![North Texas Telugu Association Literary Forum Presenting Nela Nela Telugu Vennela Program In Online - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/27/3.jpg.webp?itok=iSew828R)
అమెరికాలోని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించే నెల నెలా తెలుగు వెన్నెల 153వ సదస్సు ఏప్రిల్ మూడో ఆదివారం ఆన్‌లైన్లో జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 153 నెలల పాటు సాహిత్య సదస్సు జరగడం విశేషం. చిన్నారులు సాహితీ, సిందూర వేముల ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. తర్వాత సదస్సు సమన్వయకర్త మల్లిక్ కొండా ప్రసంగీకులని పరిచయం చేశారు. అనంతరం సత్యం ఉపద్రష్ట– పెద్దన, తెనాలి రామలింగ కవులు ఆశువుగా చెప్పిన పద్యాలలో ప్రయోగించబడిన అలంకారిక, ఔచిత్య లక్షణాలను వివరించారు. ఊర్మిండి నరసింహారెడ్డి తెలుగు సిరి సంపదల పేరుతో తెలుగు జాతీయాలని సభికులతో పంచుకున్నారు. భాషా శాస్తవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగుకూ, మధ్య ద్రావిడ భాషా కుటుంబాలకూ చేసిన సేవను లెనిన్‌బాబు వేముల కొనియాడారు.
మహాభారత ఇతిహాసాన్ని విరచించిన వ్యాస మహామునిపై స్వీయ కవితల గానం చేశారు బల్లూరి ఉమాదేవి. మానవాళిని పీడిస్తున్న కరోనాపై అయినంపూడి శ్రీలక్ష్మి కవిత ‘కరోనాకి ఓ రిటర్న్ గిఫ్టు’ చదివి వివరించారు అనంత్ మల్లవరపు. చివరిగా సదస్సు ముఖ్య అతిథి స్వరకర్త, గాయకులు పాలగుమ్మి రాజగోపాల్ ‘తెలుగు కావ్యానికి స్వరాభిషేకం’ శీర్షిక కింద తమ పద్య గానంతో సభను రంజింపజేశారు. భావానికి సరిపడే రాగాలను, స్వర రచనా ప్రణాళికను ఎలా ఎంచుకొన్నదీ సోదాహరణంగా వివరించారు. సంగీత దర్శకులు సాలూరు రాజేస్వరరావుతో తనకున్న సాన్నిహిత్యం గురించి కూడా పంచుకున్నారు. రాజగోపాల్‌కూ, సదస్సుకు హాజరైన ఇతర సాహిత్య ప్రియులకూ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment