పేలిన ‘రెడ్‌మీ నోట్-4’
కర్ణాటకలో ఘటన
మండ్య (కర్ణాటక): ఎంతో ముచ్చటపడి కొన్న స్మార్ట్‌ఫోన్ ఆ యువకుడికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. అప్పుడే ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా ఇంటికి వచ్చిన మొబైల్ ఫోన్ ఆన్ కాకపోవడంతో దానిని సంబంధిత షోరూంకి తీసుకెళ్లాడు. టెక్నీషియన్ దానిని ఆన్‌చేస్తుండగా ఫోన్‌లోంచి పొగలు రావడంతో ఫోన్‌ను బయటకి విసిరేయడంతో అది పేలింది. ఈ సంఘటన మండ్య నగరంలో ఆర్‌పీ రోడ్డులోని మొబైల్ షోరూంలో శనివారం జరిగింది. ఒక యువకుడు రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలుచేశాడు.
శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న కొరియర్‌లోంచి మొబైల్‌ను బయటకుతీసి ఆన్‌చేయగా అది ఆన్‌కాలేదు. దీంతో యువకుడు ఆ ఫోన్ సర్వీసింగ్ చేసే షోరూం వద్దకు తీసుకెళ్లి ఆన్‌చేసి ఇవ్వాలని కోరగా, సిబ్బంది దానిని ఆన్‌చేస్తుండగా ఫోన్‌లోంచి పొగలొచ్చాయి. దీంతో దుకాణంలో ఉన్నవారు కంగారుపడి మొబైల్‌ను బయటకి విసరడంతో అది పెద్దగా శబ్దంచేస్తూ పేలింది. స్క్రీన్ వైపు బాగానే ఉన్నా వెనుక వైపు మొత్తం కాలిపోయినట్లయింది.