ఒక పాట రేపిన తుఫాను పూజాఫలం | old movie story to pooja phalam movie | Sakshi
Sakshi News home page

ఒక పాట రేపిన తుఫాను పూజాఫలం

Published Fri, Sep 22 2017 12:09 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

ఒక పాట రేపిన తుఫాను పూజాఫలం - Sakshi

ఒక పాట రేపిన తుఫాను పూజాఫలం

నాటి  సినిమా


తుఫాన్లను కనిపెట్టడానికి వాతావరణ శాఖ ఉంది. అది తుఫాను వచ్చే ముందే ఆ సంగతి కనిపెట్టి హెచ్చరికలు చేస్తుంది. ప్రమాద సూచికను ఎగురవేయమంటుంది.జనం జాగ్రత్త పడతారు. కాని ఆడపిల్ల రేపే తుఫానును కనిపెట్టే శాఖ ఏదీ లేదు. హెచ్చరికలు చేసే విభాగం ఏదీ లేదు. జాగ్రత్తలు చెప్పే వ్యవస్థంటూ అసలు లేనే లేదు. అందుకే ఆ తుఫానులో చిక్కుకున్న మగాళ్లు చిక్కుల్లో పడి దోవ తప్పి అల్లకల్లోలం అవుతారు. తాత్కాలిక అంధులై తల్లడిల్లుతారు. తెరిపిన పడటానికి ఒక జీవితకాలం వెచ్చిస్తారు.వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. ఆడపిల్ల చేసిన గాయాన్ని ఆడపిల్లే పూడ్చాలి. అలా పూడ్చగలిగే దేవత ఎదురు రావాలి. వస్తే ధన్యత. చేసిన పూజలన్నీ ఫలించినట్టే.

ఈ సినిమాలో అక్కినేని జమీందారు మనవడు. పెద్ద మహలు, ఎస్టేటు, మేనేజరు, నౌకర్లు, తోటలు, పూలు, ఫలాలు, గుర్రాలు పూన్చిన వాహనాలు... అక్కినేని చాలా సిగ్గరి. సంస్కారవంతుడు. భావకుడు. పుస్తకాలు, సంగీతం, గానం... ఇవి అతనికి ఇష్టం. పుస్తకాల ర్యాక్‌లో భాగవతం, సంగీత రత్నాకరం ఉన్నవాడు ఈ కాలం కుర్రవాడు అవుతాడా? కాదు అని చెప్తుంది ఆ మహల్‌లో అద్దెకు దిగిన జమున. మహలు కింది భాగం బావురుమంటోందని కాలక్షేపానికి ఒక బ్యాంక్‌ ఏజెంట్‌కు అద్దెకు ఇస్తారు. ఆ ఏజెంట్‌ కుమార్తే జమున. ఆ అమ్మాయి అసలు అమ్మాయి కాదు. రాకెట్టు. మొహమాటం లేదు. అరమరికలు అసలే లేవు.

అంతపెద్ద జమీందారుని కూడా చనువుగా పలకరిస్తుంది. తన బుజ్జికుక్క పిల్లతో అతడిని ఆటలాడమంటుంది. ర్యాక్‌లో ఉన్న గంభీర సాహిత్యాన్ని చూసి డిటెక్టివ్‌లు, వార పత్రికలు లేవా అని అడుగుతుంది. ఆ అమ్మాయి రాకతో అక్కినేని ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అంతవరకు నిస్సారంగా గడుస్తున్న తన జీవితానికి ఒక ఉత్సాహం దొరికినట్టు భావిస్తాడు. తన వయసును తాను గుర్తుకు తెచ్చుకుని హుషారు తెచ్చుకుంటాడు. అవన్నీ పక్కనపెట్టండి– ఒకరోజు సాయంత్రం అతడు కాలేజీ నుంచి మహలుకు చేరుకోగానే పియానో ముందు కూర్చుని ఆమె పాడే పాట వింటాడు. ఎంత జీవనోత్సాహం ఉన్న పాట అది.

పగలే వెన్నెలా జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే.... అంతే.. ఆ పాటకు ఆమెకు తన మనసు కానుకగా ఇస్తాడు. మరునాడు ఉద్యానవనానికి వెళ్లి సంతోషంగా పాడుకుంటాడు. ఏమని? నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదుర లేచెనెందుకో... కాని ఈ మెలుకువ మృతపాయం కానుంది. తనను కబళించనుంది. ఎందుకంటే జమున మనసులో అక్కినేని అంటే ప్రేమభావం లేదు. సోదరభావం ఉంది. ఎన్నడో చనిపోయిన తన సోదరుణ్ణి అక్కినేనిలో చూసుకుంటూ అతడికి సన్నిహితం అవుతుంది ఆమె. ఈ సంగతి ఏరోజు తెలుస్తుందో ఆ రోజే అక్కినేని సగం చచ్చిపోతాడు. ఆడపిల్ల మనసు ఎటువంటిదో కనిపెట్టడం ప్రాణాంతకమైన విషయంగా గ్రహిస్తాడు. ఈలోపు తండ్రి పని చేసే బ్యాంకు దివాలా తీసి జమున కుటుంబం హటాత్తుగా నిష్క్రమిస్తుంది. కంటి ముందు ఆమె కనిపించకపోయేసరికి అక్కినేని ఇంకా నిర్లిప్తతలో కూరుకుపోతాడు.

అదంతా ఆ ఎస్టేట్‌ మేనేజర్‌ అయిన గుమ్మడి కూతురు సావిత్రి చూస్తుంది. అతడిని తిరిగి మామూలు మనిషి చేయాలని చూస్తుంది. అతడి పట్ల అనురాగం ప్రదర్శిస్తుంది. సపర్యలు చేస్తుంది. ఆ పాడైపోయిన వీణలో తాను నాదం నింపుతుంది. కాని అక్కినేనికి భయం. పాత  గాయం అతణ్ణి దారుణంగా భయపెడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మనసులో ఏముందో...

తాను ఈ అమ్మాయిని ఇష్టపడితే కనుక తాను ఏ దృష్టితో చూస్తూ ఉందో. ఒకసారి దెబ్బ తినింది చాలు.. మళ్లీ తినాలా అని సతమతమవుతాడు. కాని అతడి మనసు అప్పటికే ఆమెతో నిండిపోయింది. ఆ సంగతి చెప్పలేడు. ఆమె ఇష్టాన్ని గ్రహించలేడు. ఏం చేయాలో అర్థం కాక తనను తాను హింసించుకోవడానికి అన్నట్టు గానాబజానాల వాళ్ల వెంట తిరుగుతూ ఉంటాడు. మరోవైపు దూరపుబంధువులు ఎస్టేటు మీద దావా వేసి అస్తి పెండింగ్‌లో పడేట్టు చేసి అతణ్ణి రోడ్డు మీదకు తెస్తారు. భౌతికంగా మానసికంగా సంక్షోభంలో ఉన్నా సావిత్రి అతడి నీడ వదలదు. ఆరాధిస్తూనే ఉంటుంది. చివరకు అతడు ధైర్యం చేస్తాడు. ఆమెకు తన మనసులో మాట చెప్తాడు.

ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరై అతడి పాదాల మీద పడుతుంది. కథ సుఖాంతమవుతుందనుకునేంతలో దాయాదులు వేసిన పన్నాగంలో యాక్సిడెంట్‌ అయ్యి అక్కినేనికి మతి పోతుంది. జగ్గయ్య వంటి మిత్రుడు వైద్యం చేస్తున్నా వేరే ఏదో ఓదార్పు అవసరమవుతుంది. అప్పుడు జమునను అక్కినేని ముందుకు తీసుకుని వస్తారు. అన్నేళ్ల క్రితం పాడిన పాటను తిరిగి ఆమె పాడుతుంది. పగలే వెన్నెలా.. జగమే ఊయలా... మరో వైపు సావిత్రి అతడికెంతో ఇష్టమైన వయొలిన్‌ని అతడి చేతుల్లో పెట్టి వాయించమంటుంది. అటు పాట.. ఇటు సంగీతం..

చెదిరిన అతడి స్థిరత్వాన్ని వెనక్కు తీసుకువస్తాయి. అతడు మామూలు మనిషి అవుతాడు. సావిత్రి అతణ్ణి తన మనిషిగా గెలుచుకుంటుంది. సావిత్రికి భక్తి ఎక్కువ. ఎప్పుడూ పూజలో ఉంటుంది. ఆ పూజ వృ«థాపోలేదని ఫలం దక్కిందని కథ. కాని ఆ పూజ కన్నా అక్కినేని పట్ల ఆమె ప్రదర్శించిన ఆరాధన ఎక్కువ. ఆ ఆరాధనే ఆమెకు అతణ్ణి తిరిగి అప్పజెప్పిందని అర్థం చేసుకోవాలి.

1964లో వచ్చిన ‘పూజాఫలం’ మ్యూజికల్‌. పాటల కంటే కూడా నేపధ్య సంగీతం ద్వారా ఒక బ్యాలే లాగా ఈ సినిమా కొనసాగుతుంది. సినిమా అంతా వయొలిన్, వీణ, ఏదో ఒక రాగం, గానం ఉంటాయి. ఇలాంటి సబ్జెక్ట్‌ను బి.ఎన్‌.రెడ్డి కాకుండా ఇంకెవరు తీసినా ఇది ఒక్కరోజు కూడా ఆడి ఉండేది కాదు. బి.ఎన్‌. వల్లే ఇది క్లాసిక్‌ స్థాయిలో నిలబడింది. ముఖ్యంగా క్లయిమాక్స్‌లో అక్కినేని వయొలిన్‌ వాయించడం మొదలుపెట్టి తన మానసిక స్థితికి తగ్గట్టుగా కాసేపు శృతిలో మరికాసేపు అపశృతిలో వాయించే సన్నివేశం ఇంతకు మునుపు లేదు అటు తర్వాత కూడా లేదు. క్యారెక్టరైజేషన్, కథ నడక... వీటన్నింటిలో బిఎన్‌ మార్కు కనిపిస్తుంది. ఆయనకు నప్పని కామెడీ ట్రాకును పెట్టినా పొట్టి ప్రసాద్, రమణారెడ్డి, రేలంగి దానిని పండించే ప్రయత్నం చేస్తారు. సంగీత దర్శకుడిగా సాలూరి రాజేశ్వరరావు ప్రావీణ్యం ఈ సినిమాలో అడుగడుగునా గమినంచవచ్చు. కథారచయిత మునిపల్లె రాజు రాసిన ‘పూజారి’ అనే

నవల ఆధారంగా తీసిన ఈ సినిమా అసలు సిసలు అక్కినేని సినిమా అనిపిస్తుంది. ఆయన కాకపోతే ఎవరూ ఈ పాత్రను చేయలేరు. చేసినా ఎవరూ చూడలేరు. అబ్బాయి మనసులో అమ్మాయిని పెట్టుకుని ఆ సంగతి బయటపెట్టక నలుగుతూ ఉండటం ఈ సినిమాతోనే మొదట చూపారనిపిస్తుంది. ఈ సినిమా వచ్చిన చాలా రోజుల తర్వాత ఇటువంటి కథాంశం ఉన్న సినిమాలు అనేకం తెలుగులో, తమిళంలో వచ్చాయి. తెలుగులో డబ్‌ అయిన ‘హృదయం’, పవన్‌ కల్యాణ్‌ ‘తొలి ప్రేమ’ ఇవన్నీ చివరి వరకూ అమ్మాయికి ఐ లవ్‌ యూ చెప్పడానికి సతమతమయ్యేవే. పూజాఫలం నీట్‌ అండ్‌ క్లీన్‌ సినిమా. అబ్బాయిల సినిమా. అబ్బాయిల మనసును కొద్దో గొప్పో చెప్పిన సినిమా. ఫలించిన సినిమా.


ప్రాక్టీసు పెడితే రెండు లక్షలు
ఈ సినిమా 1964లో వచ్చిందని చెప్పుకున్నాం. దీనికి మాటలు రాసిన డి.వి.నరసరాజు ఆ నాటి కట్నం లెక్కలు ఒక డైలాగులో చెప్పించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసైతే పదివేలు. బి.ఏ. పాసైతే పాతిక వేలు. ఎంబిబిఎస్‌ చేరితే యాభై వేలు. పాసైతే లక్ష. ప్రాక్టీసు పెడితే రెండు లక్షల కట్నం ఆ రోజుల్లో మార్కెట్‌లో ఉందట. మరి ఈ రోజుల్లో ఎంబిబిఎస్‌ పాసై ప్రాక్టీసు పెట్టిన వాళ్లు ఎంత డిమాండ్‌ చేస్తున్నారో కాని మగపిల్లలను కట్నం కోసమే పెద్ద చదువులు చదివించే మనస్తత్వం మాత్రం ఇంకా పోలేదు... అనుకునే దాఖలాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి.
– కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement