ఆన్‌లైన్ షాపింగ్‌కు ఎం-కామర్స్ దన్ను
స్మార్ట్‌ఫోన్ల జోరే కారణం...
ముంబై: పరుగులు తీస్తున్న ఆన్‌లైన్ షాపింగ్(ఈ-కామర్స్) రంగాన్ని స్మార్ట్‌ఫోన్‌లు మరిన్ని శిఖరాలకు తీసుకెళ్లనున్నాయి. స్వల్పకాలంలోనే ఎం-కామర్స్(మొబైల్స్ ద్వారా ఆన్‌లైన్ కొనుగోళ్లు) ఆదాయాలు పరిశ్రమ మొత్తం ఆదాయాల్లో 70 శాతానికి చేరనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో మొబైల్స్ ద్వారా ఇంటర్నెట్ వాడకం(ట్రాఫిక్) ఇప్పటికే పర్సనల్ కంప్యూటర్ల ట్రాఫిక్‌ను మించిపోయిందని.. ఇదంతా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం దూసుకెళ్తుండటమే కారణమని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ చెప్పారు. దీంతో ఎం-కామర్స్ మార్కెట్ అనూహ్యంగా పెరగనుందని.. దీంతో ఈ-కామర్స్ కంపెనీలు తదనుగుణంగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయన్నారు.
‘మొబైల్/ట్యాబ్లెట్ నెట్ యూజర్లు భారత్‌లో ప్రస్తుతం 12 కోట్లు కాగా... పీసీల్లో నెట్ వినియోగిస్తు న్న వారి సంఖ్య 10 కోట్లుగా ఉందని అంచనా. మాకు వస్తున్న ఆర్డర్లలో దాదాపు 60 శాతం వరకూ ఇప్పుడు మొబైల్స్ ద్వారానే నమోదవుతున్నాయి. ఇది అంతకంతకూ వేగం పుంజుకుంటోంది. వచ్చే ఏడాది వ్యవధిలో ఈ వాటా 75 శాతానికి చేరొచ్చని భావిస్తున్నాం’ అని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బహల్ పేర్కొన్నారు. ఫ్యాషన్ రిటైలర్ మింత్రా డాట్‌కామ్ కూడా తమ ఆదాయాల్లో 70% ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఎం-కామర్స్ ద్వారానే ఉండొచ్చని పేర్కొంది.
ఆన్‌లైన్ రిటైల్(ఈ-టెయిలింగ్) పరిశ్రమ మార్కెట్ విలువ ప్రస్తుతం 3 బిలియన్ డాలర్లుకాగా, ఇందులో ఎం-కామర్స్ వాటా 30 శాతంగా ఉందని టెక్నోపాక్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అంకుర్ బిసేన్ చెప్పారు. 2020 కల్లా ఈ-టెయిలింగ్ పరిశ్రమ 32 బిలియన్ డాలర్లకు ఎగబాకనుందని.. దీనిలో ఎం-కామర్స్ వాటా 40%కి చేరవచ్చనేది ఆయన అంచనా. ఈ-కామర్స్ పరిశ్రమ క్రమంగా మొబైల్ కామర్స్‌గా రూపాంతరం చెందుతోందని కూడా పేర్కొన్నారు. తమ ఆర్డర్లలో ఏడాది క్రితం మొబైల్స్ ద్వారా 10% నమోదుకాగా, ఇప్పుడిది 50 శాతాన్ని మించిందని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ డెరైక్టర్ మౌసమ్ భట్ చెప్పారు.
నవంబర్‌లో 25 వేల కోట్ల విదేశీ నిధులు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నవంబర్‌లో నికరంగా రూ. 25,500 కోట్లు(4.1 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్‌చేశారు. దీంతో ఈ ఏడాది జనవరి మొదలు మొత్తం విదేశీ పెట్టుబడులు 40 బిలియన్ డాలర్లను తాకాయి. కాగా, నవంబర్‌లో ఎఫ్‌పీఐలు ఈక్విటీలకు రూ. 13,753 కోట్లను(2.23 బిలియన్ డాలర్లు) కేటాయించగా, మరోవైపు రూ. 11,723 కోట్ల(1.9 బిలియన్ డాలర్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు.