వయసుతోపాటు ఆరోగ్య సమస్యలు రావడం సహజం. వీటిని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా అలబామా యూనివర్సిటీతోపాటు డాక్టర్ ఇవనోవీ బుర్మాజోవీలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధన ఒకటి ఆసక్తికరమైన ఫలితాలను చూపింది. మనకు అత్యవసరమైన సూక్ష్మపోషకాల్లో ఒకటైన జింక్.. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వీరు గుర్తించారు.
ఇంకో విషయం ఏమిటంటే.. కాఫీ, టీ, చాకొలేట్ వంటి వాటితో కలిపి తీసుకున్నప్పుడు జింక్ ప్రభావం ఎక్కువగా ఉండటం. శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు.. హాని కలిగించే ఫ్రీరాడికల్స్ మధ్య సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇది మధుమేహం మొదవలుకొని అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమని ఇప్పటికే తెలుసు. ఈ నేపథ్యంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు కారణమవుతున్న సూపర్‌ఆక్సైడ్‌ను ఎదుర్కోవడంలో జింక్ పనికొస్తుందని డాక్టర్ ఇవనోవీ అంటున్నారు.
కాఫీ, టీ, చాకొలేట్ వంటి పదార్థాల్లో ఉండే హైడ్రోక్వినోన్ మూలకాలను జింక్ ఉత్తేజితం చేస్తుందని, పాలిఫినాల్ గ్రూపునకు చెందిన ఈ హైడ్రోక్వినోన్ మనకు అవసరమయ్యే ప్రొటీన్లు, కొవ్వులను నాశనం చేసే సూపర్ ఆక్సైడ్‌కు చెక్ పెడతాయని వివరించారు. ఇదే సూపర్ ఆక్సైడ్ మంట/వాపుతోపాటు కేన్సర్ తదితర వ్యాధులకు కారణమని శాస్త్రవేత్తల అంచనా.
డబ్బాలో బయో ఇంధనం..
చెట్ల ఆకులు, బెరడులతోనే బయో ఇంధనాన్ని తయారు చేసేందుకు ఫ్రాన్‌హోఫర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మొబైల్ ఫ్యాక్టరీని సిద్ధం చేశారు. షిప్పింగ్ కంటెయినర్ సైజులో ఉండే ఈ సరికొత్త ఫ్యాక్టరీ పేరు బయోగో! ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా తాము బయోగోను అభివృద్ధి చేశామని గుంథర్ కోల్బ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. చెట్ల ఆకులు, బెరళ్లను ఆక్సిజన్ తక్కువ ఉన్న వాతావరణంలో వేడి చేసి పైరోలసిస్ ఆయిల్‌ను తయారు చేయడం.. ఆ తరువాత దాన్నిశుద్ధి చేసి గ్యాస్‌గా మార్చి, మెథనాల్ తదితర ఇంధనాలను తయారు చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు.
బయో ఇంధనాల తయారీని మరింత వేగవంతం చేసేందుకు ఇప్పటికే కొన్ని ఖరీదైన ఉత్ప్రేరకాలను వాడుతూండగా తాము నానోస్థాయి స్ఫటికాలతో చౌకైన ఉత్ప్రేరకాలను సిద్ధం చేశామని కోల్బ్ వివరించారు. బయో ఇంధనం తయారీ ప్రక్రియ మొత్తాన్ని అత్యంత సురక్షితమైన పద్ధతిలో ఒక కంటెయినర్‌సైజు ఫ్యాక్టరీలోనే పూర్తి చేసేందుకు ఆస్ట్రేలియన్ కంపెనీ ఒకటి ఇంజనీరింగ్ సహకారం అందించిందని, ఇప్పటికే ఓ నమూనా యంత్రాన్ని తయారు చేసిన తాము దాన్ని మరింత అభివృద్ధి చేసి రోజుకు కనీసం వెయ్యి లీటర్ల బయో ఇంధనాన్ని తయారు చేసేలా అభివద్ధి చేస్తున్నామని కోల్బ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment