లక్ష్యమే కాదు... లక్ష్యశుద్ధి కూడా ఉండాలి!
విద్య - విలువలు
లోకంలో ‘లక్ష్యం’ అన్న మాట వింటూంటాం. దీనిని సంకల్పం అని కూడా అంటాం. ప్రతివారి జీవితంలో కూడా ఒక లక్ష్యమనేది ఉండాలి. లక్ష్యం ఏర్పడడానికి నేపథ్యం - అసలు మనకు కావలసిన బలం పరిపుష్ఠం కావడం, సంస్కార బలమున్న, పరిపుష్ఠమైన మనసు నుండి తప్పని సరైన సంకల్పాలు ఉత్పన్నం కావు. భగవంతుడు అందరికీ ఇంద్రియాలు ఇస్తాడు, మనసు ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు. మనుష్య ప్రాణికి సంబంధించినంత వరకు ఒక సత్సంకల్పం కలగాలి. అది కలగాలంటే సంస్కార బలం ఉండాలి. ఆ సంకల్పం, ఆ సంస్కారం, ఆ లక్ష్యశుద్ధి అంత బలంగా ఉండబట్టే ఒక్కొక్క మహాత్ముడి నుండి వచ్చిన ఒక్కొక్క సత్సంకల్పం ఆయనను కొన్ని శతాబ్దాల పాటూ, కొన్ని వేల సంవత్సరాల పాటు కీర్తి శరీరుణ్ని చేసింది.
మనసు ఇంద్రియాల చేత ప్రభావితమౌతుంది. కంటితో దేన్ని చూస్తున్నానో దాన్నిబట్టి నా మనసు ప్రభావితమౌతుంది. నేనలా వెడుతుండగా ఒక కుక్కపిల్ల నా వాహనం కిందపడి గిలగిలా తన్నుకుని తరువాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందనుకుందాం. అది క్షేమంగా వెళ్లిపోయినా కూడా ఆ తరువాత ఓ పది నిమిషాలు నా మనసు ఉద్విగ్నత పొందుతుంది. ‘అయ్యయ్యో ఏమిటిలా జరిగిందే’ అని నా మనసు ఆవేదన చెందుతుంది. కంటితో చూసిన దానిచేత, చెవితో విన్నదాని చేత, ముక్కుతో వాసన చూసినదాని చేత, నాలుకతో తిన్నదాని చేత, చర్మంతో స్పృశించినదాని చేత మనసు నిరంతరం ప్రభావితమౌతుంటుంది. కేవలం నోటితో చెప్పినంత మాత్రం చేత మనసు సంస్కారాన్ని పొందదు. మనసుకు అందించే, అందించడానికి సిద్ధంగా ఉంచే వస్తువును బట్టే అది సంస్కారాన్ని గడిస్తుంది. నేను ఎప్పుడూ శంకర భగవత్పాదుల వాఙ్మయాన్ని, కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖరేంద్రస్వామివారి వాఙ్మయాన్ని, లేదా రామాయణ, భారత, భాగవతాలను చదువుతుంటాననుకోండి. నా మనసు శాంతిని పొంది ఉంటుంది, ఉద్విగ్నత పొందదు. అలాగే మనకు కష్టసుఖాలు ఏర్పడుతుంటాయి. నిస్పృహ, శోకం కలుగుతుంటాయి. వాటి నుంచి బయటపడాలంటే- నాకన్నా కష్టాలు పడినవారు, పడుతున్నవారు లోకంలో ఎందరో ఉన్నారు, వారి కష్టం ముందు నా కష్టం ఏపాటిది కనుక అన్న భావన ఓదార్పునిస్తుంది. మనిషిని నిలబడేటట్లు చేస్తుంది. ఇది జరగాలంటే ఆ స్థితి నుండి బయటపడాలంటే రామాయణ. భారత, భాగవతాది గ్రంథాలను ఆలంబనగా, ఆసరాగా చేసుకోవాలి.
రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు... ‘‘సీతాదేవి అయోనిజ, రామచంద్ర ప్రభువు ధర్మపత్ని, లక్ష్మణస్వామి వారి వదిన, సాక్షాత్తూ మహాజ్ఞాని అయిన జనకునికి కుమార్తె, దశరథ మహారాజుగారి పెద్దకోడలు. ఎండ కన్నెరగని ఇల్లాలు... కట్టుకున్న వస్త్రాన్ని మార్చకుండా, అదే వస్త్రం... అది పూర్తి వస్త్రం కూడా కాదు, వస్త్రఖండం. ఎందుకంటే.. పమిటకొంగు చించి నగలు మూటకట్టి జారవిడిచింది కదా. అందువల్ల ఆ వస్త్రఖండంతోనే ఒక చెట్టుకింద 10 నెలల పాటు చుట్టూ క్రూరులైన రాక్షస స్త్రీలు చేరి అనరాని మాటలు అంటుండగా... భరించింది... మౌనంగా సహించింది. ప్రపంచంలో కష్టానికి పరాకాష్ఠ ఏమిటంటే మనకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి మరో మనిషి లేకపోవడమే పెద్ద కష్టం. ఇక రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి చుట్టూ లక్ష్మణ స్వామి ఉన్నారు, హనుమ ఉన్నాడు, సుగ్రీవుడున్నాడు... చాలామంది ఉన్నారు... కానీ సీతమ్మకెవరున్నారు. పది నెలలు ఆమె పడిన క్షోభతో పోల్చుకుంటే నా కష్టం పెద్ద కష్టం కాదన్న భావన మనసును తేలికపరుస్తుంది.
అలాగే ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు, త్యాగరాజస్వామివారు మనసుకు చెప్పుకున్న ప్రబోధాలు... ఆయన తన కష్టసుఖాలు వేరెవరికో చెప్పుకోలేదు, చాలా భాగం ‘ఓ మనసా’ అంటూ తన మనసుకే చెప్పుకున్నారు. అదెప్పుడు గాడి తప్పితే అప్పుడు దానిని నిందించారు. ఎప్పుడు తన మాట వింటే అప్పుడు పట్టాభిషేకం చేశారు. ఇటువంటి వాటిని మనసుకు ఆసరాగా నిలబెట్టాలి. ఇటువంటి వస్తువులు లోపలికి వెళ్లడానికి అవకాశమిచ్చి ఎవడు వీటిని పుచ్చుకుంటున్నాడో వాడి మనసు పరిపుష్ఠమౌతుంది. వాడు సాత్వికమైన ధృతిని పొందుతాడు. అటువంటి మనసులోంచి వచ్చే సంకల్పాలకు, లక్ష్యాలకు భగవంతుని అనుగ్రహం ఉంటుంది. అవి కేవలం వారికి మాత్రమే పనికి వచ్చే సంకల్పాలు కావు. పదిమంది సంతోషానికి పనికి వచ్చే సంకల్పాలు. అటువంటి వారి మనసులలోకి వస్తాయి.
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవినలంకరించిన శ్రీనివాస్ అయ్యంగార్ గారికి 70వ ఏట ఒక కంటిలో నరం చిట్లిపోయి ఆ కన్ను చూడడం మానేసింది. కానీ అలా ఒక కన్నుతోనే ఆయన చూసి చదువుతూంటే కుమార్తె ప్రేమానంద్ కుమార్ వచ్చి ‘నాన్నగారూ, 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఎందుకండీ చదువుతారు’’ అని అడిగితే.. ఆయన ఇచ్చిన సమాధానం- ’రెండో కన్ను ఉందిగా...’’. అదీ ధృతి అంటే!
ధృతి అంటే ధైర్యం. దాన్ని ఉపయోగించుకుని ఈ శరీరాన్ని సాధనంగా చేసుకుని నేను గట్టెక్కాలి. భగవంతుడిచ్చిన దీనిని ఆఖరి నిమిషం వరకు పదిమంది కోసం ఉపయోగించాలి. శరీరం పడిపోక తప్పదు, కానీ ఉన్నన్నాళ్లూ ఆ శరీరంతో చెయ్యదగిన సత్కర్మలే చేద్దాం అన్న తాపత్రయం, ధైర్యం దేనివల్ల వస్తాయంటే, సంస్కారాన్ని పొందడానికి ఏ వస్తువులను మనం యోగ్యంగా స్వీకరిస్తున్నామో వాటివల్ల మంచి సంకల్పాలు, మంచి లక్ష్యాలు వస్తాయి. అంతే తప్ప వాతావరణం అపరిశుభ్రమైనవి, చూడకూడనివన్నీ చూస్తూ, వినకూడనివన్నీ వింటూ, ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటూ, తినకూడనివన్నీ తింటూ, వాసన చూడకూడనివన్నీ చూస్తూ మన సంకల్పం, మన లక్ష్యం శుద్ధంగా ఉండాలి అంటే ఒక్కనాటికీ ఉండదుగాక ఉండదు. అందువల్ల మన సంస్కారాన్ని పొందడానికి కావలసిన వస్తువులను మాత్రమే దానికి అందించాలి. అది జరిగిననాడు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడగలిగేటటువంటి ధృతి కలుగుతుంది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు