ఒత్తిడిని దూరం చేసే జెనీటైమ్...
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. జెనీటైమ్ కూడా వీటిల్లో ఒకట అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ అప్లికేషన్ కొంచెం వెరైటీ. ఎలా అంటే... ముందుగా చెప్పాల్సింది ఇది ఒక సెన్సర్‌తో కలిసి పనిచేస్తుందని. ఊపిరి గట్టిగా తీసుకుంటూ, వదులుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిదని మనం వింటూనే ఉంటాం. శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో అందడం, గుండెకొట్టుకునే వేగంలో మార్పు వంటివి దీనికి కారణాలు. కానీ టైమ్ లేదనో.. ఇంకో కారణం చేతనో ఈరకమైన వ్యాయామం చేయము. ఈ కొరతను అధిగమించేందుకు ఉపయోగపడే అప్లికేషనే ఈ జెనీటైమ్. మీ ఊపిరి తీరుతెన్నులను గుర్తించేందుకు ఈ అప్లికేషన్‌తోపాటు రెస్పిరేట్ అనే ఓ పరికరం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా మొబైల్‌ఫోన్‌తోపాటు వచ్చే గేమ్స్ ఆడటమే. కొవ్వొత్తులు ఆర్పటం, చెప్పిన దిశగా గట్టిగా గాలి ఊదడం ఇవీ గేమ్స్. వీటిద్వారానే అటు ప్రాణాయామానికి ప్రాణాయామం.., ఇటు వినోదమూ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ అప్లికేషన్‌ను, గేమ్స్‌ను తరచూ ఉపయోగించడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చునని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆపిల్ ఐఫోన్‌తో మాత్రమే లభిస్తోంది.
యాంగ్రీబర్డ్ స్టెల్లా....
స్మార్ట్‌ఫోన్లతో గేమ్స్ అడటం... అదీ యాంగ్రీబర్డ్ వంటి పాప్యులర్ గేమ్స్ ఆడటం చాలామందికి కాలక్షేపం. తాజాగా యాంగ్రీబర్డ్స్ స్టెల్లా పేరుతో మరో కొత్త గేమ్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 120 లెవెల్స్‌లో సాగే ఈ గేమ్‌లో స్టెల్లా దాని సహచర పక్షులతో గోల్డెన్ ఐలాండ్‌ను దుష్ట రాకుమారి ఆమె పందిపిల్లల నుంచి రక్షించాల్సి ఉంటుంది. స్టెల్లాతోపాటు దహలియా, పాపీ, విల్లో లూకాలు ఉంటాయి. ప్రతి పక్షికీ ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. స్లింగ్‌సాట్ ద్వారా రకరకాల విన్యాసాలు చేసేందుకు అవకాశముంటుంది. ఈ గేమ్‌లో ఉపయోగించే టెలిపాడ్ అనే అప్లికేషన్‌తో పనిచేసేందుకు కెమెరాను వాడాల్సి ఉంటుంది. కెమెరాతోపాటు, మైక్రోఫోన్‌ను కూడా ఉపయోగించేందుకు ఒకసారి రిక్వెస్ట్ వస్తుంది. చాలావరకూ యాంగ్రీబర్డ్స్ గేమ్స్ మాదిరిగానే ఇది కూడా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో ఉచితంగానే లభిస్తుంది కానీ ఆట మధ్యలో కొన్ని ఆయుధాలు లేదా ఇతర పరికరాలను కొనాల్సి రావచ్చు.
ఆటోమేషన్ కోసం మరో ఆప్...
ఈమెయిల్ మొదలుకొని, వాయిస్ కాలింగ్ వరకూ స్మార్ట్‌ఫోన్‌తో మనం చేసుకునే అనేకానేక పనులను ఆటోమేట్ చేసేందుకు ఇప్పటికే అనేక అప్లికేషన్లు ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా చేరిన మరో అప్లికేషన్ ఆటోమేట్! పరిస్థితికి తగ్గట్టుగా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ఈ అప్లికేషన్‌కున్న ప్రత్యేకత. ఉదాహరణకు... స్మార్ట్‌ఫోన్ లాక్‌స్క్రీన్ ప్యాటర్న్‌ను తప్పుగా తీశారనుకుందాం. ఆ వెంటనే ఈ అప్లికేషన్ ఫ్రంట్ కెమెరాతో ఎదురుగా ఉన్న వ్యక్తి ఫొటో తీసేస్తుంది. లాక్ ఓపెన్ చేసిందెవరు? అని ప్రశ్నిస్తుంది. మీరే అయితే ఫర్వాలేదుగానీ... మీ ఫోన్‌ను ఇతరులెవరైనా ఉపయోగించినప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్లో ఛార్ట్‌ల ఆధారంగా మీరు ఆటోమేటిక్‌గా చేయాలనుకుంటున్న పనులను నిర్ణయించుకోవచ్చు. మెయిల్ పంపడం, వైఫై సెట్టింగ్స్ మార్చుకోవడం వంటి పనులను ఈ అప్లికేషన్ ద్వారా చక్కబెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్‌కు కేవలం మనం ఏఏ ఆండ్రాయిడ్ అప్లికేషన్లను వాడుతున్నామో వాటి పర్మిషన్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న ఈ అప్లికేషన్‌ను వాడి చూడండి మరి!.
భలే ఆప్స్
Published Wed, Sep 17 2014 11:44 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement