ఉద్యోగం చేస్తుండే స్త్రీ.. రెండు చేతుల్తో సునాయాసంగా ఇంటి పనీ, ఆఫీస్ పనీ చక్కబెట్టేయగల సర్వశక్తి సంపన్నరాలని సమాజానికి గొప్ప నమ్మకం. ఆ నమ్మకంతోనే ఏమీ తోచనప్పుడల్లా వర్కింగ్ ఉమన్‌కి సలహాలు ఇస్తుంటుంది. అలా చేస్తే కుటుంబం కళకళలాడుతూ ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటుందని ఆశపెడుతుంది. ఉద్యోగిని ‘ఎదుర్కొనే’ కొన్ని సలహాలు ఎలా ఉంటాయో చూడండి.
►ఇంటిని ఎప్పుడూ క్లీన్‌గా ఉంచండి. భర్త, పిల్లల బర్త్‌డేలను చక్కగా ప్లాన్ చెయ్యండి. ఫన్‌గా ఉండండి. అదే సమయంలో ఫర్మ్‌గానూ (గట్టిగా) ఉండండి.
►పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని మరువకండి. ఇందుకోసం మీల్ ప్లానర్ ఒకటి తయారు చేసుకోండి.
►బిడ్డను కన్న తర్వాత పెరిగిన బరువును వీలైనంత త్వరగా తగ్గించుకుని మునుపటి షేప్‌కి వచ్చేయండి.
►ఏడు రోజులూ పనిచేసుకుంటూ పోతున్నా కూడా మీరు కనుక బాగా గమనిస్తే గంటో, రెండు గంటలో మిగిలే ఛాన్స్ ఉంటుంది. వాటిని మీకోసం కేటాయించుకోండి.ఇవండీ! ఆ సలహాలు, సూచనలు. ఎంత దారుణం, ఎంత అమానుషం! వీటిల్లో ఏ ఒక్కటైనా చెయ్యడానికి ఉద్యోగిని వెనకంజవెయ్యదు కానీ, ముందడుగు వెయ్యడానికి ఆ వేసే చోట ఖాళీగా ఉండాలి కదా. చుట్టూ పని. మధ్యలో తను. ‘అయ్యిందా’ అని అడిగేవాళ్లే కానీ, హెల్ప్ చేసేవాళ్లుండరు. ‘ఇలా ఉందేమిటి?’ అనేవాళ్లు కానీ, ‘ఒంట్లో ఎలా ఉంది?’ అని కనిపెట్టి అడిగేవాళ్లుండరు. అయినప్పటికీ ఆమె ఇంటిని, ఒంటిని చక్కబెట్టుకుని తను వెలిగిపోతూ, ఇంటిని వెలిగిస్తూ ఉండాల్సిందే.
అలా ఉంటే.. ఆమె స్త్రీ శక్తి. ఉత్తమ ఇల్లాలు. చురుగ్గా, వేగంగా పనుల్ని చక్కబెట్టే నిపుణురాలు! ఎన్నాళ్లిలా ఆమెను పొగుడుతూ, ప్రశంసిస్తూ, క్షణం తీరిక ఇవ్వకుండా ఆమెను యంత్రంలా వాడుకుంటాం. తనూ మనిషే కదా. ఇదే ప్రశ్న అడుగుతూ.. శారా అనే మహిళ.. ఫేస్‌బుక్‌లో చిన్న పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో.. ముఖ్యంగా బిడ్డ తల్లులకు సమాజం వైపు నుంచి ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో, ఎంత శ్రేయోభిలాషకు ఆ తల్లులు ‘గురవుతారో’ తన అనుభవాలను జోడిస్తూ షేర్ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment