న్యూయార్క్ : వృద్ధాప్యంలో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్లిష్టంగా మారింది. అయితే అయిదు జీవనశైలి మార్పులను అనుసరించడం ద్వారా జీవితకాలాన్ని మహిళలు 14 ఏళ్ల పాటు, పురుషులు 12 సంవత్సరాలు పొడిగించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. పొగతాగడానికి దూరంగా ఉండటం, రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన శరీర బరువు, అతిగా మద్యం తీసుకోకుండా ఉండటం వంటి ఐదు సూచనలూ పాటిస్తే పదేళ్ల పాటు మన జీవనకాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. అమెరికా జాతీయ సర్వేల్లో 34 ఏళ్ల పాటు మహిళల గణాంకాలు, 27 ఏళ్ల పాటు పురుషుల డేటాను పరిశోధకులు విశ్లేషించిన మీదట ఈ నిర్ధారణకు వచ్చారు. నిపుణులు సూచించిన ఐదు అంశాలను సరిగ్గా పాటించిన వారు ఇతరులతో పోలిస్తే ఈ వ్యవధిలో 74 శాతం మంది అకాల మృత్యువాతన పడలేదు.
గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ కారణంగా మరణాల రేటు వీరిలో అతి తక్కువగా నమోదైంది. వ్యాధికి చికిత్స కంటే నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ అథ్యయనంలో కీలకంగా వెల్లడైందని అథ్యయన రచయిత, హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ఫ్రాంక్ హు అన్నారు. జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరకుండా జీవనకాలాన్ని మెరుగుపరుచుకోవచ్చని, ఆరోగ్యంపై వెచ్చించే ఖర్చులను అధిగమించవచ్చని పేర్కొన్నారు. తమ అథ్యయనం ప్రకారం తాము సూచించిన ఐదు సూత్రాలను పాటించిన వారిలో గుండెజబ్బుల ద్వారా మరణించడం 82 శాతం మేర తగ్గిందని, క్యాన్సర్ కారణంగా మరణాలు కూడా మూడింట రెండు వంతులకు పడిపోయిందని చెప్పారు. ఆరోగ్యంగా జీవించడంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అథ్యయన వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment