క్లిక్ చేస్తే సూపర్ మార్కెట్
ఆన్‌లైన్...ఆన్‌లైన్....ఏ నోట విన్నా ఇదే మంత్రం. స్మార్ట్‌సిటీలో ప్రజలంతా స్మార్ట్‌గా మారిపోతున్నారు. పాత అభిరుచులు మారిపోతున్నాయి. కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇపుడు మార్కెట్‌కు వెళ్లి షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్ చేయాల్సిన పనిలేదు...ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చునో లేదా నయా హస్తభూషణం సెల్‌ఫోన్‌నో క్లిక్ చేసి ‘హలో బజార్’ అని పలకరించేయవచ్చు. కూరగాయల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ ఇంట్లో కూర్చునే షాపింగ్ చేసుకోవచ్చు. మరి మన సిటీలో ఈ ఆన్‌లైన్ షాపింగ్ ఎలా ఉంది....ఓ లుక్కేద్దామా...!
మార్కెట్లో బజార్‌కి వెళ్లి కావాల్సిన వస్తువులన్ని కొనుగోలు చేసుకొని ఇంటికి తిరిగొచ్చే సరికి కనీసం 2 నుంచి 3 గంటలు సమయం పడుతుంది. సిటీలో పెరగుతున్న జనాభా, వాహనాల సంఖ్య వలన ఇంట్లో కావాల్సిన వస్తువుల కోసం బజార్‌కి వెళ్లి వచ్చే సరికి చాలా సమయం వృధా అవుతుంది. దాంతో పాటు రోడ్డు మీద వాహనాల రణగోణ ధ్వనులు, అస్తవ్యస్థ జీవనంలో మార్కెట్‌కి వెళ్లి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలంటే తల ప్రాణం తోకకు వచ్చినట్లే. ఇలాంటి సమయంల్లో ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్ని నేరుగా ఇంటికే వచ్చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కచ్చితంగా వస్తుంది. అలాంటి వారికోసమే ఆన్‌లైన్ బజార్‌లు వారి ముంగిటకు వచ్చాయి. ప్రస్తుతం సిటీలో ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ గ్రోసరీకి డిమాండ్ బాగా పెరిగింది. ఏడాది క్రితం వరకు ఆన్‌లైన్ బజార్ అంటే తెలియని వారు ఇప్పుడు ఆన్‌లైన్ బజార్ తప్ప మరోదాని గురించి ఆలోచించడం లేదు. ఈ మధ్య కాలంలో సిటీలో కిరణా, నిత్యవసర వస్తువుల హోం డెలివరీ సదుపాయాలు పెరిగాయి. ఇంట్లో కావాల్సిన సబ్బుల నుంచి పప్పులు, ఉప్పులు వరకు, కరివేపాకు నుంచి కాయగూరల వరకు, పౌడర్ నుంచి పెర్‌ఫ్యూమ్ వరకు, ఇండియన్ బనానా నుంచి ఫారిన్ ఫ్రూట్స్ వరకు ఇలా అన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కొన్ని గంటల్లోనే ముంగిట్లోకి వచ్చేస్తున్నాయి.
నాలుగు నుంచి 6 గంటల్లో..
ప్రస్తుతం నగరంలో నడుస్తున్న ఆన్‌లైన్ సూపర్ మార్కెట్ స్టోర్స్, అలానే ఇతర ఆన్‌లైన్ ప్రొడక్ట్ సైట్స్ సుమారు 20 వరకు ఉన్నాయి. ఇందులో ఫుడ్ ఐటెమ్స్ నుంచి కిరాణా సరుకుల వరకు అన్నింటిని హోం డెలివరీ చేస్తున్నారు.
అయితే కిరాణా సామాన్లు ఉదయం వేళల్లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత 4 నుంచి 6 గంటల్లో నేరుగా ఇంటికి తీసుకొచ్చి వాటిని అందిస్తూ మనీ తీసుకుంటారు. అలానే 12 గంటల తర్వాత అయితే మరుసటి రోజు హోం డెలివరీ చేస్తున్నారు. ఫ్రూట్స్, ఫుడ్ ఐటెమ్స్ అయితే గంట నుంచి రెండు గంటల్లో కావాల్సిన చిరునామాకు తీసుకొచ్చి అందిస్తారు. ప్రస్తుతం సిటీల్లో నిత్యవసర సరుకులను కొనుగోలు చేసేవారిలో కనీసం 20 శాతం మంది ఆన్‌లైన్ బజార్ ద్వారా వారికి కావాల్సిన వస్తువులు బుక్ చేసి తెచ్చుకుంటున్నట్టు అంచనా.
3 వేల రకాల సరుకులు బిజినెస్ చేస్తున్నాం....
మేం ఆన్‌లైన్ సూపర్ మార్కెట్ ప్రారంభించి 9 నెలలు అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రజల్లో దీని మీద బాగా అవగాహన పెరగడంతో ఎక్కువగా ఆన్‌లైన్‌లో వారికి కావాల్సిన సరుకులు వివరాలు బుక్ చేసుకొని తెప్పించుకుంటున్నారు. సుమారు 3000 రకాల సరుకులు మేం ఆన్‌లైన్ ద్వారా కస్టమర్స్‌కి అందిస్తున్నాం. మా సైట్‌లో ఇప్పుడు సుమారు వెయ్యి మంది వరకు సబ్‌స్క్రైబ్ అయిన వారు ఉన్నారు. వీరంతా నేరుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని సరుకులు తెప్పించుకుంటారు. రోజుకి 3000 వరకు హోం డెలివరీ ద్వారా సరుకు అమ్ముతున్నాం. మేం లోకల్‌గా ఉన్న రిటైలర్‌స, సూపర్ మార్కెట్స్‌తో డీల్ పెట్టుకొని రకరకాల ప్రొడక్ట్స్‌ని కష్టమర్స్‌కి అందిస్తున్నాం.
- ఏ.ఎన్.రెడ్డి, హలో బజార్ మేనేజింగ్ డెరైక్టర్
అన్ని రకాల ఫ్రూట్స్ పంపిణీ..
మేం ఇటీవలే ఆన్‌లైన్ ఫ్రూట్స్ హోం డెలివరీ బిజినెస్ స్టార్ చేశాం. అయితే మార్కెట్‌లో ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నా వాటిలో ఫ్రెషన్‌నెస్‌తో ఉన్నవి చాలా తక్కువ. అందుకే కావాల్సిన ఫ్రూట్స్‌ని నేరుగా కస్టమర్ వద్దకే చేర్చేందుకు ఫ్రూట్ బాక్స్ సైట్‌ని స్టార్ట్ చేశాం. ఈ సైట్‌లో నేరుగా కావాల్సిన ఫ్రూట్స్‌ని బుక్ చేసుకుంటే వారి ఇంటికి తీసుకెళ్లి అందిస్తాం. అలానే పార్టీ స్టైల్, డయాబిటిక్, కిడ్స్, ఆఫీస్ లకు ప్రత్యేకంగా ఫ్రూట్ బాక్స్‌లను డిజైన్ చేసి అంందుబాటులో ఉంచుతున్నాం. ఈ ప్యాకేజీలు కూడా నేరుగా బుక్ చేసుకోవచ్చు. మేం కస్టమర్స్‌కి హెల్దీ ఫ్రూట్స్‌ని మాత్రమే అందిస్తాం. దేశవాళీ ఫ్రూట్స్ నుంచి విదేశీ ఫ్రూట్స్ వరకు అన్ని రకాలు అందుబాటులో ఉంచుతున్నాం.
- మాధురి, ఫ్రూట్ బాక్స్ మేనేజింగ్ డెరైక్టర్