సహజంగా మెరుపు.. | Naturally by lightning .. | Sakshi
Sakshi News home page

సహజంగా మెరుపు..

Published Wed, Oct 29 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

Naturally by lightning ..

ఇంట్లోనే!
 
చర్మం పొడిబారడం, వెంట్రుకలు పెళుసుబారడం.. ఇవన్నీ చలికాలం ఇబ్బంది పెట్టే సమస్యలు. ఇటీవల మారుతున్న ఉష్ణోగ్రతలు చర్మంపై, శిరోజాలపై చెడు ప్రభావం చూపుతున్నాయి. వీటికి ఇంట్లోనే సరైన చికిత్స చేసుకోవచ్చు...
 
శిరోజాలకు అలొవెరా!


షాంపూలు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలం వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగు తుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. అలొవెరా ఆకులను పేస్ట్ చేసి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 15-20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా రసం జుట్ట్టుకు కావలసినంత కండిషన్ లభించేలా చేస్తుంది. దీంతో జుట్టు మెత్తగా, నిగ నిగలాడుతూ ఉంటుంది.
 
గోళ్లు విరిగిపోతుంటే...
 
గోళ్లు పొడవుగా పెంచుకొని, మంచి షేప్ చేయించుకోవాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. కానీ కొందరిలో గోళ్ల పెరుగుదల అంతగా ఉండదు. పైగా కొద్దిగా పెరిగినా త్వరగా విరిగిపోతుంటాయి. దీనికి కారణం... క్యాల్షియం, ఐరన్ లోపం. అందుకని తీసుకునే ఆహారంలో క్యాల్షియం, ఐరన్ పాళ్లు ఎక్కువ ఉన్న పదార్థాలను చేర్చాలి. పాలు, పాల ఉత్పత్తులలో క్యాల్షియం మోతాదు అధికంగా ఉంటుంది. తాజా ఆకుకూరలు, నువ్వులు, పల్లీలు, బెల్లం.. మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చడంతో పాటు రోజూ రాత్రి పడుకునే ముందు నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో కలిపి గోరు మీద రాసి, మసాజ్ చేయాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే గోళ్ల పెరుగుదల బాగుంటుంది. త్వరగా విరిగిపోవు. నెల రోజులకోసారి ఇంట్లోనే మేనిక్యూర్ (గోళ్ల శుభ్రత) చేసుకుంటే అందంగా ఉంటాయి.
 
నలుపు తగ్గాలంటే...
మోచేతులు, మెకాళ్లు, మెడ వద్ద నలుపు ఏర్పడితే ఎంతకీ తగ్గదు. ఇలాంటప్పుడు... స్పూన్ బంగాళదుంప తురుములో టీ స్పూన్ తేనె కలిపి, ఈ మిశ్రమంతో నలుపు ఉన్న భాగంలో రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే, నలుపు తగ్గుతుంది.
 - గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్
 
మీ సౌందర్య సమస్యలకు పరిష్కారాల కోసం రాయవలసిన చిరునామా:
సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34.  
ఈ-మెయిల్: sakshi.features@gmail.com

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement