పెడోమీటర్ ఎలా పని చేస్తుంది?
హౌ ఇట్ వర్క్స్
ఈ రోజు.. మీరు వేసిన అడుగులు.. 1900. జాగింగ్ చేసిన దూరం.. 35 నిమిషాల్లో మూడు కిలోమీటర్లు. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ల ద్వారా మనకు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్న సమాచారమిది. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ అప్లికేషన్లు పనికొస్తున్నప్పటికీ... ఇవి అచ్చంగా ఎలా పనిచేస్తాయన్న విషయం మాత్రం తక్కువ మందికి మాత్రమే తెలుసు. పైగా ఈ ఫిట్‌నెస్ అప్లికేషన్ల లెక్కల్ని ఏ మేరకు నమ్మవచ్చో కూడా తెలియదు. ఈ సందేహాలన్నింటికీ సమాధానం ఇదిగో... ఫిట్‌నెస్ అప్లికేషన్లన్నీ మన స్మార్ట్‌ఫోన్లలో ఉండే కొన్ని సెన్సర్ల ఆధారంగా పనిచేస్తాయి. నడక లెక్కలు తేల్చేందుకు పనికొచ్చే యంత్రాన్ని పెడోమీటర్ అంటారు. ఇది పాక్షికంగా ఎలక్ట్రానిక్ పరికరం. దీంట్లో ఒక లోలకం (పెండ్యులమ్), ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటాయి. మనం నడిచేటప్పుడు ఏర్పడే కదలికలకు ఈ లోలకం ఒక చివరి నుంచి మరో చివరకు ఊగి అక్కడ ఉండే లోహపు పలకను తాకుతుంది.
దీంతో ఎలక్ట్రిక్ సర్క్యూట్ పూర్తయి కరెంట్ ప్రవహిస్తుంది. మరో అడుగు వేయగానే సర్క్యూట్ విడిపోతుంది. సర్క్యూట్ కనెక్ట్ అయిన ప్రతిసారి దాన్ని ఒక అడుగుగా లెక్కపెడుతుంది. నిర్దిష్ట సమయంలో లెక్కించిన అంకెలను మీరు వేసే సగటు అడుగు పొడవుతో హెచ్చిస్తే మీరు నడిచిన దూరమెంతో తెలిసిపోతుంది. ఇన్ని అడుగులు వేస్తే ఇన్ని కేలరీలు ఖర్చవుతాయన్న లెక్కలు ఎలాగూ ఉంటాయి కాబట్టి... వాటిని కూడా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చూసుకోవచ్చు.
పదిశాతం వరకూ తేడా... పెడోమీటర్ ద్వారా లెక్కించే అడుగులకు, వాస్తవంగా మీరు వేసిన అడుగులకూ కొంచెం తేడా ఉండే అవకాశముంది. ఈ తేడా పదిశాతం వరకూ ఉండవచ్చునని అంచనా. కారు, లేదా వాహనంలో వెళ్లేటప్పుడు ఎదురయ్యే కుదుపులను కూడా పెడోమీటర్లు అడుగులుగా లెక్కవేయడం దీనికి కారణం. స్మార్ట్‌ఫోన్‌ను భుజానికో, నడుముకో బిగించుకోవడం ద్వారా ఇది మరింత సమర్థంగా పనిచేసేలా చేయవచ్చు.