ఒడిస్సీ నృత్యంతో అవగాహన | Odissi Dancer Awareness on Coronavirus And Hand Wash | Sakshi
Sakshi News home page

ఒడిస్సీ నృత్యంతో అవగాహన

Published Thu, Jun 25 2020 9:13 AM | Last Updated on Thu, Jun 25 2020 9:13 AM

Odissi Dancer Awareness on Coronavirus And Hand Wash - Sakshi

మహినా ఖనుమ్‌

చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ వేసుకోవడం వంటి రక్షణ చర్యలన్నీ ఈ కరోనా సమయంలో పాటించవలసిన జాగ్రత్తలు. తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలన్నీ ఒడిస్సీ నృత్యముద్రల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తోంది మహిన ఖనుమ్‌. ఫ్రెంచ్‌ మహిళ అయిన మహిన 13 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి ఒడిస్సీ నృత్యరీతులను నేర్చుకుంది. భారతీయ నృత్యసంస్కృతిని ప్రోత్సహించే లిజ్‌ ఆర్ట్స్‌ మీడియాసంస్థకు మహిన డైరెక్టర్‌. స్టే హోమ్‌ పేరుతో మహిన చేస్తున్న శాస్త్రీయ నృత్య వీడియోలు మంచి ఆదరణ పొందుతున్నాయి.

కొన్నాళ్లుగా లాక్‌డౌన్‌ టైమ్‌ను కళాకారులు తమ కళను మెరుగు పరుచుకోవడానికి, కొత్త కొత్త ప్రక్రియలు కనిపెట్టడానికి వాడుకుంటున్నారు. తాము చేసిన సృజనాత్మక పనులను నలుగురికీ పంచడానికి సోషల్‌ మీడియాను మాధ్యమంగా ఎంచుకుని అన్ని వయసుల వారు తమ అభిరుచులను వ్యక్తపరుస్తున్నారు. ఇదేకోవలో ఫ్రాన్స్‌లో నివసిస్తున్న ఒడిస్సీ నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్‌ మహినా ఖనుమ్‌ కోవిడ్‌–19కి సంబంధించి తీసుకోవాల్సిన రక్షణ చర్యలను ఒడిస్సీ నృత్యభంగిమల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది.

నృత్యం ఒక అందమైన భాష
‘నృత్యం ద్వారా పర్యావరణాన్ని కాపాడటం, మహిళా సాధికారత వంటి తీవ్రమైన సమస్యలను కూడా సులభంగా వివరించవచ్చు. నృత్యం ఒక అందమైన భాష, దీనిలో ప్రదర్శించే  భంగిమలే అందుకు ఉదాహరణ. కరోనా యుగంలో ఇ–కరెన్సీ గురించి ప్రజలకు తెలిసేలా చేసిన వీడియో నాకు బాగా నచ్చింది’ అని వివరించిన మహిన తన నృత్యశైలితో ప్రపంచ సమస్యలను చూపాలనే తపనను వెలిబుచ్చింది.

కరెన్సీ నృత్యం

మహిన భర్త అవిషాయ్‌ డిజిటల్‌ ఆర్టిస్ట్‌ కావడంతో ఈ ఆలోచన రావడానికి, ఓ కొత్తదనాన్ని కనుక్కోవడానికి కారణమైందని చెబుతుంది మహిన. ‘లాక్డౌన్‌కు ముందు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు డ్యాన్స్‌ ఒక మార్గంగా ఉంటుందని అనుకోలేదు. గత మార్చిలో లాక్డౌన్‌ ప్రకటించాక, ఇంట్లోనే ఉన్నప్పుడు నాట్యాన్ని ఎలా కొనసాగించాలా అని ఆలోచించాను. అదే సమయంలో, కోవిడ్‌ –19 గురించి ప్రజలకు తెలిసేలా కరెన్సీకి సంబంధించిన నృత్య ప్రక్రియను వీడియో చేశాను. ఈ డ్యాన్స్‌ వీడియో కోసం సరైన ప్లేస్, కెమెరా యాంగిల్‌ కోసం కూడా చూడలేదు. నృత్యం ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలని భావించి, సక్సెస్‌ అయ్యాను. ఈ నృత్యానికి సంగీతాన్ని ముంబై స్వరకర్త విజయ్‌ తంబే స్వరపరిచారు’ అని ఆనందంగా వివరించింది మహిన.

జీవితానికి కొత్త దశ
మహిన తల్లి ఫ్రెంచ్, తండ్రి స్పానిష్‌. చిన్నప్పటి నుంచీ నృత్యంపై అమిత ఇష్టంతో మూడేళ్ల వయసులో బ్యాలే నేర్చుకుంది మహిన. 13 ఏళ్ల వయస్సులో ఒడిస్సీ కళాకారిణి షకర్‌ బెహెరాను కలిసింది. షకర్‌ తన జీవితానికి ఓ కొత్త దిశను ఇచ్చిందని చెబుతుంది మహిన. ఒడిస్సీ నృత్యరీతులను నేర్చుకున్న తరువాత ఢిల్లీలోని మాధవి ముద్గల్‌ నుండి నృత్యం నేర్చుకునే అవకాశం పొందింది. భారతీయ నృత్యకళను ఔపోసన పట్టాక పారిస్‌కు వెళ్లి అక్కడ 12 ఏళ్లుగా నివసిస్తోంది.

సులభమైన మార్గం
భర్త అవిషాయ్‌తో కలిసి మహిన ఫ్రాన్స్‌లో కంప్యూటర్‌ యానిమేటెడ్, ఓల్డ్‌ పెయింటింగ్, ఒడిస్సీ డ్యాన్స్, వర్చువల్‌ రియాలిటీతో ఒడిస్సీ డ్యాన్స్, లైట్‌ పెయింటింగ్‌ ఫోటోగ్రఫీ’ వంటి ప్రాజెక్టులలో పనిచేసింది. ‘కరోనా ప్రభావాలను నివారించడానికి, ఇంట్లో ఉన్నప్పుడు నా చుట్టూ ఎన్నో సమస్యలు కనిపించాయి. అటువంటి పరిస్థితిలో ఒడిస్సీ నృత్యం కష్టాలన్నిటినీ అధిగమించడానికి ఓ సులభమైన మార్గంలా’ కనిపించింది. ఈ నృత్యం ద్వారానే ఇప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. సోషల్‌ మీడియా నా నృత్యానికి వేదిక అయ్యింది’ అని కరోనా మహమ్మారి సమయంలో ఒడిస్సీ నృత్యం ప్రాముఖ్యత గురించి మహిన ఎంతగానో చెబుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement