అతిగా పనిచేస్తే అంతే సంగతులు
పరిపరి శోధన
ఆఫీసుల్లో అదనపు గంటలు పనిచేయాల్సి రావడం దాదాపు అందరికీ అనుభవమే. ఉద్యోగంలో కొనసాగినంత కాలం ఇలా అతిగా పనిచేస్తూ పోతే, ఏదో ఒకనాడు గుండె మొరాయిస్తుందని టెక్సాస్ వర్సిటీ హైల్త్‌సైన్స్ సెంటర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి 45 గంటలకు మించి పనిచేయడం ఏమాత్రం క్షేమం కాదని వారు చెబుతున్నారు.
వారానికి 45 గంటలు లేదా అంతకు మించి పనిచేస్తూ పోతే, పదేళ్లు గడిచేలోగానే గుండెజబ్బుల బారిన పడతారని వివరిస్తున్నారు. ఇలా అతిగా పనిచేయడం వల్ల ఏంజైనా, కరోనరీ గుండెజబ్బులు, గుండె వైఫల్యం, గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే ముప్పు గణనీయంగా పెరుగుతుందని, దశాబ్ద కాలంపాటు 1900 మందిపై జరిపిన విస్తృత పరిశోధనలో ఈ విషయం తేలిందని ఈ నిపుణులు వెల్లడించారు.