించింది. ఇప్పుడు అదే పనిని మరింత విస్తృతంగా చేస్తానంటోంది నైనా. పీస్‌ అంబాసిడర్‌గా నేను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల మీదనే దృష్టి పెడతానంటోంది. ‘‘గ్రామాలకు చేయాల్సింది చాలా ఉంది. ప్రపంచం ఎప్పుడూ విశాలంగానే ఉంటుంది. అయితే ప్రపంచీకరణ కారణంగా దేశాలు దగ్గరైపోయాయి. డిజిటల్‌ యుగంలో సమాచార ప్రసారం వేగవంతమైంది. అయినా కొన్ని మారుమూల గ్రామాలు, అక్కడి మహిళలు ఆధునికత, అభివృద్ధికి దూరంగా ఉన్నారు. యూఎన్‌ఓ నిర్దేశించిన లక్ష్యాలను వాళ్లకు దగ్గర చేయగలిగితే గ్రామాల జీవన ముఖచిత్రమే మారిపోతుంది. వారిని సామాజికంగా చైతన్యవంతం చేయడంతోపాటు సాంకేతికాభివృద్ధి మీద అవగాహన కల్పిస్తే యూఎన్‌ఓ లక్ష్యాలు దాదాపుగా నెరవేరినట్లే. నేను ఇన్నాళ్లూ మహిళల కోసమే పని చేశాను. మహిళల సాధికారత సాధన గురించి అధ్యయనం కూడా చేశాను. ఈ సమయంలో వాళ్లకు అవగాహన ఏర్పరచడం కోసం నాకు మంచి అవకాశం వచ్చింది. నిజంగా నాకు సరైన సమయంలో మంచి అవకాశం వచ్చింది’’ అన్నది నైనా. ఈ సందర్భంగా యూఎన్‌ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పింది నైనా జైస్వాల్‌.
– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement