
ఎన్‌సిసి క్లాస్‌లో ఎవరెస్టు ఫీలింగ్!
అసమాన ప్రజ్ఞ
ఎన్‌సిసి! నేషనల్ కెడెట్ కోర్. సర్టిఫికెట్ రావాలంటే కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి. ఆకలికి, దాహానికి తట్టుకోవాలి. ఇంటికి దూరంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలవాలి. అమ్మాయిలైతే మరీ కష్టం. ఇవన్నీ దాటుకుని, ఎన్‌సిసిలో ఎ, బి సర్టిఫికెట్లు సంపాదించి, రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొని, ఈనెల 17 నుంచి పది రోజుల పాటు సింగపూర్‌లో జరిగే యూత్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కి హాజరవుతోంది జానకీ ప్రజ్ఞ. ఈ ప్రోగ్రామ్‌కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రజ్ఞ ఒక్కరే ఎంపికవడం విశేషం. ఈ సందర్భంగా సీనియర్ క్యాడెట్ కెప్టెన్ పాకలపాటి జానకీ ప్రజ్ఞ మనోభావాలు.
ఎన్‌సిసిలో చేరడం నా కల
నా చిన్నప్పుడు వార్తాపత్రికలో ఎన్‌సిసిపై వచ్చిన ఒక వ్యాసం నన్ను బాగా ప్రభావితం చేసింది. అయితే విశాఖపట్టణంలో నేను చదువుకున్న స్కూల్లో ఎన్‌సిసి లేదు. ఇంటర్మీడియట్ చదివిన కాలేజీలోనూ ఇదే పరిస్థితి. నేనిక ఎన్‌సిసిలో చేరలేనేమోనని బాధ పడ్డాను. ఎట్టకేలకు డిగ్రీలో నా కల ఫలించింది. విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో ఎన్‌సిసి ఉందని తెలిసి 2014లో బికామ్ ఆనర్స్‌లో చేరాను. ఎన్‌సిసి క్లాసుకి మొదటిరోజు అడుగు పెట్టినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. ఎవరెస్టు పైకి ఎక్కితే ఇలానే ఉంటుందేమో అనిపించింది.
టార్గెట్... రిపబ్లిక్ డే పరేడ్
పరేడ్‌కి సెలక్ట్ అవ్వాలంటే చాలా పరీక్షలు ఎదుర్కోవాలి. క్యాంపులో నుంచి తక్కువ మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మళ్లీ మూడు క్యాంపులు పెడతారు. ఆ తరువాత రిపబ్లిక్‌డే పరేడ్‌కి ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో డ్రిల్, గ్రూప్ డ్యాన్స్, సింగింగ్, గ్రూప్ సింగింగ్... వీటిలో తప్పక పాల్గొనాలి. అన్నిటినీ సంతృప్తికరంగా పూర్తి చేశాను. సెలక్ట్ అయ్యాను. పరేడ్‌కి ముందు మళ్లీ మూడు నెలలు క్యాంపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం తొమ్మిది గ్రూపులున్నాయి. అన్ని గ్రూపుల్లోకి నేను బెస్ట్ క్యాడెట్‌గా సెలక్ట్ అయినట్లు తెలియగానే చాలా సంతోషం వేసింది. ఆడపిల్లను ఒంటరిగా ఎక్కడకూ పంపలేని ఈ రోజుల్లో నా పేరెంట్స్ నన్ను ఆ మూడు నెలల క్యాంపుకి ధైర్యంగా పంపారు. వారి ప్రోత్సాహానికి తోడు కమాండింగ్ ఆఫీస్ 8వ నావల్ యూనిట్ కెప్టెన్‌సాయిప్రసాద్ కాజా ప్రోద్బలం కూడా ఉంది.
అమ్మానాన్న గుర్తుకొచ్చేవారు
క్యాంపులకు వెళ్లినప్పుడు తిండి సరిగా ఉండదు. అన్నిటికీ తట్టుకునేలా మమ్మల్ని తయారుచేస్తారు. డ్రిల్ వంటి వాటిలో ఎప్పుడైనా పొరపాటుచేస్తే శిక్షలు కఠినంగా ఉండేవి. గ్రౌండ్‌లో పరుగెత్తడం, ఏదైనా టార్గెట్ చూపితే ఆ పని చేయడం వంటివి. పనిష్మెంట్స్‌ని వామప్‌లా భావించాలి. ఈ వామప్‌లో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్టామినా పెంచుకోవాలి. ట్రయినింగ్ సమయంలో ఎక్కువసార్లు నీరసపడి కింద పడిపోతే వాళ్లని డిస్‌క్వాలిఫై చేసేస్తారు. అటువంటి సమయాల్లో ఇల్లు, అమ్మనాన్న గుర్తుకువచ్చేవారు. ఎప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని. ఈ విషయంలో ముఖ్యంగా మా కాలేజీ ఫ్యాకల్టీ గురించి చెప్పాలి. వాళ్లు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. క్యాంపులకు వెళ్లినప్పుడు మిస్ అయిన క్లాసులు మళ్లీ చెప్పేవారు. ఒక్కోసారి స్కయిప్‌లో కూడా క్లాసులు చెప్పారు.
బెస్ట్ క్యాడెట్‌గా సి.ఎం. మెడల్
అందరూ చదువుతారు. నే నూ చదువుతున్నాను. చదువు ఒక్కటే కాదు, ఇంకేదైనా సాధించాలనే పట్టుదల కలిగింది నాకు. నేను ఎన్‌సిసి ఎంచుకోవడానికి ఇది కూడా ఒక కారణం. బెస్ట్ క్యాడెట్ బంగారు పతకం అందుకున్నాను. దీనినే చీఫ్ మినిస్టర్ మెడల్ అంటారు. రాష్ట్రస్థాయిలో ఇది బెస్ట్. అలాగే క్యాంపులకి వెళ్లినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం. సమయపాలన, కొత్త వారితో పరిచయాలు, స్నేహం పెంపొందుతాయి. క్యాంపు అయిపోయి ఆఖరి రోజు వచ్చేసేటప్పుడు బాధగా ఉంటుంది. అక్కడ ఉన్నన్ని రోజులు ఒకరికొకరం సహాయం చేసుకుంటూ, ఇంటిని మర్చిపోయేంత ప్రేమగా ఉంటాం. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి