కొత్త మహిళాస్త్రం స్మాష్‌బోర్డ్‌ | Sakshi
Sakshi News home page

కొత్త మహిళాస్త్రం స్మాష్‌బోర్డ్‌

Published Fri, Nov 22 2019 2:23 AM

This New App Aims To Fight Patriarchy On Digital Streets - Sakshi

కేవలం హ్యాష్‌ట్యాగ్‌ మూమెంట్లకే పరిమితం కాకుండా.. డిజిటల్‌ వీధుల్లో చేదు అనుభవాల బారిన పడుతున్న వారికి మద్దతు లభించేలా చేయడం, వారి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడమే ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ ప్రధాన లక్ష్యం.

గట్టిగా మాట్లాడినా.. అభిప్రాయాలను కచ్చితంగా చెప్పినా.. ఫొటోలు అప్‌లోడ్‌ చేసినా.. ఆఖరికి తమకు జరిగిన అన్యాయంపై నిర్భయంగా నోరు విప్పినా.. ఏదో నేరం చేసిన వాళ్లలాగా మహిళలను చిత్రీకరించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత స్త్రీవాదులు మొదలు సామాన్య మహిళల వరకు ప్రతీ ఒక్కరూ ట్రోలింగ్‌ బారిన పడుతున్నారు. దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. రాయడానికి కూడా వీల్లేని అసభ్య, పరుష పదజాలంతో చిన్మయిని దూషించిన ఎందరెందరో మహానుభావుల సంస్కారం ఆ కామెంట్లలో ప్రస్ఫుటిస్తుంది.

తిరగబడితే బురద
గౌరవప్రదమైన హోదాలో ఉండి, పెద్దమనిషిగా చలామణీ అవుతున్న వైరముత్తు లాంటి ఎంతోమంది వ్యక్తులపై వచ్చిన ఆరోపణల గురించి కనీసం ఆలోచించకపోగా.. వారు ఏం చేసినా సరైందే అన్న రీతిలో ఉండే ట్వీట్లు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడతాయి. ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్న చిన్మయిలు ఎందరో. ఇలాంటి వారికోసం నుపుర్‌ తివారీ అనే జర్నలిస్టు తన బృందంతో కలిసి ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెట్టారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించేందుకు, బాధితుల సమస్యల తీర్చేందుకు వీలుగా ‘స్మాష్‌బోరు’్డ పేరిట యాప్‌ను తీసుకువచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీవాదులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ యాప్‌ను ఢిల్లీలోని మిరాండా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. కేవలం హ్యాష్‌ట్యాగ్‌ మూమెంట్లకే పరిమితం కాకుండా.. డిజిటల్‌ వీధుల్లో చేదు అనుభవాల బారిన పడుతున్న వారికి మద్దతు లభించేలా చేయడం, వారి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడమే ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ ప్రధాన లక్ష్యం. అదే విధంగా బాధితుల గోడు వెళ్లబోసుకునేందుకు.. వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు.. ఈ యాప్‌ తోడ్పాటునందిస్తుంది. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడే మహిళలు, పురుషులు, థర్డ్‌జెండర్‌ (ట్రాన్స్‌ మెన్‌ లేదా ట్రాన్స్‌ ఉమన్‌) ఇలా ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యులు కావొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలలో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

అందుకే స్మాష్‌బోర్డు
స్మాష్‌బోర్డు యాప్‌ గురించి నుపుర్‌ తివారీ మరింత వివరంగా చెబుతారు. ‘‘బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా నోరు విప్పేలా చేయాలనే ఆలోచనే స్మాష్‌బోర్డు రూపకల్పనకు కారణం. న్యాయవాదులు, జర్నలిస్టులు, సైకాలజిస్టులు వంటి వివిధ రంగాల నిపుణులు దీనితో ఎంతో అనుసంధానమై ఉంటారు. కాబట్టి బాధితులు తమ సమస్యలు, మానసిక స్థితి గురించి వీరికి చెప్పుకోవచ్చు. కేవలం బాధితుల కోసమే కాకుండా పురుషాధిక్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంతోమందిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతోనే ఈ యాప్‌ ప్రారంభించాం. దీని వల్ల మన ఆలోచనల్ని మనలా ఆలోచించగల  వ్యక్తులతో పంచుకునే వీలు కలుగుతుంది’’ అని నుపుర్‌ తెలిపారు. త్వరలోనే ఈ యాప్‌ను ప్రాంతీయ భాషల్లో తీసుకువచ్చే అవకాశం ఉంది.

అద్భుతమైన ఆలోచన
‘ది వెజీనా మోనోలాగ్స్‌ ఫేం’ ఈవ్‌ ఎన్‌స్లర్‌ (స్త్రీలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్యకర్త) ఈ యాప్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఇదొక ఆద్భుతమైన ఆలోచన’ అని కొనియాడారు. మహిళలు నిర్భయంగా తమ గాథలను, అనుభవాలను చెప్పుకొనేందుకు గొప్ప వేదిక స్మాష్‌బోర్డు అని పేర్కొన్నారు. ఈ సోషల్‌ నెట్‌వర్క్‌లో అందరూ స్త్రీవాదులే ఉన్న కారణంగా బాధితులు తమ సమస్యలను మరింత ధైర్యంగా ఇతరులతో పంచుకోగలుగుతారన్నారు. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి ఇది ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.
– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement