
అదిగో దెయ్యం... ఇదిగో ఫోటో!
హారర్
ఇంగ్లాండ్‌లోని వెస్ట్‌మిడ్‌ల్యాండ్‌లో ఉన్న డూడ్లే కోట ప్రస్తావన రాగానే ‘‘మీరు మాట్లాడేది ఆ దెయ్యాల కోట గురించేనా?’’ అనడం పరిపాటి. ఈ దెయ్యాల కోట మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కోటను ఇటీవల సందర్శించిన డీన్, ఎమీ హర్పర్ అనే దంపతులకు ‘బూడిదరంగు దెయ్యం’ కనిపించిందని, వాళ్లు ఆ దెయ్యాన్ని ఫోటో కూడా తీశారని ఇంగ్లాండ్‌లోని చిన్నా, పెద్దా పత్రికలన్నీ కోడై కోస్తున్నాయి.
కోటలో దెయ్యం... అనేది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవడానికి గతంలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేశారు. ‘‘అర్థరాత్రి దాటిన తరువాత... వింత వింత శబ్దాలు వినిపించాయి’’ అని చెప్పిన వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు.
ఎమీ హర్పర్ తీసిన ఫోటోలోని దెయ్యం(?) తన ఎడమ చేతికి వాచ్ ధరించి ఉంది. ‘‘దెయ్యాలు గడియారాలు ధరిస్తాయా?!’’అని లా పాయింట్ లేవనెత్తారు హేతువాదులు. థామస్ హాబెస్ అనే ప్రసిద్ధ తత్వవేత్త 1651లో ‘‘అసలు దెయ్యాలు దుస్తులు ఎందుకు ధరించాలి? వాటికి ఆ అవసరం ఏమిటి? ఒకవేళ వేసుకున్నా చూసేవారెవరు? బర్త్‌డే సూట్‌లో కనిపించవచ్చు కదా!’’ అని.
ఇంతకీ బూడిదరంగు దెయ్యం వాచ్ ఎందుకు ధరించినట్లు?!
ఫ్లాష్‌బ్యాక్
డూడ్లె కోట 1071లో నిర్మాణం అయింది. డోర్తి బెమెంట్ అనే రాణి ఇందులో నివాసం ఉండేది. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ రెండు కోరికలు కోరింది. 1.తనతో పాటు బిడ్డ చనిపోతే...ఇద్దరినీ ఒకే సమాధిలో పాతి పెట్టాలి. 2. తన అంత్యక్రియలకు భర్త హాజరు కావాలి.
దురదృష్టవశాత్తు...తల్లీబిడ్డా ఇద్దరు చనిపోయారు. కానీ ఆమె రెండు కోరికలూ నెరవేరలేదు. దీంతో ప్రతికారేచ్ఛతో డోర్తి రాణి బూడిదరంగు దెయ్యంగా మారి ఆ కోటలో తిష్టవేసింది అనేది ఒక కథ.