మరణానంతర పరిపూర్ణత | Article On Sahityam Pai Bala Gopal Rupam Saram | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 11 2019 12:29 AM | Last Updated on Mon, Feb 11 2019 12:29 AM

Article On Sahityam Pai Bala Gopal Rupam Saram - Sakshi

రూపం–సారంను విస్తరించి తెచ్చిన ‘సాహిత్యంపై బాలగోపాల్‌’ పుస్తకంలో బుర్ర రాములు ‘ఏడో సారా కథ’కు కె.బాలగోపాల్‌ రాసిన ముందుమాట ఉంది. అందులో ఈ వ్యాఖ్యానం ఆసక్తికరం. అది ఇక్కడ. పుస్తక ప్రచురణ, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌.

‘జీవితంలో మనుషులు కోరుకునేది ఏదీ పరిపూర్ణంగా దొరకదు. శ్రమకు తగిన ఫలం, వ్యక్తిత్వానికి తగిన గుర్తింపు మాత్రమే కాదు. ప్రేమ, సౌందర్యం, సంతోషం, ఏదీ మానవ జీవితంలో పరిపూర్ణంగా లభించదు. దయ, సాహసం, దాతృత్వం వంటి గుణాలేవీ మనుషులు పరిపూర్ణంగా ప్రదర్శించలేరు. మానవ జీవితంలోని అన్ని కోణాలలోనూ ఉన్న ఈ అపరిపూర్ణతకు శ్రమ దోపిడీ, అణచివేత, అసమానత, పేదరికం వంటి వ్యవస్థాగతమయిన విషయాలు కొంతమేరకు కారణం. కానీ వాటన్నింటిని వడబోసినా, మానవ అస్తిత్వానికి స్వాభావికమయిన అపరిపూర్ణత మిగిలిపోతుంది. మనిషి ఆలోచన మట్టుకే పరిపూర్ణతను భావించుకోగలదు... నిజానికి ఆ తపనే మనిషిని ఆచరణకు కదిలించే శక్తులలో ఒకటి. మనిషిలో ఆ తపనే లేకపోతే మానవ చరిత్ర ఈ విధంగా ఉండేదే కాదు. బహుశా చరిత్ర అనేదే ఉండేది కాదేమో. ‘హృదయం లేని’ ఈ ప్రపంచంలో ఈ తపన పూర్తిగా తీరదు. కాబట్టి పరిపూర్ణమైన మరణానంతర జీవితంలో మనుషులు దానిని ఊహాత్మకంగా తీర్చుకుంటారు. అక్కడ జీవితం నిజంగానే అజరామరం... వ్యవస్థాగతమయిన అసమానతలకు, వ్యవస్థతో సంబంధం లేని జీవిత అపరిపూర్ణతకు ఆ ఊహలో ఏక సమయంలో పరిహారం దొరుకుతుంది.

మతంతో కలగలిసిపోయిన ఈ మరణానంతర ఊహ కాలక్రమంలో పురోహితుల చేతిలో చిక్కి పాలక భావజాలానికి ఉపయోగపడింది... ఇది చాలా శక్తివంతమైన భావజాలానికి దారి తీసింది. ఈ భావజాలం నుండి పీడిత ప్రజలను విముక్తి చేయడం కోసం కృషి చేయాలని అభ్యుదయ ఉద్యమాలు గుర్తించాయి. ఈ విషయంలో ఈ ఉద్యమాల ఆచరణ ఇంకా చాలా శక్తివంతంగా సాగవలసి ఉంది. ‘పునాది ముందు మారితే ఉపరితలం తరువాత మారుతుంది’ అనే వైఖరి వదులుకోవాలని ఈ మధ్య విమర్శకులు గుర్తిస్తున్నారు. అంతేకాదు భావజాలం అనేది ప్రజల మెదళ్లలో పాలక వర్గాలు బలవంతంగా చొప్పించే కృత్రిమ ఆలోచన అనే అవగాహన కూడ వదిలించుకోవాలి.

మరణానంతర జీవితానికి సంబంధించిన ఊహ మనిషిని బలంగా ఆకర్షిస్తుంది. కాబట్టే అది పాలక భావజాలానికి అంతగా ఉపయోగపడగలిగింది. పాలక భావజాలం మూలాలు వెతికితే మనిషికి స్వాభావికమైన అవసరాలు, లక్షణాలు, ప్రవర్తనారీతులు, ఆలోచనా సరళి తగులుతాయి. ఇవే భావజాలానికి ‘కారణం’ కాదు. భావజాలానికి కారణం, అవసరం వ్యవస్థ నుండే వస్తాయి. కానీ భావజాలానికి బలం చేకూర్చే మూలాలు మానవ అస్తిత్వానికి స్వాభావికమైన గుణాలలో ఉంటాయి. భావజాలం సాధించేది అప్పటి వ్యవస్థాగతమైన ప్రయోజనాలనే. కానీ అది ఆధారపడేది మానవ అస్తిత్వానికీ స్వభావానికీ సార్వజనీనంగా ఉండే లక్షణాల ప్రత్యేక విశదీకరణపైన. అందుకే భావజాలాలు అంత బలంగా ఉండగలుగుతాయి. భావజాలానికి ఉండే బలం కేవలం అది కాపాడే భౌతిక ప్రయోజనం నుండి వచ్చేటట్టయితే ఏ పాలక భావజాలమూ ఇంత బలంగా ఉండనవసరం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement