కృత్రిమ గర్భధారణ పద్ధతులను మరింత ఎక్కువ విజయవంతం చేసేందుకు స్టాన్‌ఫర్డ్, వోర్‌చెస్టర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని ఆవిష్కరించారు. చురుకుగా, వేగంగా కదిలే శుక్రకణాలను వేరు చేసేందుకు ఓ పరికరాన్ని తయారుచేశారు. దీని పేరు స్పార్టాన్. ఊహూ.. గ్రీకు పురాణాల్లోని వ్యక్తి పేరు కాదు. ‘సింపుల్ పీరియాడిక్ అరే ఫర్ ట్రాపింగ్ అండ్ ఐసొలేషన్’కు సంక్షిప్త నామం ఇది. ఇందులో ఉన్నట్టుగానే ఈ పరికరం వీర్యకణాల్లో చురుకుగా ఉన్న వాటిని గుర్తించి వేరు చేస్తుందన్నమాట.
సంప్రదాయ పద్ధతుల్లో వేగవంతమైన శుక్రకణాలను గుర్తించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నప్పటికీ స్పార్టాన్... వేగంతోపాటు ఆరోగ్యవంతమైన వాటినీ గుర్తించగలదు. అంతేకాకుండా డీఎన్‌ఏ సమగ్రత ఉన్న వాటిని కూడా ఈ పద్ధతి ద్వారా ఒక దగ్గరకు చేర్చవచ్చునని, తద్వారా కృత్రిమ గర్భధారణ పద్ధతులతో గర్భం దాల్చే అవకాశాలతోపాటు మరింత ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టేందుకు అవకాశాలు ఎక్కువవుతాయని శాస్త్రవేత్తల అంచనా. సంప్రదాయ పద్ధతుల ద్వారా కణాలకు జరిగే హానిని కూడా స్పార్టాన్ అడ్డుకుంటుంది. తక్కువ ప్రయత్నాలతోనే గర్భం ధరించేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడతుందని, తద్వారా నిస్సంతులకు ఖర్చు కూడా తక్కువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment