న్యూఇయర్ సందర్భంగా తీసుకునే రిజల్యూషన్స్‌లో అత్యధికంగా ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయని వివిధ సర్వేల్లో వెల్లడైంది. వీటిలో మరింత ప్రధానమైంది ‘ఈ ఏడాది వ్యాయామం ప్రారంభిద్దాం’. అయితే ఈ తీర్మానం తీసుకుంటున్న వారిలో అత్యధిక శాతం మంది అమలులో విఫలమవుతున్నారట. దీనికి కారణాలేమిటి? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
రైట్ వర్కవుట్
కఠినమైనది కాకుండా, వాస్తవంగా మనసుకు ఆనందం కలిగించే వ్యాయామం ఏదనేది గుర్తించాలి. ఆనందం కలిగించని ఏ పనైనా ఎక్కువ కాలం కొనసాగించలేం. అదే సమయంలో సీజన్‌నూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సీజన్‌లో పరుగు ఎంచుకుంటే చలిలో దానిని కొనసాగించడం చాలా కష్టమవుతుంది. ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది.
కంపెనీ
సన్నిహిత వ్యక్తిని మంచి కంపెనీగా ఎంచుకోండి. అది మీ ఫ్రెండ్ కావొచ్చు, జీవిత భాగస్వామి అయినా సరే. మరొకరితో కలిసి వెళ్తున్నప్పుడు బాధ్యత పెరిగి మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తుంది. ఇద్దరికి నచ్చిన వ్యాయామశైలిని కలిసి ఎంజాయ్ చేయడం స్ఫూర్తిని రగిలిస్తుంది. వ్యక్తిగతంగా ఎవరూ దొరక్కపోతే, ఆన్‌లైన్ పార్టనర్‌ని కూడా ట్రై చేయొచ్చు.
వెరైటీ
తొలి దశలో నచ్చినది మాత్రమే చేసినా, వీలున్నంత వరకు వైవిధ్యభరిత వ్యాయామాలు ఎంచుకుంటూ కొనసాగాలి. ఇది మీలో మరింత ఆసక్తిని పెంచుతుంది. అది జిమ్‌లో వర్కవుట్ కావచ్చు.. డ్యాన్స్ క్లాస్ కావచ్చు.. యోగా, తాయ్‌చీ ఇలా ఏదైనా సరే. ఆటలు కూడా మంచి వ్యాయామమే.
లక్ష్యం
ఆరోగ్యమే అంతిమ లక్ష్యం అయినప్పటికీ, కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. తొలుత వెయిట్‌లాస్, తర్వాత ఫిట్‌నెస్.. ఇలా ఒక్కో దశలో ఒక్కోటి మార్చుకుంటూ వెళ్లాలి. అంతేకానీ ఒకేసారి అన్ని రకాల ఫలితాలు ఆశిస్తే, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే త్వరగా నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకే నెలలో బరువు తగ్గాలనే లక్ష్యం కంటే, ఒక నెలలో 3–4 కిలోలు తగ్గితే చాలనే లక్ష్యం పెట్టుకోవడం అర్థవంతంగా ఉంటుంది.
సాకులొద్దు
ఈ రోజు మనం ఎందుకు వ్యాయామం చేయలేదనే దానికి సాకులు వెతుక్కోవడంలోనే వెనకడుగు మొదలవుతుంది. మరీ చల్లగా ఉందనో, వేడిగా ఉందనో, వర్షం పడుతుందనో, సమయం సరిపోవడం లేదనో... ఇవన్నీ అసలు కారణాలే కాదని, సాకులు మాత్రమేనని గుర్తించాలి. ఈ విషయంలో మీకు మీరే చాలెంజ్ చేసుకోండి. మీ శరీరానికి వెకేషన్ లేదని గుర్తించండి. సీజన్ ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా వ్యాయామం నిత్యావసరం.
హోమ్‌వర్క్
ఎక్సర్‌సైజ్ కోసం జిమ్‌కి, మరెక్కడికైన వెళ్లినా ఇంట్లో కూడా వ్యాయామానికి అనుగుణమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. చిన్ని చిన్న పరికరాలు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే, అవుట్‌డోర్‌కి వెళ్లలేనప్పుడు చేసుకోవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లోనూ టిప్స్ లభిస్తున్నాయి. ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలైతే పూర్తిగా యూట్యూబ్ వీడియోల ఆధారంగా కూడా చేయొచ్చు.
సానుకూల దృక్పథం
వ్యాయామంతో కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిని నిశితంగా గమనిస్తే అంతకముందున్న దానికంటే మనం సాధిస్తోందేమిటో అవగతమవుతుంది.
ఏ శారీరక శ్రమకైనా ముందస్తుగా శరీరాన్ని సిద్ధం చేయకపోతే అది వ్యతిరేకంగా స్పందిస్తుంది. ఫలితంగా వ్యాయామంపై విముఖత కలిగేలా చేస్తుంది. ప్రతి వర్కవుట్‌కి ముందు కనీసం 10 నిమిషాలు వార్మప్ చేయాలి. ఈ చలికాలంలో ఇది మరింత తప్పనిసరి. వ్యాయామం చేసే సమయంలో, మరెప్పుడైనా దాని తాలూకు ఫలితాలు ఇబ్బందికరంగా అనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
– నరేందర్, ఫిట్‌నెస్ ట్రైనర్
Comments
Please login to add a commentAdd a comment