
ప్రతిపక్షంలో కూర్చున్న కవి
యుద్ధం ముగిసిందని సిపాయిలు నిద్రపోయారు విజయం సాధించామని జనం ఆనందంలో మునిగిపోయారు
పడుతూ లేస్తూ నడిచినవాళ్లు జెండాలు పెకైత్తి పట్టుకొన్నారు కష్టాలను నష్టాలను ఓర్చుకున్నవాళ్లు కలల్లో తేలియాడారు దెబ్బలు తిన్నవాళ్లను నెట్టేసుకుంటూ తెలివైనవాళ్లు పూలగుచ్ఛాలందుకొన్నారు
తోరణాలు కడుతూ నగరమంతా తిరిగిన కవికి అర్ధరాత్రి ఆకలేసింది ఎవర్ని పిలిచిన బహుమతి ప్రదానాల్లో మరిచి ఒక్కరూ తిరిగి చూడలేదు ఎగిరిపోయిన డైరీ పేజీలు ఏరుకుని గుర్రాలు పారిపోయిన బగ్గీ పక్కన రాత్రి గడిపాడు అద్దం పగిలిన గడియారాన్ని ముద్దాడి యుద్ధానికి ముందు వినిపించిన అగ్గినొకసారి చదువుకొన్నాడు శత్రు సంహారం తర్వాత కూడా అదే కవిత అవసరమైనందుకు
మళ్లీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు.
- ఆశారాజు, 9392302245