ఇదండీ విషయం! అభినయానికి వయసుండదు.వయసుకి అందం ఉంటుంది.తారలు... నిజమే తారలు మాసిపోరు.నాటి తారలే నేటి అభినయ తారలు.అపుడు మెరిశారు ఇప్పుడు మురిపిస్తారు.
గ్లామర్ ఇండస్ట్రీలో స్పాట్‌లైట్ ఎప్పుడూ ఒకరి మీదే ఉండదు. ఫోకస్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ. హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా చిన్నది. ఐదూ పదేళ్ల తర్వాత తెరమరుగవుతుంటారు. కొందర్ని ఇండస్ట్రీ దూరం జరిపితే, కొందరేమో ఇండస్ట్రీకే దూరం జరుగుతారు. కేవలం కొందరు హీరోయిన్లు మాత్రమే దీనికి మినహాయింపు. కాలానుగుణంగా సీతాకోక చిలుకలో మార్పులొచ్చినట్టు వీళ్ల కెరీర్ సైకిల్లో మార్పులొస్తుంటాయి. పాత్రలకు ప్రమోషన్లు వస్తుంటాయి. గ్యాప్‌కి గ్యాప్ ఇచ్చి ఈ యాక్టర్స్ ఎప్పుడు తిరిగొచ్చినా కెమెరాలు మరింత ఫోకస్‌తో వీళ్ల మీద దృష్టి పెడతాయి. ప్రేక్షకుడి కళ్లు మరింత మెరుపుతో వీళ్లను చూస్తాయి. ఈ నటీమణులు మళ్లీ తిరిగి రావడానికి.. స్క్రిప్ట్ కారణం కావొచ్చు, సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందని దర్శక–నిర్మాతలు అనుకోవచ్చు. మరే కారణం అయినా కావచ్చు. ప్రస్తుతం కొందరు హీరోయిన్లు తిరిగి తెర మీద కనిపించడానికి రెడీ అవుతున్నారు. అలా చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ మెరవడానికి సిద్ధమైన నటీమణులపై స్పెషల్ స్టోరీ.
సౌందర్య లహరి
‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ స్వప్న సుందరిగా నటించారు దీప్తీ భట్నాగర్. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా స్వప్న సుందరిగా మారిపోయారామె. అ సినిమా తర్వాత ‘ఆటో డ్రైవర్, మా అన్నయ్య, కొండవీటి సింహాసనం’ సినిమాల్లో కనిపించారామె. 2002 తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు దీప్తి. ఇçప్పుడు నూతన దర్శకుడు పవన్ సుందర్ దర్శకత్వం వహిస్తున్న ‘కిట్టీ పార్టీ’ సినిమాతో కమ్‌బ్యాక్ చేస్తున్నారు. ఇది దీప్తీకి తెలుగులోనే కమ్‌బ్యాక్ కాదు యాక్టర్‌గానే కమ్‌బ్యాక్. 2004 తర్వాత ఏ భాషలోనూ ఆమె సినిమా చేయలేదు.
ఫిర్ ప్యార్ కరేంగే
మైనే ప్యార్ కియా అని సల్మాన్, భాగ్యశ్రీతో చెప్పారు. సినిమా బ్లాక్‌బస్టర్. హిందీ రానీ వాళ్లు కూడా భాగ్య శ్రీతో మైనే ప్యార్ కియా అన్నారు. ఆ సినిమా నార్త్, సౌత్‌లో సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది భాగ్యశ్రీకి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఓంకారం’ (కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ఓం’ తెలుగు రీమేక్) చేశారు. ఆ వెంటనే బాలకృష్ణతో ‘రాణా’ సినిమా చేశారు. ఇప్పుడు సుమారు 21ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో కనిపించబోతున్నారు భాగ్యశ్రీ. ‘కిట్టీ పార్టీ’ చిత్రంలో భాగ్యశ్రీ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రైలు పట్టాల మీద పరిగెడుతూ ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో...’ అని పాట పాడిన లైలా అందరికీ గుర్తే. ‘ఎగిరే పావురమా’ సినిమాలో ఓ సూపర్ హిట్ సాంగ్ ఇది. చిన్న పిల్లలాంటి గొంతు ఆమె ప్రత్యేకం. తెలుగులో ‘ఉగాది, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర ప్రేమ’ వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు లైలా తెలుగుకు తిరిగొస్తున్నారా? అంటే దానికి కొంచెం టైమ్ ఉన్నట్టుంది. ప్రస్తుతానికి తమిళంలో రీ–ఎంట్రీ ఇస్తున్నారు. పదమూడేళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తున్నారు లైలా. ‘అలీసే’ అనే క్రైమ్ డ్రామాలో కీలక పాత్రలో కనిపించనున్నారు లైలా. ఈ సినిమాకు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాత.
రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో తెలుగు స్క్రీన్‌పైన జయప్రదను ప్రేక్షకులు మిస్ అయ్యారు. 2007లో బాలకృష్ణ ‘మహారథి’ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలేవీ చేయలేదు. తమిళ, హిందీ, కన్నడంలో ఒకటీ అరా సినిమాలు చేశారు కానీ తెలుగు తెరపై కనిపించలేదామె. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ‘శరభ’ సినిమాలో కీలక పాత్రతో రీ–ఎంట్రీ ఇచ్చారు జయప్రద. ఇటీవల రిలీజైన ‘సువర్ణ సుందరి’లో కూడా కీలక పాత్ర చేశారామె.
18 ఏళ్లకు మళ్లీ
‘20వ శతాబ్దం, పద్మావతి కల్యాణం, బావ నచ్చాడు’ సినిమాల్లో కనిపించిన సుమన్ రంగనాథ్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు కనిపించడానికి రెడీ అయ్యారు. ‘బావ నచ్చాడు’ తర్వాత సుమన్ రంగనాథ్ మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కానీ కన్నడ, తమిళ, హిందీల్లో సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘కిట్టీ పార్టీ’లో సుమన్ రంగనాథ్ కీలక పాత్ర చేస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో తెలుగు తెరపై కనిపించనున్నారు.
ఎటూ వెళ్లిపోలేదు
‘గ్రీకువీరుడు...’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో కాబోయే వాడి కోసం పాడిన టబు మనందరికీ గుర్తే. గర్వం అణచడానికి గణపతి విగ్రహాన్ని తనతో మోయించిన ‘కూలీ నెం 1’ కూడా గుర్తే. ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ కవ్వించిన సిసింద్రీని కూడా మరచిపోలేం. పుండరీక రంగనాథుడిని మోహంలో ముంచెత్తిన మోహినిని మరచిపోవడం సాధ్యమా? ఇలా వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ అందరితో కథానాయికగా నటించిన టబు దర్శనాలు ఈ మధ్య తెలుగు తెరకు తగ్గాయి. 2008లో చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో చేసిన ‘ఇదీ సంగతి’ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదామె. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున పాడిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ని టబు ఫ్యాన్స్ ‘ఎటో వెళ్లిపోయింది టబు’ అని పాడుకున్నారు. కానీ జస్ట్ బాలీవుడ్‌లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు టబు. ఎటూ వెళ్లిపోలేదు. ఇంతకీ సంగతేంటంటే... సుమారు పదకొండేళ్ల తర్వాత త్రివిక్రమ్– అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నారామె. తన సినిమాల్లో కీలక పాత్రల కోసం ఒకప్పటి హీరోయిన్లని తీసుకోవడం త్రివిక్రమ్ స్టైల్ అనుకోవచ్చు. ‘అత్తారింటికి దారేది’లో నదియా, ‘అజ్ఞాతవాసి’లో ‘ఖుష్బూ’ని చాలా గ్యాప్ తర్వాత నటింపజేశారు త్రివిక్రమ్. తాజాగా అల్లు అర్జున్ సినిమాతో టబుని తిరిగి తీసుకొచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి తల్లిగా లేక అత్తయ్య పాత్రలో టబు కనిపిస్తారని సమాచారం.
ఫైర్ బ్రాండ్ ఈజ్ బ్యాక్
తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పాపులారిటీ తీసుకొచ్చిన ఫైర్ బ్రాండ్ హీరోయిన్ విజయశాంతి. యాక్షన్, రివల్యూషనరీ సినిమాలతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. విజయ్‌శాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చూడటం తమ ‘కర్తవ్యం’గా భావించి థియేటర్స్‌వైపు వెళ్లారు ప్రేక్షకులు. 2006లో చేసిన ‘నాయుడమ్మ’ తర్వాత విజయశాంతి సినిమాలకే బ్రేక్ ఇచారు. పాలిటిక్స్‌లో బిజీగా మారారు. మళ్లీ 13 ఏళ్ల విరామం తర్వాత స్క్రీన్ మీద కనిపించడానికి రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ద్వారా విజయశాంతి మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి తొలి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాలో హీరో కృష్ణ. ఇప్పుడు రీ–ఎంట్రీ చేస్తున్న సినిమాలో హీరో ఆయన తనయుడు మహేశ్ కావడం విశేషం. కృష్ణ దర్శకత్వం వహించి, నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో విజయశాంతి హీరోయిన్. అందులో మహేశ్ బాలనటుడిగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సరి లేరు నీకెవ్వరు’లో మహేశ్ పాత్రతో సమానంగా ఆమె పాత్ర కూడా ట్రావెల్ అవుతుందని తెలిసింది. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment