ఒక్క పేరులో బంధించలేం
కోకొల్లలుగా దేవుళ్లు ఉన్న ఈ ప్రపంచంలో, నిజమైన దేవుడు ఎవరో అర్థం కాక అనేకులు సతమతమౌతూ ఉంటారు. తమ దేవుడే నిజమైన దేవుడని ప్రతి మతస్థుడూ చెబుతాడు. అయితే సనాతన ధర్మం ఏకైక భగవానుని ఆరాధించాలని ప్రబోధిస్తోంది. భగవంతుడొక్కడేనని, ఆయనే పూజనీయుడని, సమస్త ఘనతకు, మహిమకు పాత్రుడనీ ఋగ్వేదం చెబుతోంది. దేవుడొక్కడేనని బ్రహ్మసూత్రం సంకేతపరుస్తోంది. అలాగే బైబిలు, ఖురాన్ గ్రంథాలు కూడా దేవుడొక్కడే అని ప్రవచిస్తున్నాయి. అందుకే సృష్టికర్త, మహాశక్తిమంతుడు, మహోన్నతుడు, సర్వాంతర్యామి; కరుణ, దయ, ప్రేమ కలిగిన ఆ దేవ దేవుణ్ణి మనం ఒక్క పేరులో బంధించలేం. ఎందుకంటే ప్రతి పేరుకూ ఒక అర్థం ఉంటుంది.
భగవంతునికున్న భిన్న లక్షణాలన్నీ వివరించడానికి ఈ భూప్రపంచమంత విశాలమైన కాగితం మీద, వృక్షాలన్నిటినీ కలంగా మార్చి, సముద్ర జలాలన్నిటినీ సిరాలా ఉపయోగించి రాసినా పూర్తిగా ఆయన్ని వర్ణించలేమని ఖురాన్ చెబుతోంది. అంచేత సత్యం ఒక్కటే. దేవుడు ఒక్కడే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించిననాడు, మతం పేరిట జరుగుతున్న అనర్థాలు సమసిపోయి, శాంతి స్థాపన జరుగుతుంది. లోకం స్వర్గమయం అవుతుంది.
- యస్. విజయభాస్కర్