పూటపూటకూ మాత్రలు మింగాలంటే ఎవరికైనా చిరాకే. అందుకే చాలామంది మాత్రలేసుకోవడం మరచిపోతూంటారు కూడా. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మాత్రను సిద్ధం చేశారు. వారానికి ఒక్కసారి వేసుకుంటే చాలు. ఈ క్యాప్సూల్‌లోని ఆరు అరలు రోజుకొకటి చొప్పున విచ్చుకుని అవసరమైన మందులు అందిస్తాయి. ఈ మాత్రలపై జరిగిన క్లినికల్ పరీక్షలు కూడా విజయవంతం కావడంతో త్వరలోనే ఇవి మార్కెట్‌లోకి వచ్చేస్తాయని అంచనా.
నక్షత్రపు ఆకారంలో ఉండే అరలు.. వాటిలో మందులు.. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒక అర విచ్చుకుని మందులు విడుదల కావడం.. ఖాళీ అరలు సహజసిద్ధంగా నాశనం కావడం. ఇదీ స్థూలంగా ఈ క్యాప్సూల్ పని చేసే తీరు. రెండేళ్ల క్రితమే ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఈ క్యాప్సూల్‌ను పందులకు మలేరియా మందుల రూపంలో అందించడం ద్వారా పరీక్షించారు. తాజాగా ఎనిమిది మంది మనుషులకు అటై్జమర్స్ వ్యాధికి ఇచ్చే మందు 50 మిల్లీగ్రాములను అందించారు. వారం తరువాత జరిపిన పరీక్షల్లో మందు శరీరంలోకి శోషించుకోబడిందని, అవసరమైన మేరకు మందు విడుదలైందని స్పష్టమైంది.
ఆక్సిజన్ అందించే చెప్పులు
మధుమేహుల కాలి అల్సర్లను వేగంగా మానేలా చేసేందుకు పర్‌డ్యూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఆయుధాన్ని అందుబాటులోకి తెచ్చారు. అల్సర్ ఉన్న ప్రాంతానికి నేరుగా ఆక్సిజన్‌ను అందించే చెప్పుల అడుగుభాగం (సోల్) ను వీరు తయారుచేశారు. పాలిడైమిథైల్‌సైలోక్సేన్ అనే ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ రెండు పొరల సోల్.. అడుగు పొరలో ఆక్సిజన్ అర ఉంటుంది. పై పొరను ఆక్సిజన్‌ను మాత్రమే ప్రసారం చేసేలా లేజర్ కిరణాల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేస్తారు.
ఈ సోల్‌తో కూడిన కాలిజోళ్లు వేసుకుని నడిచినప్పుడు కింది పొరపై ఒత్తిడి కారణంగా అరలోని ఆక్సిజన్ విడుదల, అల్సర్ ఉన్న ప్రాంతాన్ని నేరుగా తాకుతుంది. దీనివల్ల గాయం వేగంగా మానేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాడే హైపర్‌బేరిక్ ఆక్సిజన్ ట్రీట్‌మెంట్‌లో రోగి కదలికల్లేకుండా ఒకచోట కూర్చోవాల్సి వస్తే.. తాజా ఆవిష్కరణతో రోజువారి పనులు సులువుగా చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే.. వీటిని రోగి కాలి ఆకారం, సైజులకు అనుగుణంగా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చు.
కేన్సర్ నిర్ధారణకు కొత్త రక్తపరీక్ష
కేన్సర్ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మేలు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ కూడా సమస్యలతో కూడుకుంది. కణితి భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా వేరు చేయడం, పరీక్షించడం వల్ల వ్యాధి వేగంగా విస్తరిస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో కేవలం రక్త పరీక్షలతోనే కేన్సర్‌ను నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ప్రిన్సెస్ మార్గరెట్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ విషయంలో విజయం సాధించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న లిక్విడ్ బయాప్సీ పద్ధతులకు ఎపిజెనిటిక్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలను జోడించి అభివృద్ధి చేసిన ఈ కొత్త పద్ధతి కేన్సర్‌ను గుర్తించడం తో పాటు ఏ దశలో ఉన్నది కూడా తెలియజేస్తుంది.
కేన్సర్ తాలూకు లక్షణాలు కనిపించక ముందే వ్యాధిని గుర్తించడం వల్ల చికిత్స సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ కార్వాలో తెలిపారు. ప్రస్తుత పద్ధతులు, జన్యు క్రమంలో వచ్చిన మార్పులు.. డీఎన్‌ఏ ముక్కల ఆధారంగా నిర్ధారణ జరుగుతూంటే, కొత్త పద్ధతిలో ఎపిజెనిటిక్స్ ఆధారంగా జరుగుతోంది. ఒక్కో రకమైన కేన్సర్‌కు ఈ మార్పులు వేర్వేరుగా ఉంటాయని, తగు స్థాయిలో ఉన్న ఈ మార్పులను మెషీన్ లెర్నింగ్ ద్వారా గుర్తించడం ఈ కొత్త పద్ధతి ప్రత్యేకత అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment