ఫైండ్... పీస్ ఆఫ్ మైండ్
కాలం మారిపోయింది... ఉరుకులు పరుగుల జీవితం. ఇంట్లో... బయట... ఆఫీసులోనూ టెన్షన్ టెన్షన్ టెన్షన్! ఈ రోజువారి ఆందోళన కొందరు స్థైర్యవంతుల్ని ఏమీ చేయలేకపోయినా కొందరు దుర్బల మనస్కులు మాత్రం బలహీన క్షణాల్లో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ క్షణికావేశపు నిర్ణయాల్ని మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంచెం స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడితే అన్నీ సర్దుకుంటాయి. ఈ రకమైన ఆలోచనలకు సాయపడే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి!
ఉద్వేగాన్ని తగ్గించేందుకు బెల్లీబయో
అకారణంగా టెన్షన్‌కు గురవడం... ఒళ్లంతా చెమటలు పట్టేసినట్టుగా అయిపోవడం.. హడావుడిగా అటు ఇటు అడుగులేయడం... యాంగ్జైటీ లక్షణాలివి. ఇలాంటి పరిస్థితుల్లో మీ టెన్షన్‌ను తగ్గించుకునేందుకు మేలైన మార్గం గట్టిగా ఊపిరి తీసుకుని వదలడం. ఈ పనినైనా మీరు సరిగా చేస్తున్నారా? లేదా తెలుసుకోవాలనుకుంటే ‘బెల్లీబయో’ అప్లికేషన్‌ను వాడవచ్చు. ఈ అప్లికేషన్ మీ ఉచ్ఛ్వాస, నిశ్వాసల శబ్దాలను వింటూ పనిచేస్తుంది. పొట్ట కదలికల ఆధారంగా మీ శ్వాస తీరును గమనించి ఛార్ట్‌లను సిద్ధం చేసి చూపుతుంది. టెన్షన్ తగ్గించుకునేందుకు ఇది బాగా పనికొస్తుందని నిపుణుల అంచనా.
విపరీత ఆలోచనలను దూరం చేసే ‘ఆపరేషన్ రీచ్ ఔట్’
మార్కులు తక్కువ వచ్చాయని, ర్యాగింగ్‌కు గురయ్యామని.. కుటుంబ సమస్యలున్నాయని... బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి గురించి మనం తరచూ వింటూంటాం. వార్తలు చూస్తూంటాం. బలవంతంగా తనువు చాలించాలనుకునే వారు ఒక్క క్షణం పునరాలోచించినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉంటాయి. తమ గోడును, బాధను ఇంకొకరితో పంచుకున్నా బలవన్మరణమనే ఆలోచన దూరమవుతుంది. ఆపరేషన్ రీచ్ ఔట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఈ రకమైన ఆసరా ఇస్తుంది. అమెరికాలో మాజీ సైనికుల కోసం సిద్ధం చేసిన ఈ అప్లికేషన్ ఆ బలహీన క్షణాల్లో మీ ఆలోచనలను మార్చేందుకు రకరకాల వీడియోలను చూపుతుంది. అంతేకాకుండా ఆత్మహత్యల నివారణకు ఉద్దేశించిన కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించే అవకాశం కల్పిస్తుంది. తగిన వైద్యసాయం పొందడం ఎంత అవసరమో గుర్తు చేస్తూ... విపరీత ఆలోచనల నుంచి బయటపడేందుకు సహకరిస్తుంది.
స్ట్రెస్‌కు విరుగుడు ఈసీబీటీ కామ్
ఈ అప్లికేషన్ ఐఫోన్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే లక్ష్యంతో కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ ఆధారంగా అభివృద్ధి చేశారు. కౌన్సెలింగ్‌కు ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం రిలాక్స్‌డ్‌గా మారేందుకు పనికొస్తుంది. ఇందుకు అవసరమైన పద్ధతులు, సమాచారం దీంట్లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈసీబీటీ కామ్ వంటి అప్లికేషన్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. నార్త్‌వెస్ట్రర్న్ యూనివర్శిటీ వారు తయారు చేసిన ‘ఇంటెలీకేర్’ వీటిల్లో ఒకటి. దాదాపు 12 మినీ ఆప్స్‌లో వచ్చే ఈ అప్లికేషన్ మీ నెగటివ్ ఆలోచనలను మార్చేందుకు, భరోసా ఇచ్చే సందేశాలతో కూడి ఉంటుంది.
సుఖ నిద్రకు డీప్ స్లీప్ విత్ ఆండ్రూ జాన్సన్
కంటి నిండా నిద్రపోతే ఆ ఉదయం కలిగే ఫ్రెష్ ఫీలింగ్ అనిర్వచనీయం. కానీ రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టేదెలా? డీప్ స్లీప్ విత్ ఆండ్రూ జాన్సన్ మీకు సాయపడుతుంది. రకరకాల సున్నితమైన శబ్దాలతో, సూచనలతో సాగిపోయే ఈ అప్లికేషన్ మీ మనస్సును శాంతపరిచి నిద్రపోయేలా చేస్తుంది. ప్రతిరోజూ కనీసం మూడువారాల పాటు ఆప్‌లోని సూచనలను వినాల్సి ఉంటుంది. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ థెరపీకి సంబంధించిన సందేశాలతో ఉండే రికార్డింగ్‌ను వినడం ద్వారా నిద్ర బాగాపడుతుందని అంచనా. ఆపిల్ ఐఫోన్ వినియోగదారులతోపాటు, ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్‌లోనూ లభించే ఈ అప్లికేషన్ కోసం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్లేస్టోర్‌లోని డీప్ స్లీప్ రిలాక్స్ హిప్నాసిస్ అప్లికేషన్ మాత్రం ఉచితంగా లభిస్తుంది.
వాట్స్ మై ఎం3
మనోవ్యాకులత, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలను గుర్తించేందుకు పనికొచ్చే మొబైల్ అప్లికేషన్ ఇది. సైకాలజిస్ట్‌ల ద్వారా సిద్ధం చేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా పనిచేస్తుంది. బైపోలార్ డిజార్డర్ మొదలుకొని పీటీఎస్‌డీ వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్‌ను ఉపయోగిస్తారు. మీ సమాధానాల ఆధారంగా ఒక స్కోర్ సిద్ధం చేసి ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చో సూచిస్తుంది కూడా. ఇంగ్లీషుతో పాటు స్పానిష్ భాషలోనూ అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది.
- గిళియార్