
కీమోథెరపీ వంటి సంప్రదాయ చికిత్సలకూ లొంగని కేన్సర్లను నానోవైద్యంతో అదుపులోకి తేవచ్చునని అంటున్నారు వేన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆక్సిజన్ సరఫరా తగ్గినా, పెరుగుదలను ప్రోత్సహించే కణాలు చేరినా కేన్సర్ కణితులు కీమోథెరపీకి ప్రతిస్పందించవని ఇప్పటికే గుర్తించారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని నానోకణాలను ప్రయోగిస్తే మాత్రం భిన్నమైన ఫలితాలు వస్తాయని అరుణ్ అయ్యర్, సమరేశ్ సాహులతో కూడిన శాస్త్రవేత్తల బృందం నిరూపించింది.
నానోకణాలు నేరుగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న కణాలను, కణితి పెరుగుదలకు కారణమవుతున్న రోగ నిరోధక వ్యవస్థ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయని, అంతేకాకుండా సాధారణ పరిస్థితుల్లో కేన్సర్ కణితులను నాశనం చేసే రోగ నిరోధక వ్యవస్థ కణాలను ప్రోత్సహిస్తాయని అరుణ్ వివరించారు. అంతేకాకుండా నానో కణాలు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కణితిని గుర్తిస్తాయని, కణితి గుర్తింపు, దశ నిర్ధారణ, శస్త్రచికిత్స ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం వంటి అంశాలన్నింటికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పైగా నానో కణాలను జోడించడం వల్ల కీమోథెరపి మరింత సమర్థంగా, తక్కువ దుష్ఫలితాలతో పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం తాము రీనల్ సెల్ కార్సినోమాకు సంబంధించి కొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ ఇతర కేన్సర్ల విషయంలోనూ ఈ పద్ధతి సమర్థంగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment