
లుల్లాసం
ఆమె డ్రెస్ డిజైన్స్ కాలాలకు అతీతం. పెళ్లికి ధరిస్తే యువరాణిలా, వెస్ట్రన్ పార్టీకైతే గ్లామరస్‌గా వెలిగిపోతారు
కథ ఎవరైనా రాసుకోవచ్చు.
పాట ఎవరైనా పాడుకోవచ్చు.
మ్యూజిక్ ఎవరైనా కొట్టుకోవచ్చు.
కానీ ఉల్లాసం ఉండాలంటే లుల్లాసం ఉండాల్సిందే!
300 సినిమాలు.. 7 భాషలు... కావల్సినంత తిక్క..
అంతకంటే ఎక్కువ వినయం...
ఈమె డిజైన్ చేస్తుంది కాబట్టి డిజైనర్ క్వీన్ అయ్యింది.
ఇంకా ఏదైనా చేసుంటే దాంట్లో కూడా రాణించేది.
ఏది చేసినా శ్రద్ధ, ఏ పనిలోనైనా
అవసరం అంటోంది లుల్లా .. నీతాలుల్లా!
ఆమె డ్రెస్ డిజైన్స్ కాలాలకు అతీతం. పెళ్లికి ధరిస్తే యువరాణిలా, వెస్ట్రన్ పార్టీకైతే గ్లామరస్‌గా వెలిగిపోతారు. బాలీవుడ్ డిజైనర్‌గా పేరొందిన ఆమే నీతాలుల్లా. మూడు దశాబ్దాలుగా ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న నీతాలుల్లా 7 భాషలలో 300లకు పైగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు ఉత్తమ క్యాస్టూమ్ డిజైనర్‌గా జాతీయ సినీ అవార్డులను సొంతం చేస్తున్నారు నీతాలుల్లా. ఆమె ప్రతి డిజైన్ నవ డిజైనర్లుకు సరికొత్త పాఠ్యాంశాలే! ఫ్యాషన్ డిజైనర్‌గా డ్రెస్ డిజైన్స్ గురించి ఆమె చెబుతున్న కొన్ని సూచనలు...
డ్రెస్ డిజైన్ చేసేటప్పుడు రుతువులనూ, కాలాన్ని దృష్టి లో పెట్టుకోవాలి.డ్రెస్ ఎంపికలో వందలు, వేలు, లక్షలు.. ఖరీదులో అద్భుతం కనిపించదు. కలర్ కాంబినేషన్స్.. డిజైన్సే ప్రధానంగా కనిపిస్తాయి. వంద రూపాయల డ్రెస్‌కైనా, లక్షల రూపాయల డ్రెస్‌కైనా డిజైన్ చేసేటప్పుడు ఒకేలాంటి శ్రద్ధ, అంకితభావం చూపించాలి. అప్పుడే మన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఫ్యాషన్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే దాని పట్ల ఒక పిచ్చి, ప్రేమ ఉండాలి. అప్పుడే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించగలం. మన డిజైన్స్‌కు వచ్చే విమర్శలకు కోపం తెచ్చుకోకూడదు. వాటిని మన ప్రతిభను మెరుగుపర్చుకోవడానికి అవకాశంగా తప్పక ఆహ్వానించాలి. నేటి టీనేజర్ల ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనిస్తే మన డిజైన్స్‌లో కొత్తదనం తేవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మరో పది కాలాలు మన డిజైన్స్ ట్రెండ్‌లో ఉంటాయి.
నీతాలుల్లా, ఫ్యాషన్ డిజైనర్