కేన్సర్ చికిత్సకు వాడే మందులతో బోలెడన్ని దుష్ప్రభావాలు ఉంటాయని అందరికీ తెలుసు. అందుకే ఈ దుష్ప్రభావాలను వీలైనంత తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అతి సంక్లిష్టమైన ప్రొటీన్ల నిర్మాణాన్ని నియంత్రించడం ద్వారా అతితక్కువ చెడు ప్రభావాలను చూపగల కేన్సర్ మందుల తయారీకి వీరు మార్గం సుగమం చేశారు. ప్రొటీన్లతో కేన్సర్‌కు మాత్రమే కాకుండా అనేకానేక ఇతర వ్యాధులకు సమర్థమైన చికిత్స అందించవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ సంక్లిష్ట నిర్మాణం కారణంగా ఇప్పటివరకూ అది సాధ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జెన్సిన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కొన్ని పరిశోధనలు చేపట్టింది. హిస్–ట్యాగ్ అకైలేషన్ అని పిలిచే ఈ పద్ధతిలో ప్రొటీన్లకు నిర్దిష్టమైన పరమాణువులను అతికించడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ప్రొటీన్లు కేవలం కేన్సర్ కణాలకు మాత్రమే అతుక్కుంటాయి. ఆరోగ్యకరమైన వాటిని వదిలేస్తాయి. ఫలితంగా దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయన్నమాట. ఈ కొత్త పద్ధతిని ఉపయోగిస్తే కొత్తరకమైన ప్రొటీన్ ఆధారిత మందుల తయారీ రోగనిర్ధారణ కూడా సులువు అవుతుందని అంచనా. ఉదాహరణకు ప్రతీదీప్తినిచ్చే పరమాణువులను ప్రొటీన్లకు అతికిస్తే శరీరంలో అది ఎక్కడికెళ్లిందో సులువుగా చూడవచ్చునని జెన్సిన్ తెలిపారు.
రోగ నిరోధక వ్యవస్థకూ మధుమేహానికీ లంకె...!
తిండి ద్వారా ఊబకాయమొస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా మీ సాయానికి రాదని వైద్యశాస్త్రం చెబుతుంది. తెల్ల రక్తకణాలు నేరుగా అడిపోస్ కొవ్వుకణజాలంలోకి చేరిపోయి మంట/వాపులకు కారణమవుతున్నాయని, ఇది కాస్తా చివరకు మధుమేహానికి దారితీస్తుందని కూడా శాస్త్రవేత్తలకు తెలుసు. ఎలా జరుగుతుందన్న విషయాన్ని మాత్రం వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా తెలుసుకోగలిగారు.
కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అందించి ఎలుకలపై ప్రయోగాలు జరిపినప్పుడు సీడీ 8 + తెల్ల రక్తకణాలు చైతన్యవంతమవుతున్నాయని, కొవ్వులు దహనమయ్యే ప్రక్రియలో విడుదలయ్యే ఐసోలెవుగ్లాన్‌డిన్స్ రసాయనాలతో సీడీ 8 + కణాలు బ్యాక్టీరియా, వైరస్, అనారోగ్య కణాలపై దాడులు చేస్తాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వ్యాట్ మెక్‌డోనెల్ తెలిపారు. అయితే ఇవే కణాలు కొవ్వు కణజాలంలో మాత్రం మంట/వాపులకు కారణమవుతుందని అన్నారు. ఇది కాస్తా ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా మధుమేహం వస్తుందని వివరించారు. ఐసోలెవుగ్లాన్‌డిస్ రసాయనాల ఉత్పత్తిని నియంత్రించే మందులను తయారు చేయడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతను అధిగమించేందుకు అవకాశముంటుందని తమ పరిశోధన చెబుతోందని చెప్పారు.
జాబిల్లిపై షికారుకు టూరిస్ట్ రెడీ...
అంతరిక్ష విహార యాత్రకు రంగం సిద్ధమైపోయింది. ఈలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ త్వరలో జాబిల్లిపైకి పంపే బిగ్ ఫాల్కన్ రాకెట్‌లో ప్రయాణించేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్ని నెలల్లో తొలి ప్రయోగం జరుగుతుందని అంచనా. ఈ తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరన్న ప్రశ్నకు మస్క్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. ట్విట్టర్‌లో జపాన్ జాతీయ పతాకాన్ని పోస్ట్ చేసి ఆ దేశపు వ్యక్తి అని సూచించారు.
ఆ తరువాత స్పేస్ ఎక్స్ ఇంకో ట్వీట్ చేస్తూ ఇప్పటివరకూ జాబిల్లిని చుట్టివచ్చిన వారు కేవలం 24 మంది మాత్రమేనని, 46 ఏళ్లు గడిచినా 25వ వ్యక్తి చందమామను చేరకపోయేందుకు అనేక కారణాలున్నాయని వివరించారు. రాకెట్ తయారీకి అనుమతులు లభించడంతోపాటు, ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఉన్న ఇబ్బందుల వల్ల ప్రయోగం కొంచెం అటు ఇటు కావచ్చునని సూచించారు. దాదాపు 350 అడుగుల ఎత్తున్న బిగ్ ఫాల్కన్ రాకెట్ల ద్వారా ముందుగా జాబిల్లిపైకి.. ఆ తరువాత కొన్నేళ్లకు అంగారకుడిపైకి మనుషులను పంపుతానని ఈలాన్ మస్క్ ఏడాది క్రితమే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment