
ఒకటికి మూడు హారాలు...
ట్రెండ్
రోజువారీ వేషధారణలో ఇతర అలంకరణ వస్తువులన్నీ అతి ముఖ్యమైనవే! ఆభరణాలు లేకుండా అలంకరణ పూర్తి కాదు. అవీ ఉండాల్సిందే! అయితే ఇప్పటి వరకు ఒక గొలుసు లేదా నెక్లెస్‌తో సరిపెట్టేశారు. కానీ, ప్రస్తుతం రెండు, మూడు ఆభరణాలు వేసుకోవడం అనేది సరికొత్త ట్రెండ్.
‘హారాలు సంప్రదాయ వేడుకలకు మాత్రమే వేసుకోవాలని ఏమీ లేదు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు సైతం ఈ తరహా ఆభరణాలను ధరించవచ్చు. మూడు విభిన్న తరహా హారాలలో ఒకటి పొడవుగా ఉండే ‘ఫంకీ’ లాకెట్టు ధరిస్తే సర్వసాధారణంగా ఎదుటివారి చూపు ఆ హారం మీద నిలిచిపోతుంది. హైదరాబాద్ ఫ్యాషన్ అండ్ ఆభరణాల డిజైనర్ సుహానీ పిట్టె ఈ తరహా ట్రెండ్ గురించి మాట్లాడుతూ ‘నాకు వరుసలుగా ఉండే ‘లేయర్డ్ కఫ్స్’ అంటే చాలా ఇష్టం. రెండు విభిన్నమైన డిజైన్లతో, రంగులతో, లోహాలతో ఉండే చైన్లు, హారాలు ధరిస్తే ఆ స్టైలే వేరు. హారాల నేపథ్యం ఒక కథలా ఉంటుంది. ఉదాహరణకు.. చెక్క గాజులు ధరించినప్పుడు వాటి మధ్య చిన్నా పెద్ద ‘గోల్డ్ కఫ్స్’, పూసల బ్రేస్‌లెట్స్ ధరించండి. పూర్తి గిరిజన స్టైల్ కనువిందు చేస్తుంది. ముఖ్యంగా నలుపు రంగు దుస్తులు ధరించినప్పుడు ఈ తరహా ‘మిక్స్ అండ్ మ్యాచ్’ ఆభరణాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి’ అని వివరించారు.
ఒకటి బంగారం.. మరొకటి వెండి...
‘హారాలు, తేలికపాటి గొలుసులలో ఒకటి బంగారం, మరొకటి వెండి లోహాలతో చేసినవి కలిపి ధరించాలి. ఎప్పుడైనా దుస్తులకు పూర్తి భిన్నమైన ఆభరణాలు ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు’ అని తెలిపారు సుహాని.
ధరించిన దుస్తులు చాలా సాధారణంగా ఉన్నప్పుడు ప్రత్యేక ఆభరణాలు సరైన ఎంపిక అంటారా అని డిజైనర్ స్టైలిస్ట్ రిక్‌రాయ్‌ని అడిగితే - ‘ఏ దుస్తులైనా సరే చూడటానికి ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు ఒకటే మార్గం - ‘ఆభరణాల ఎంపికపై దృష్టి పెట్టడం. సాధారణంగా టీ-షర్ట్ ధరించినా ఒక పొడవాటి ఆభరణాన్ని మెడలో వేసుకోండి. ఆ స్టైల్ చాలా భిన్నంగా ఆకర్షణీయంగా మారిపోతుంది’ అన్నారు.
ఏ వయసు వారైనా ఈ తరహా దుస్తులను, ఆభరణాలను ధరించవచ్చు. ఇలా స్టైల్‌గా ఉండాలంటే క్రమబద్ధంగా ఉండే ‘ఫార్మల్’ వేషధారణ చేసుకోకూడదు.
- సుహానీ పిట్టె, ఆభరణాల డిజైనర్