వ్యాయామం చేస్తున్నారా..? బీట్‌రూట్ రసం తాగండి...
కొత్త పరిశోధన
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారా..? చాలా మంచి అలవాటు. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా కొనసాగించండి. వ్యాయామం వల్ల కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..? మరేమీ ఫర్వాలేదు. దీనికి ఓ చిన్న చిట్కా పాటిస్తే చాలు. వ్యాయామం ప్రారంభించడానికి ముందు గ్లాసుడు బీట్‌రూట్ రసం తాగండి. జోరుగా, హుషారుగా వ్యాయామాన్ని కొనసాగించగలరు. అంతేకాదు, ఎప్పటి కంటే కాసింత ఎక్కువసేపు వ్యాయామం కొనసాగించినా కండరాల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అని చెబుతున్నారు అమెరికన్ వైద్య నిపుణులు.
తాజా బీట్‌రూట్ రసం కండరాలకు అదనంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుందని, అందువల్ల ఎంత వ్యాయామం చేసినా కండరాల నొప్పులు బాధించవని వారు చెబుతున్నారు. అంతేకాదు, క్రమం తప్పకుండా రెండు వారాల పాటు రోజూ బీట్‌రూట్ రసం తీసుకుంటే, అధిక రక్తపోటు దాదాపు ఏడు శాతం మేరకు తగ్గుతుందని అంటున్నారు. తమ పరిశోధనల్లో తేలిన ఈ విషయాలను వారు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ’ తాజా సంచికలో ప్రచురించారు.