భలే మంచి 'చెత్త 'బేరము | Online Scrap Business Websites Special Story | Sakshi
Sakshi News home page

భలే మంచి 'చెత్త 'బేరము

Published Wed, Jun 26 2019 10:47 AM | Last Updated on Wed, Jun 26 2019 10:47 AM

Online Scrap Business Websites Special Story - Sakshi

ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ షాపింగ్‌ హవా నడుస్తోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ, దీనివల్ల ఇళ్లల్లో పెద్దపెద్ద కార్ట్టన్లు, పేపర్‌ బ్యాగ్‌ల రూపంలో కొత్తరకం చెత్త తయారవుతోంది. దీనికి తోడు ఇంట్లో రోజువారి వ్యర్థాలు అదనంగా ఉండనే ఉంటాయి. అయితే ‘కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం’ అన్నట్లు ఇంట్లోని చెత్తను కూడా సొమ్ము చేసుకునే మార్గాలు ఉన్నాయి! అంతేకాదు.. ఇంట్లోని పొడిచెత్తను కూడా ఆన్‌లైన్‌ ద్వారా వదిలించుకోవచ్చని అంటున్నాయి కొన్ని స్టార్టప్‌ కంపెనీలు. రీసైక్లింగ్‌ చేయదగిన చెత్తనంతటినీ కస్టమర్ల ఇంటికి వచ్చి మంచి ధరకు కొనుగోలు చేస్తామని చెబుతున్న కొన్ని ఆన్‌లైన్‌ గార్బేజ్‌ సంస్థల వివరాలు మీకోసం.

ద కబాడీవాలా
కబాడీవాలా ఒక స్థానిక చెత్తను సేకరించే ఆన్‌లైన్‌ డీలర్‌. దీనిని అనురాగ్‌ అస్తీ, కవీంద్ర రఘువంశీ అనే ఇద్దరు కలిసి ప్రారంభించారు. వీరు తమ యాప్‌ ద్వారా స్థానికంగా ఉన్న ఇళ్లనుంచి చెత్తను సేకరించి రీసైక్లింగ్‌ యూనిట్లకు పంపుతారు. ముఖ్యంగా కబాడీవాలా.. న్యూస్‌ పేపర్లు, ప్లాస్టిక్‌ వస్తువులు, లోహ వస్తువులు, పుస్తకాలు, ఇనుము వంటి వాటిని ఇంటి యజమానులకు కొంత మొత్తంలో డబ్బులచెల్లించి సేకరిస్తుంది. అయితే వీరు తీసుకున్న చెత్తను ఎక్కడకి తీసుకెళ్తున్నారు? దానిని ఏంచేస్తున్నారో ప్రతీది కస్టమర్లకు తెలుసుకునే విధంగా లైవ్‌ ట్రాక్‌ సిస్టం సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. కబాడీవాలా సేకరిస్తున్న చెత్త కార్యక్రమం వల్ల..  10వేల చెట్లను రక్షించబడడమేగాక, 2.5 లక్షల లీటర్ల ఆయిల్, 13.8 మిలియన్ల లీటర్ల నీరు ఆదా అవుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం కబాడీవాలా భోపాల్, ఇండోర్, ఔరంగాబాద్, రాయ్‌పూర్‌లలో సేవలందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.thekabadiwala.com

జంక్‌ కార్ట్‌
జంక్‌ కార్ట్‌ను ఢిల్లీకిచెందిన నీరజ్‌ గుప్తా, శైలేంద్ర సింగ్, ప్రశాంత్‌ కుమార్, శుభం షా అనే ముగ్గురు కలిసి 2015లో ప్రారంభించారు. వీరు కూడా అన్ని రీసైక్లింగ్‌ వస్తువులను సేకరిస్తారు. ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్, పేపర్, పుస్తకాలు, గ్లాస్‌ వంటి వాటిని సేకరిస్తారు. చెత్త ఇచ్చిన వారికి పేటిఎం వాలెట్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. అయితే ఎవరైనా కస్టమర్లు తమ చెత్త  అమ్మగా వచ్చిన డబ్బులను స్వచ్ఛంద సంస్థలు, జంక్‌ ఆర్ట్‌లకు దానం చేయాలనుకుంటే...జంక్‌ కార్ట్‌లోని ఒక ఆప్షన్‌ ద్వారా దానం చేసే సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. మనం ఆన్‌లైన్‌లో ఒక వస్తువును కొనడానికి ఎలా ఆర్డరు ఇస్తామో అలానే జంక్‌ కార్ట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆర్డరు ఇస్తే వారే వచ్చి చెత్తను తీసుకెళ్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని నిర్వహకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వారి వెబ్‌సైట్లో ఏ చెత్తను ఎంతరేటుకు తీసుకుంటారో వివరాలు పొందుపర్చారు, వీటి ద్వారావారు చెత్తను కొంటారు.
వెబ్‌సైట్‌: www.junkart.in

కర్మ రీసైక్లింగ్‌
మనకు ఏదైనా చెడుగాని, కష్టాలుగాని ఎదురైనప్పుడు మన కర్మ ఇంతేలే అనుకుంటాం. ఈ కర్మనే ఆధారం చేసుకుని చెత్తను పారేసి మీరు మెరుగుపడండి అంటూ ఓ స్టార్టప్‌ చెబుతోంది. అదే కర్మ రీసైక్లింగ్‌. మనింట్లో పేరుకు పోయిన చెత్తను పారవేసి మన కర్మను మరింత మెరుగు పరుచుకోవచ్చనే థీమ్‌తో అమీర్‌ జైరీవాల, అక్షత్‌ అనే ఇద్దరు ఈ పేరు మీదుగా చెత్తను సేకరిస్తున్నారు. అయితే వీరు మామూలు చెత్తను కాదు... ఎలక్ట్రానిక్‌ చెత్తను మాత్రమే సేకరిస్తారు. అదీ కూడా పాత మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, వాటికి సంబంధించిన పరికరాలు సేకరిస్తారు. వాటిలో ఏవైనా చిన్నపాటి లోపాలు ఉంటే వాటిని సరిచేసి మళ్లీ వాటిని చాలా తక్కువ రేట్లకు అమ్ముతుంటారు. అయితే వీరు మన దగ్గర ఉన్న ఫోన్లు కానీ ల్యాప్‌ట్యాప్‌గాని కొనాలంటే అది ఏ బ్రాండ్‌కు చెందినది, ఇంకా ఆయా వస్తువు గురించి కొన్ని రకాల చిన్నపాటి ప్రశ్నలకు జవాబులు ఇస్తేనే వారు మనం అమ్మదల్చుకున్న ఫోనుకు ఎంత మేర ధర చెల్లిస్తారో చెబుతారు. కస్టమర్‌కు కర్మ వారు ఇచ్చిన ధర ఓకే అయితే వారు దానిని తీసుకుని సర్సీస్‌ సెంటరుకు పంపిస్తారు. ఇలా దాదాపు 3 వేల స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లను వీరు రీసైక్లింగ్‌కు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో కర్మసేవలు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్‌: www.karmarecycling.in

ఎక్స్‌ట్రా కార్బన్‌
ఈ–వేస్ట్‌ను సేకరించే సంస్థే ఎక్స్‌ట్రా కార్బన్‌. గురుగ్రాంకు చెందిన ఒక స్టార్టప్‌ సంస్థ. ఈ సంస్థను 2013లో ప్రారంభమైంది. సంవత్సరానికి 6 వేల టన్నుల ఈ–వేస్ట్‌ను ఎక్స్‌ట్రా కార్బన్‌ సేకరిస్తుంది. ఉత్తర భారతదేశంలోని 9 నగరాల్లో 41 వేలమంది ఎక్స్‌ట్రా కార్బన్‌ కస్టమర్లు ఉన్నారు. ఎక్స్‌ట్రా కార్బన్‌ సంస్థను ప్రారంభించిన మొదటేడాదిలోనే రూ.70లక్షలను సంపాదించడం విశేషం.
వెబ్‌సైట్‌: http://extracarbon.com

స్క్రాప్‌ ట్యాప్‌
ఇది హైదరాబాద్‌కు చెందిన సంస్థ. ‘‘జీరో వేస్ట్‌ హీరో’’ అనే నినాదంతో స్క్రాప్‌ ట్యాప్‌ ప్రారంభమైంది. దీనిలో ముఖ్యంగా ఐదుదశల్లో చెత్తను సేకరించి రీసైక్లింగ్‌ చేస్తారు. చెత్త అమ్మేవారు, కొనే వారికి మధ్య ఒక మంచి వారధిగా స్క్రాప్‌ట్యాప్‌ వ్యవహరిస్తుంది. చెత్తను సేకరించి దానిని డిజిటల్‌ వేయింగ్‌ మిషన్‌ ద్వారా కొలిచి, ధరను నిర్ణయిస్తారు. ఆ తరువాత ఆ ధర కస్టమర్‌కు నచ్చితే దానిని రీసైక్లింగ్‌ యూనిట్‌కు పంపిస్తారు. వీరు వెబ్‌సైట్‌ ద్వారానే గాక వాట్సప్‌ నంబరు ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. స్క్రాప్‌ట్యాప్‌ ఇళ్లనుంచే గాక చిన్న చిన్న పరిశ్రమల నుంచి కూడా చెత్తను సేకరిస్తుంది.– పోకల విజయ దిలీప్, సాక్షి, స్టూడెంట్‌ ఎడిషన్‌
వెబ్‌సైట్‌: http://scraptap.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement