
‘ఒప్పుకోవాలంటే మనసొప్పదు గానీ జీవితాలన్నీ చైనా ఫోన్లే ఫీచర్స్ ఎక్కువే.. లైఫ్ ఉండదు’ అంటున్న నరేష్‌కుమార్ తొలి కవితాసంపుటి ‘నిశ్శబ్ద’. కవిత్వం అనేది అతడికి ఏమిటంటే: ‘‘కవి కడుపుతో ఉంటాడు, కవిత్వాన్ని కంటాడు, కవిత రాయటం ఓ అద్భుతం, నాలో రగిలే అగ్గిని ఈ సమాజం మీదికి వెలుగులా విసురుతున్నా... బ్లా బ్లా బ్లా! యేమో, నేనెప్పుడూ కవిత్వాన్ని పెద్దగా ప్రేమించలేదు, కవిత్వం రాయటాన్ని అద్భుతంగా ఫీలవ్వలేదు కూడా. రాయటం అంటే సమాజం, సాహిత్య ప్రయోజనం అన్నాడూ అంటే యెందుకో జాలి అనిపిస్తుంది. నా వరకూ కవిత్వం వొక సెల్ఫ్ వామిట్, అదొక సొంత విషయం. అయితే కొన్నిసార్లు రాసినవాడి ఫీల్ చాలామందిలో ఉన్నప్పుడు, రాసిన కాలపు పరిస్థితులే మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యి సార్వజనీనం అవ్వొచ్చు.
జరిగిన, జరుగుతున్న ఘటనలకి నిజంగా స్పందిస్తే తనకు తానుగా రాస్తాడు. అప్పుడు కూడా అది రాసినవాడి సొంతబాధనే అవుతుంది. అది వేరొకరి కోసం అనడు, అనుకోలేడు. ‘‘వాడు బాధ పడుతున్నాడు కాబట్టి అతని కోసం నేను కవిత్వం రాస్తున్నా’’ అని కొన్ని అక్షరాలను రాయటం కన్నా ఆధిపత్యభావం మరోటి లేదనే అనుకుంటాను. ఈ నిశ్శబ్ద కూడా నా సొంత గొడవ, ప్రతి అక్షరమూ నాకోసం, నాలోంచి వచ్చిందే తప్ప ‘‘సమాజ ఉద్ధరణ’’ అన్న కారణం యేమాత్రమూ లేదు. అట్లా అని ఈ అక్షరాలకి నేను సొంతదారున్నీ కాను. నేను రాయటానికీ, నేను బతకటానికీ కారణమైన ప్రతి మనిషికీ, నా చుట్టూ ఉన్న ఈ ప్రకృతికీ ఈ రాతలమీద హక్కూ, అధికారమూ ఉంది. వీరంతా లేకుంటే రాయాల్సిన అవసరమూ, అవకాశమూ రెండూ లేవు గనక’’.
నిశ్శబ్ద (కవితా సంపుటి) కవి: నరేష్కుమార్ సూఫీ;
పేజీలు: 152;
వెల: 150;
ప్రచురణ: కవిసంగమం బుక్స్.