కొత్త దొంతర | ncapsulate the history of the world 32 | Sakshi
Sakshi News home page

కొత్త దొంతర

Published Thu, Feb 12 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

కొత్త దొంతర

కొత్త దొంతర

 టూకీగా ప్రపంచ చరిత్ర 32

 లొంగిపోయిన మనుషుల భాష ఒకటి, లొంగదీసుకున్న మనుషుల భాష మరొకటి. ‘ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎలా కుదిరింది?’ అంటే, మరోసారి వచ్చీరాని మాటల వయసప్పటి పిల్లలతో మన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళు నీళ్ళను ‘త్రువ్వ’ అంటారు, పాలను ‘బాయి’ అంటారు. గాయాన్ని ‘అబ్బు’ అంటారు. ఇలా ప్రతి వస్తువుకూ వాళ్ళ మాటలు వాళ్ళకుంటాయి. మనం గూడా కొంతకాలంపాటు ఆ భాషలో దిగిపోక గత్యంతరం ఉండదు. అప్పుడుకొంత అప్పుడుకొంత మనలాగే మాట్లాడటం నేర్చుకోక పిల్లలకైనా తప్పదు. ఈ రెండున్నూ ఒత్తిడి కింద జరిగే ప్రక్రియలే. చివరకు పిల్లలు క్రమంగా తల్లి భాషకు లొంగిపోతారు. కానీ, అదే ప్రక్రియ ముదుర్ల మధ్య సాగితే దనపు పదాలు భాషకు తోడౌతాయి.

తన సుదీర్ఘ యాత్రలో మానవుడు నేర్చిన ఇతర విద్యలుగూడా ఎన్నెన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది జంతువులను మచ్చిక చేసుకునే విధానం. అన్నిటికంటే ముందు మనిషికి మచ్చికైన జంతువు కుక్క. అది మనిషిని వెదుక్కుంటూ తానై వచ్చిన జంతువు. నిప్పుల మీద కాలే చియ్యల వాసనకు అది మనిషిని సమీపించింది. సరదాగా విసిరేసే బొమికెల మాలిమితో మనిషికి నౌకరుగా మారిపోయింది. అంత దగ్గరగా, అంత చనువుగా ప్రాణంతోవున్న జంతువును చూడడం ఆ మానవునికి సరికొత్త అనుభవం. తాను తినేందుకు పనికొచ్చే జంతువుగూడా ఇలాగే తన చుట్టూ చేరితే ‘ఎంత సౌకర్యంగా ఉంటుందో’ అనే భావన ఆ పరిస్థితుల్లో తప్పకుండా మనిషికి పుట్టుకొస్తుంది. మందలో ఒకటి తరిగినా పెరిగినా జంతువులు గుర్తించలేవని అతనికి ముందే తెలుసు. అందువల్ల, మందను తనతోనే ఉంచుకుంటే పూటగడిచే దిగులే ఉండబోదనేఆలోచన కలిగింది. ఆ ఆలోచనే అతని తదుపరి ప్రయత్నానికి పునాది.

అతి ప్రయాసమీద గానీ జంతువుల్లో మచ్చికయ్యేవి కొన్నే ఉంటాయని తెలిసిరాదు. ఎన్నో ప్రయత్నాల తరువాత కొత్త రాతియుగం మానవుడు మచ్చిక చేసుకోగలిగిన జంతువులు కొన్నే కొన్ని రకాలు. అందుకే, తనకు మొట్టమొదట మచ్చికైన జంతువు ఆ మానవునికి ఇతిహాసం. మచ్చిక చేసుకునేందుకు మొదట దొరికే జంతువుల్లో ప్రాంతాలవారీగా తేడా ఉంటుంది. భారతీయ మత సాహిత్యంలో గోవుకూ, పాశ్చాత్య మతసాహిత్యంలో గొర్రెకూ, అరేబియన్ సాహిత్యంలో ఒంటెకూ అత్యధిక ప్రాధాన్యత కనిపించడానికి కారణం ఆయా ప్రాంతాల్లో తొట్టతొలిగా మానవునికి మచ్చికైన జంతువులు అవే అయ్యుండటం. యావద్భారతదేశం పరమ పవిత్రంగా ఆదరించే మహాభారత ఇతిహాసం కుక్కతో మొదలై, కుక్కతో ముగుస్తుంది.

మచ్చిక జంతువు ప్రవేశంతో మనిషికి సంపద ఏర్పడింది. భూలోకంలో మొట్టమొదటిగా ఏర్పడిన ఆస్తి ‘పశువు’. ఆ ఆస్తి వల్ల అతనికి మరో వ్యాసంగం మొలకెత్తింది. తన తిండిని గురించి తప్ప మరో లంపటం పెట్టుకోని మనిషికి ఇప్పుడు పశువుల మేత కోసం తారాడుకునే బాధ్యత మీదబడింది. పైగా పశువులకు రాత్రివేళల్లో గూడా మేత మేసే అలవాటొకటుంది. దాంతో, గడ్డి కోసుకొచ్చేందుకు మరో రాతి పనిముట్టుతో - ‘కొడవలి’తో, తలుగులుగా ఉపయోగించేందుకు మరో నారపనిముట్టుతో - ‘పగ్గం’తో, అవసరం ఏర్పడింది. గింజను ఆహారంగా ఉపయోగించడం ఇంకా మొదలవనందున, అప్పట్లో ప్రతి మొక్కా గడ్డికిందే లెక్క; ‘ఇది పైరు, ఇది కలుపు’  అనే విచక్షణతో అవసరమే లేదు. పశుపోషణ గూడా మాంసం కోసమే తప్ప, పాలకోసం కాదు.

ఇప్పుడు, పచ్చిక సమృద్ధిగా దొరికే ప్రదేశంలో నివసించే గడువు బాగా పెరగడంతో, పెంపుడు జంతువు మూలంగా, నిలకడలేని సంచారజీవితానికి కాసింత కుదురుబాటు ఏర్పడింది. వేటాడటం మానకపోయినా, జీవన విధానం ఊహించనంతగా మార్పుకు తావిచ్చింది. బహుశా, ప్రాథమికమైన శ్రమవిభజన గూడా అప్పుడే జరిగుండొచ్చు. దానివల్ల, పశుపోషణ భారం స్త్రీలకు కేటాయించబడివుండొచ్చు. పశువుల కోసం మోసుకొచ్చే గడ్డి నుండి రాలిన గింజలు తడి తగలగానే మొలకెత్తడం ఆదిలో గమనించింది స్త్రీలు. ఆ పరిశోధనే తరువాతి రోజులోల్  మనిషిని వ్యవసాయానికి నడిపించింది. అందుకేనేమో భారతదేశంలో పాడినీ, పంటనూ, సంపదనూ స్త్రీపరంగా గుర్తించి ‘లక్ష్మి’ని దేవతగా ఆరాధిస్తారు.

 రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement