బాలింతగా ఉద్యోగానికి వెళుతున్నారా?
నెలల బిడ్డను వదిలి ఉద్యోగానికి వెళుతున్నప్పుడు తల్లి పరిస్థితి చాలా అయోమయంగా ఉంటుంది. అటు ఆఫీసులోగాని, ఇటు ఇంట్లోగాని ఏ పని చేసినా పూర్తిగా మనసుపెట్టలేరు. అలాగని ఏ పనీ చేయకుండా ఉండలేరు. ఆఫీసులో ఉన్నంతసేపు బిడ్డ పనులు, ఇంట్లో ఉన్నప్పుడు ఉద్యోగ లక్ష్యాలు గుర్తుకొస్తుంటాయి.
దేనికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక ఇబ్బందిపడుతుంటారు. మీకు మీరే కొంత ప్లానింగ్ చేసుకుంటే ఈ సమయంలో కూడా ప్రశాంతంగా పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో మీరు లేనపుడు పిల్లలను చూసుకునేవారికి బిడ్డకు సంబంధించిన జాగ్రత్తలు వివరంగా చెప్పండి. ఏదైనా ఇబ్బంది వస్తే మీకు ఫోన్ చేసి చెప్పే సౌకర్యం ఎలాగూ ఉంటుంది కాబట్టి ఆఫీసులో ఉన్నప్పుడు అనవసరంగా ఆందోళన పడాల్సినపనిలేదు బిడ్డకు ఏడాది నిండేవరకూ తల్లికి బోలెడు పని ఉంటుంది కాబట్టి ఇంట్లో మీ పనుల చిట్టాను చక్కగా ప్లాన్ చేసుకుని దాని ప్రకారం పనులు చేసుకోండి. అప్పుడు ఫలానాపని చేయలేకపోయానన్న దిగులు ఉండదు మీ తోటి ఉద్యోగినులతో మీ ఇబ్బందుల్ని పంచుకోండి.
అనుభవంతో వారు చెప్పే సలహాలు, సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి మీరున్న పరిస్థితిలో ఆఫీసు పనిని ఏ విధంగా చేయగలరో, ఎలాంటి వెసులుబాటు అవసరమో మీ యజమానితో చెప్పడం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. కొన్ని ఆఫీసుల్లో పరిస్థితుల్ని బట్టి, అవకాశాల్ని బట్టి ఇంటి దగ్గర నుండి పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. లేదంటే... పని వేళలు మార్చుకునే అవకాశం ఉన్నా వినియోగించుకోవచ్చు.