అంత కష్టపడకురా అంటున్నారు | Prabhas Special Interview on Saaho Movie | Sakshi
Sakshi News home page

అంత కష్టపడకురా అంటున్నారు

Published Tue, Aug 27 2019 7:03 AM | Last Updated on Tue, Aug 27 2019 2:03 PM

Prabhas Special Interview on Saaho Movie - Sakshi

ప్రభాస్‌ ఫుల్‌ బిజీ...రెండేళ్లుగా ‘సాహో’ సినిమాతో బిజీ.ఇప్పుడు ‘సాహో’ ప్రమోషన్స్‌తో బిజీ.బెంగళూరు, ముంబై, చెన్నై.. అంటూ ‘సాహో’ కోసం జర్నీలు చేస్తూ బిజీ.కొడుకు ఇంత బిజీగా ఉంటే ఏ తల్లికైనా ఆనందమే.కానీ కొడుకు ఎంత స్టార్‌ అయినా, ‘ప్యాన్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌’ అయినా తల్లికి కొడుకే.మరి ఈ బిజీ సన్‌కి తల్లితో కలిసి భోజనం చేసే తీరిక ఉందా? కొడుకుకి ఇంత పేరు వచ్చినందుకు ఆ తల్లి ఫీలింగ్‌ ఏంటి? తనయుడు చేసిన సినిమాలన్నీ బాగున్నాయనే ఆ తల్లికి అనిపిస్తుందా? విమర్శను నిక్కచ్చిగా చెబుతారా? ఇలాంటి విశేషాలతో పాటు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోప్రభాస్‌ చాలా విషయాలు చెప్పారు.

మీరు చాలా మొహమాటస్తులు. ‘బాహుబలి’ నుంచి కొద్దిగా అవుట్‌ స్పోకెన్‌ అయ్యారు. ఈ మార్పుని మీరు గమనించా...?
ప్రభాస్‌: (మధ్యలోనే అందుకుంటూ) బాగా మాట్లాడేస్తున్నాను కదా? ఎంటర్‌టైన్‌ చేసేస్తున్నాను కదా? ఇలా మాట్లాడటం నాకే అడ్వాంటేజ్‌. బాగా మాట్లాడితే బాగా రాస్తారు. ఇంతకు ముందు ఇంటర్వ్యూ అంటే ‘అమ్మో రేపటి నుంచి ఇంటర్వ్యూలు’ అని చిన్న టెన్షన్‌ వచ్చేది. కానీ ఇప్పుడు ఎంజాయ్‌ చేస్తున్నాను.

‘బాహుబలి’ రూపంలో మీ కెరీర్‌లో ఓ అద్భుతం జరిగింది. ఈ అద్భుతం తర్వాత మీ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ ఎలా ఉంది?
ప్రభాస్‌:భయంకరమైన లక్‌ ఉంటే కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు రావు. అది నాకు జరిగింది. ఒక అద్భుతం జరిగిపోయింది. అయితే ఇప్పట్లో మళ్లీ అంత ఒత్తిడి పెట్టుకోవాలనుకోలేదు. కానీ వెంటనే ‘సాహో’లాంటి సినిమా చేయాల్సి వచ్చింది. అన్నీ పక్కన పెట్టేసి ఇంకొక్కసారి కష్టపడదాం అని రెండేళ్లు శ్రమించాం. ‘బాహుబలి’కి ముందే నా ఫ్రెండ్స్‌ (యువీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌)తో సినిమా చేయాలని డిసైడ్‌ అయిపోయాను. ‘బాహుబలి’ వర్కౌట్‌ అవ్వకపోయినా నెక్ట్స్‌ వీళ్లతోనే అనుకున్నా. నా ఫ్రెండ్స్‌ నా కంటే పిచ్చోళ్లు. విపరీతంగా ఖర్చు పెట్టి ‘సాహో’ తీశారు.

జీవితంలో అనుకోని ‘అద్భుతం’ జరిగినప్పుడు మన ఆలోచనా విధానం కూడా మారిపోతుంది. అలాంటి మార్పు ఏదైనా మీలో వచ్చిందా?
ప్రభాస్‌:అలా ఏం మారలేదు. మే బీ నాకు తెలియదేమో? అది డెస్టినీ అవ్వచ్చు. అయితే అంతకుముందు ‘లక్‌’ అనే విషయాన్ని నేను ఎక్కువగా నమ్మేవాణ్ణి కాదు. ఒక టైమ్‌ తర్వాత ఉంటే ఉంటాయి. మన పని మనదే అనుకునేవాణ్ణి. కానీ ‘బాహుబలి’ తర్వాత కొంచెం నమ్ముతున్నాను.

జీవితాన్ని చూసే కోణం కూడా మారిందా?
ప్రభాస్‌:కచ్చితంగా మారుతుంది. ఇంకా కష్టపడాలి, ఇంకా తెలివిగా ఉండాలి, ప్రతిదానికి పక్కా ప్లానింగ్‌ ఉండాలనే మైండ్‌ సెట్‌ వచ్చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు. దానికి మించి ఏదో ఉంది అనే విషయాన్ని నమ్ముతున్నాను. ఆ ఏదో అనేది ‘ఏదో పవర్‌’ అని నా ఉద్దేశం.

‘బాహుబలి’ గురించి ప్రస్తావించినప్పుడల్లా ‘అద్భుతం’ అని అంటున్నాం. కానీ కెరీర్‌ పరంగా చూస్తే ‘రిస్క్‌’. ఆ తర్వాత 350 కోట్లతో ‘సాహో’ అనే మరో రిస్క్‌ చేశారు. రిస్క్‌ తీసుకుందాం అనే స్వభావం ఏర్పడిందా?
ప్రభాస్‌:ఆ స్వభావం ఉండబట్టే ‘బాహుబలి’ చేయగలిగాను. అయితే ‘బాహుబలి’ అప్పుడు నిర్మాత శోభుగారిని చూస్తే టెన్షన్‌ అనిపించేది. యుద్ధ సన్నివేశాలు తీసేటప్పుడు రోజుకి పాతిక లక్షలు ఖర్చు పెట్టేవారు. అయినా ఆయన నవ్వుతూ కనబడుతుండేవారు. ‘టెన్షన్‌ పడడా? రోబోనా’ అనుకునేవాణ్ణి. ‘బాహుబలి’ తర్వాత శోభుగారి ఇంటికి  ఫోన్‌ చేసి ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో ‘మళ్లీ ఇంత పెద్ద సినిమాలు చేయనీకండి’ అని చెప్పాను. కట్‌ చేస్తే.. నేనే పెద్ద ప్రాజెక్ట్‌ టేకప్‌ చేశాను. నా ఫ్రెండ్స్‌ని ఇన్వాల్వ్‌ చేశా. నాకెంత స్ట్రెస్‌ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ చేయడానికి ఫస్ట్‌ రీజన్‌ అలాంటి ప్రాజెక్ట్‌ చేసే అవకాశం  మళ్లీ వస్తుందా? లేదా? అని. ఇప్పుడు ‘బాహుబలి’ ఇంత బాగా రిసీవ్‌ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? కనీసం ప్రయత్నిద్దాం అని ‘సాహో’ చేశాను. అలా ఆరేడేళ్లు ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలకే వెచ్చించాను.

‘ప్రభాస్‌ సినిమా అంటే ఇంత భారీ బడ్జెట్, ఇంత రేంజ్‌ ఉండాలి’ అనే స్పేస్‌లో ఇరుక్కుపోయాం అనే ఫీలింగ్‌ ఏదైనా ఉందా?
ప్రభాస్‌:అలా ఏం లేదు. ‘ఛత్రపతి’తో నాకు యాక్షన్‌ హీరో ఇమేజ్‌ వచ్చింది. కానీ వెంటనే ‘డార్లింగ్‌’ అనే సాఫ్ట్‌ సినిమా చేశాను. అందులో పెద్దగా ఫైట్స్‌ కూడా ఉండవు. అమ్మాయి, అబ్బాయి ప్రేమకథ. అదీ ఆడింది. ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’లో బంధాలకు, బిజినెస్‌కు మధ్య డిఫరెన్స్‌ తెలియని ఒక క్యారెక్టర్‌. క్లైమాక్స్‌లో హీరో సారీ చెబుతాడు. ఫ్యాన్స్‌కి నచ్చలేదు. కానీ ఆడియన్స్‌ అందరూ యాక్సెప్ట్‌ చేశారు. మెల్లిగా అందరికీ నచ్చింది. స్టోరీని కనెక్ట్‌ చేయగలిగితే ఏ సినిమా అయినా వర్కౌట్‌ అవుతుంది. కరెక్ట్‌ కథ ఉంటే నన్ను పెట్టి రెండు కోట్ల సినిమా తీసినా కూడా ఆడుతుంది.

‘బాహుబలి, సాహో’ ప్యాన్‌ ఇండియా సినిమాలు. మీ నుంచి వచ్చే ప్రతీ సినిమా అన్ని భాషల వాళ్లు చూడాలనుకుంటారు. కానీ ప్రతి సినిమాకి అది కుదరకపోవచ్చు. దాన్ని ఎలా అధిగమిస్తారు?
ప్రభాస్‌:ప్యాన్‌ ఇండియా సినిమానే చే యాలని రూల్‌గా ఏమీ పెట్టుకోలేదు. ‘బాహుబలి’ తర్వాత ఇది ఇంపార్టెంట్‌ టైమేమో అనిపించింది. ఒకవేళ ‘సాహో’ వర్కౌట్‌ అయినా నెక్ట్స్‌ ప్యాన్‌ ఇండియా సినిమానే చేస్తానని పెట్టుకోలేదు. తెలుగు సినిమానే చేస్తాను. వేరే భాషలో గెస్ట్‌ పాత్ర చేయొచ్చు. అంతే తప్ప ఇకనుంచి చేసే ప్రతి సినిమా అన్ని భాషలనీ దృష్టిలో  పెట్టుకుని చేయాలని రూల్‌ అయితే పెట్టుకోలేదు.

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల మీద ఆసక్తి లేదన్నారు. పొలిటికల్‌ మూవీ ఆఫర్‌ వస్తే?
ప్రభాస్‌:పాలిటిక్స్‌ వేరు పొలిటికల్‌ ఫిల్మ్‌ వేరు. కథ బావుంటే చేయొచ్చు. యాక్షన్‌ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను. బయట చేస్తున్నానా? (నవ్వుతూ). అలాగే సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే.. నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదు కదా.

ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లినా ‘ప్యాన్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌’ అని పిలుస్తున్నారు. ఆ పిలుపుకి అలవాటు పడ్డారా?
ప్రభాస్‌:నిజంగా నేను ప్యాన్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ అని ఫీల్‌ అయ్యుంటే నా ఫ్రెండ్స్‌తో ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చుపెట్టించేవాణ్ణి?  50 కోట్లతో తీయిస్తే చాలు. అప్పుడు అందరూ అంటున్నట్లు ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ని కాబట్టి సినిమాలు ఆడేస్తాయి. అవన్నీ నేను నమ్మను. క్వాలిటీ ముఖ్యం. ‘బాహుబలి’తో తెచ్చుకున్న ఆడియన్స్‌ను సంతృప్తిపరచాలి.

సరదా సమాధానాలు
‘సాహో’కి బడ్జెట్‌ పెరుగుతుంటూ వెళ్లినప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి?
నిద్ర పట్టేది కాదు.
మీరు బయట చాలా కూల్‌. సినిమాల్లో ఫుల్‌ వయొలెంట్‌. ఈ మార్పు ఎలా?
డబ్బులు తీసుకుంటున్నాను కదా.
అందరి ప్రెషర్‌ మీరే తీసుకుంటున్నారు. మీ ప్రెషర్‌ని పంచుకునే వాళ్లు మీ లైఫ్‌లోకి ఎప్పుడు వస్తారు?
ప్రెషర్‌ తీసుకునే వాళ్లు వస్తారో? ప్రెషర్‌ పెట్టేవాళ్లు వస్తారో?
ట్రైలర్‌ చూసి మీ పెద్దనాన్నగారు (కృష్ణంరాజు) ఎలా ఫీల్‌ అయ్యారు?
అందరూ నా గురించి చెప్పడం విని తబ్బిబ్బిపోయి.. ఇంకా లావైపోతున్నారు.
మీ పాపులారిటీ దేశాలు దాటే కొద్దీ మీరింకా ‘డౌన్‌ టు ఎర్త్‌’గా మారిపోతున్నారు...
మంచిదే కదా. అది నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. ఇలా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని మాత్రం రాజమౌళి నుంచే నేర్చుకున్నాను. ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించినా తను ఒకేలా ఉన్నాడు. ఆయన పక్కనే ఉండి గమనించాను. మనం ఎప్పుడైనా పెద్ద హిట్‌ సాధిస్తే ఈయనలా ఉండగలగాలి అనుకున్నాను.

మళ్లీ రాజమౌళితో సినిమా ఎప్పుడు?
ప్రభాస్‌:ఏమో తెలియదు. ‘బాహుబలి’ అప్పుడు 7–8 వెర్షన్స్‌లు, చాలా ఐడియాలు చెప్పాడు. ‘బాబుని పైకి లేపి తల్లి చనిపోవడం, కట్టప్పే బాహుబలిని చంపడం, కొడుకుని తల్లే చంపమని చెప్పడం’ ఇవన్నీ చెబుతున్నప్పుడే నాకు గూస్‌బంప్స్‌ వచ్చాయి. రాజమౌళి ఇలాంటి సినిమాని చంపేస్తాడు అనుకున్నాను (నవ్వుతూ). నిజంగానే చంపేశాడు. అయితే కొడుకుని తల్లే చంపేయమని చెప్పడం సీన్‌ విన్నప్పుడు మాత్రం ఒళ్లు గగుర్పొడిచింది. వామ్మో... అనుకున్నాను.

అమ్మ టాపిక్‌ వచ్చింది కాబట్టి... మీ సక్సెస్‌ని మీ అమ్మగారు చాలా ఎంజాయ్‌ చేస్తారని చెప్పొచ్చు. ఆ ఫీలింగ్‌ని ఆమె మీతో షేర్‌ చేసుకుంటారా?
ప్రభాస్‌:అమ్మ, సిస్టర్‌ చాలా హ్యాపీ. నా సిస్టర్‌ అయితే గాల్లో తేలిపోతుంది. వాళ్లకు ఎవరైనా నా గురించి మాట్లాడితే చాలు.. సంతోషపడతారు. నా కెరీర్‌ ఈ రేంజ్‌కి వచ్చినందుకు ఆనందపడుతున్నారు. అమ్మ ఎక్కువ బయటపడరు. బయటపడితే నేనెక్కడ మారిపోతానో అని భయం అనుకుంటా (నవ్వుతూ).

మరి ‘రిస్కులు తీసుకోవద్దు’ అని అమ్మ జాగ్రత్తలు చెబుతుంటారా?
ప్రభాస్‌:బేసిక్‌గా నేను బద్ధకస్తుడ్ని. కాలేజీ రోజుల్లో.. లేటుగా లేవడం, కాలేజ్‌కి వెళ్లకపోవడం చేస్తుండేవాణ్ణి. ‘బద్ధకం వదిలించుకో.. పని చెయ్యి.. పని చెయ్యి’  అని చెబుతూనే ఉండేవారు. ఇప్పుడేమో విపరీతంగా కష్టపడుతుంటే ‘అంత కష్టపడకురా..’ అంటున్నారు (నవ్వుతూ). ‘షూటింగ్‌లో బాగా ఎండగా ఉందా?’ అని అడుగుతారు. ‘అమ్మా.. ప్రపంచం మొత్తం ఎండలో కష్టపడుతున్నారు. నేను ఒక్కడినేనా’ అంటాను. అప్పుడేమో పని చెయ్యమని.. ఇప్పుడేమో ఇలా కష్టపడి చేస్తుంటే బాధ.. అమ్మలు అంతే (నవ్వేస్తూ).

‘సాహో’ హైలైట్స్‌
‘సాహో’ ఫ్యూచర్‌ ఫిల్మ్‌ కాదు. ప్రజెంట్‌ టైమ్‌లో జరిగేదే. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ అపీల్‌ కోసం కొన్ని గ్రాండియర్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేశాం. ‘బాహుబలి’కి పెరిగిన బరువుని ఈ సినిమా కోసం తగ్గించడానికి వెజిటేరియన్‌గా మారాను.
సుజీత్‌ మీద ఫస్ట్‌ నుంచి నాకు కాన్ఫిడెన్స్‌ ఉంది. ‘రన్‌ రాజా రన్‌’ తర్వాత నాతో నీ నెక్స్‌› సినిమా చేస్తావా? అని అడిగాను. కథ తీసుకువస్తాను అన్నాడు. అబ్బ ఏం కాన్ఫిడెన్స్‌రా అనుకున్నాను.
యాక్షన్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో ఎడిట్‌ చేయించాం.
‘సాహో’లో నాది డ్యూయెల్‌ రోల్‌ కాకపోవచ్చు. అలాంటి క్యూరియాసిటీ ఉండాలనే ట్రైలర్‌ను అలా కట్‌ చేశాం. 
150 కోట్లతో ‘సాహో’ చేయాలనుకున్నాం. అది 350 కోట్లు అయింది.
ప్రాగ్, ప్యారిస్, జర్మనీ దేశాల నుంచి కావాల్సిన పరికరాలను తీసుకొచ్చాం.
రిస్కీ యాక్షన్‌ సీన్స్‌ తీసినప్పుడు ఒక్క దెబ్బ కూడా తగలేదు. చాలా జాగ్రత్తగా చేయించారు. ఒకప్పుడు యాక్షన్‌ సీన్స్‌ అన్నీ నేనే చేయాలనుకునేవాణ్ణి. ఇప్పుడు అవసరమైనవే చేస్తున్నాను.
సీక్వెల్‌కి స్కోప్‌ ఉన్న కథ ‘సాహో’. అన్నీ కుదిరితే చేస్తాం. అయితే ఇప్పుడప్పుడే కాదు.
ఏ సినిమాకైనా కథే మాస్టర్‌. ఆ తర్వాత డైరెక్టర్‌.
యాక్షన్‌ సినిమా అంటున్నాం కానీ సినిమాలో యాక్షన్‌ యాక్షన్‌ యాక్షనే ఉండదు. లవ్‌ స్టోరీ ఉంది. యాక్షన్‌లో కూడా కార్‌ చేజ్‌లు, ఎడారి దుమ్ములో ఓ ఫైట్, హీరోహీరోయిన్‌ రొమాంటిక్‌ సాంగ్‌తో ఓ ఫైట్‌.. ఇలా అందరూ ఎంజాయ్‌ చేసేలా ప్లాన్‌ చేశాం.     
తెలుగు సినిమా మంచి ఫేజ్‌లో ఉంది. కంటెంట్‌ ఉన్న సినిమాలు ఆడుతున్నాయి. ‘అర్జున్‌ రెడ్డి, జెర్సీ..’.. ఇలా ఈ మధ్య చాలా  సినిమాలు ఆడాయి. అందరూ భిన్నంగా ప్రయత్నిస్తున్నారు.
నెక్ట్స్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నాను. ఈ సినిమాని గోపీకృష్ణ, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

ప్రమోషన్స్‌ కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారు. అమ్మతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అయింది?
ప్రభాస్‌:నెల రోజులు అయినట్టుంది. కలిసి మాట్లాడుతున్నాను. కానీ ఈ క్వొశ్చన్‌ విన్నాక అమ్మతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో ఆలోచిస్తున్నా. మేం కలిసి భోజనం చేసి నెల దాటి పోయింది.

మీ సినిమాలను మీ అమ్మ విమర్శిస్తుంటారా?
ప్రభాస్‌:అమ్మో! సూపర్‌ క్రిటిక్‌. మామూలుగా కాదు. ‘బాహుబలి’లో ఓ సీన్‌లో నీ హెయిర్‌ చాలా చిన్నగా ఉందిరా అన్నారు. అమ్మా.. నా కిరీటం ఉంది. కీరిటానికి చైయిన్‌ కూడా ఉంది. అంత యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా జుట్టు ఎలా గమనించావు నువ్వు? ‘అమ్మ..  మదరో’ అనుకున్నాను.  ఇక్కడ మేకప్‌ కొంచెం బాగాలేదు. కళ్లు కొంచెం డార్క్‌గా ఉన్నాయి. క్రాఫ్‌ బాలేదు అని చెబుతుంటారు. డైట్‌ అంటూ సరిగ్గా తినకపోతే తిను తిను అంటారు. మళ్లీ కొంచెం పొట్ట వచ్చినట్టుందిరా అంటారు. తినకపోతే తినమని... తింటే లావు అయ్యావని. నాకు ఇవన్నీ చాలా ఎంజాయబుల్‌గా ఉంటాయి.

ఇటీవల ముంబైలో చిరంజీవిగారిని కలిశారు. ఒకరి సినిమా గురించి ఒకరు మాట్లాడుకున్నారా?
ప్రభాస్‌:మేం ఒకే హోటల్‌లో ఉన్నాం. గౌరవంగా వెళ్లి కలిశాను. మా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక ఆయన ఫోన్‌ చేశారు. ఆయన తన సొంత సినిమాలా మాట్లాడారు. చిరంజీవిగారు∙మాట్లాడిన విధానం నాకు భలే సంతోషంగా అనిపించింది. సినిమాను అంతలా ప్రేమించకపోతే ఇనేళ్లు ఇండస్ట్రీలో ఉండలేరు.

యాక్టర్స్‌కి చిరంజీవి ఆదర్శం అంటారు. అయితే తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘సైరా’కు డోర్‌ ఓపెన్‌ చేసింది ‘బాహుబలి’ అని ఆయన అన్నారు. ఆ ఫీలింగ్‌ ఎలా ఉంది?
ప్రభాస్‌:అది నాకు తెలియదు. అదంతా రాజమౌళి. ‘బాహుబలి’ రాజమౌళి ఫిల్మ్‌. అది మీరు రాజమౌళినే అడగాలి.

‘బాహుబలి’ టీమ్‌కి రాజమౌళియే స్ఫూర్తి నింపారని అన్నారు. మరి ‘సాహో’  టీమ్‌కి ఆ స్థానంలో మీరు ఉండాల్సిన పరిస్థితి. ఆ అనుభవం ఎలా అనిపించింది?
ప్రభాస్‌:మా ‘సాహో’ టీమ్‌కి కూడా ‘బాహుబలి’యే స్ఫూర్తి. యూవీ వంశీ, ప్రమోద్‌ మంచి ప్యాషనేట్‌. నేను యూవీకి, యూవీకి నేను, మాకు డైరెక్టర్‌ సుజీత్‌.. మాకన్నా సుజీత్‌ వయసులో చిన్నవాడు. కానీ ‘ఏం కాదు అన్నా’ అని ధైర్యం చెప్పాడు. అతని వయసు ఏంటి? మాకు చెప్పడం ఏంటీ? అనుకున్నాం (నవ్వుతూ). బట్‌ ‘సాహో’ టీమ వర్క్‌.

యాక్టర్‌గా మీ నెక్ట్స్‌ ప్లాన్‌ ఏంటి? ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు?
ప్రభాస్‌:‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి ఇండియన్‌ సినిమాకు ఇంకేదో చూపించారు. నెక్ట్స్‌ నా సినిమాలకు ఆడియన్స్‌ వచ్చినప్పుడు మేం ఏదో చూపించాలని ప్రయత్నం చేశామని చెప్పడానికి నానా తంటాలు పడ్డాం. ‘సాహో’ చేశాం. నెక్ట్స్‌ ఎలాంటి సినిమాలంటే... చూడాలి.

బ్యాంకాంక్‌లో మేడమ్‌ తుస్సాడ్స్‌లో మీ మైనపు విగ్రహం పెట్టడం ఎలా అనిపించింది?
ప్రభాస్‌:‘బాహుబలి’ వల్ల చాలా విషయాలు జరిగాయి. జపాన్‌ వెళ్లినప్పుడు అక్కడ రానాని ఫ్యాన్స్‌ పట్టుకుని ఏడవడం అవి అన్నీ వింటుంటే...‘బాహుబలి’ రూపంలో ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది. అందులో మేడమ్‌ తుస్సాడ్స్‌ ఒకటి.

ఫ్యాన్స్‌ అంతా మిమ్మల్ని ‘డార్లింగ్‌’ అని పిలుచుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఓ అమ్మాయి ఏకంగా మీ బుగ్గ గిల్లి పారిపోవడం?
ప్రభాస్‌:అది నేను ఊహించలేదు. ఎందుకంటే మేల్‌ ఫ్యాన్స్‌ కొంచెం గట్టిగా పట్టుకుని లాగడం అనుభవమే. అయితే ఒక అమ్మాయి నుంచి ఈ సంఘటనను నేను ఊహించలేదు. అప్పటికే నేను 18గంటలు ట్రావెలింగ్‌లో ఉన్నాను. అప్పుడే ఫ్లయిట్‌ దిగాను. ఫొటో అడిగింది. సరే కదా అని కళ్లజోడు పెట్టుకుని ఫొటో ఇచ్చాను. ఆ అమ్మాయి బాగా హైపరైపోయి నా బుగ్గ గిల్లింది. కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యా. కానీ ఇదంతా ప్రేమలో భాగమే కదా అనిపించింది (నవ్వుతూ).

మీరు కనిపించినప్పుడు పెద్ద స్థాయిలో మీ చుట్టూ ఫ్యాన్స్‌ గుమిగూడతారు. ఫోటోల కోసం పోటీ పడుతుంటారు. అయినా మీరు సహనం కోల్పోకుండా ఎంతో ఓర్పుగా ఉంటారు...
ప్రభాస్‌:అది ఫస్ట్‌ నుంచే డిసైడైపోయాను. నేనైతే అభిమానులను కొట్టలేను. తొయ్యలేను. నాకు రక్షణగా ఉన్నవారు అలా చేయడానికి ప్రయత్నించినా నాకు ఏదోలా ఉంటుంది.  ఒక్క ఫ్యాన్‌ వస్తే చాలు అనుకున్నప్పుడు... ఇంత మంది ఫ్యాన్స్‌ ఉండటం అంటే హ్యాపీనే కదా. ఎలాగూ నేను బయట కనిపించేది తక్కువ. కనిపించినప్పుడు అభిమానం చూపిస్తారు. అది నాకు ఇష్టమే.

‘బాహుబలి 2’ విడుదలప్పుడు కన్నా... ‘సాహో’ విడుదలకు ఏమైనా ఎక్కువ టెన్షన్‌ పడుతున్నారా?
ప్రభాస్‌:‘బాహుబలి 2’ అప్పుడు పెద్దగా టెన్షన్‌ లేదు. ఎందుకుంటే అప్పటికే ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలైపోయింది. యాభై శాతం సక్సెస్‌ వచ్చింది. ఇండియా అంతా యాక్సెప్ట్‌ చేశారు. ‘బాహుబలి 2’ లో కూడా మంచి కంటెంట్‌ ఉంది. మినిమమ్‌ గ్యారంటీ అనుకున్నాం. కానీ ‘బాహుబలి 1’ రిజల్ట్‌ ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు ముంబై వెళ్లాం. తమిళనాడు వెళ్లాం. కేరళ వెళ్లాం.. మాట్లాడాం. ‘బాహుబలి’లో అది చేశాం.. ఇది చేశాం అని చెప్పాం. రేపు ఈ సినిమా చూసి.. ఇదేం సినిమారా అంటారేమోనని భయం. మళ్లీ బడ్జెట్‌ ఒకటి. ఆపేయాలా.. ఆగిపోవాలా? ఏమైనా తేడా జరిగితే.. ఇలాంటి ఆలోచనలతో ‘బాహుబలి 2’ అప్పుడు భయంకరమైన ప్రెజర్‌. ‘సాహో’ రిలీజ్‌ అప్పుడు ఇంకో రకమైన ప్రెజర్‌.

హిందీలో కరణ్‌ జోహార్‌ ఓ సినిమా చేయమంటే మీరు చేయనన్నారనే వార్తలు వచ్చాయి..
ప్రభాస్‌:అదేం లేదు. నేను, కరణ్‌ జోహార్‌ ఇప్పటికీ మాట్లాడుకుంటాం. భవిష్యత్‌లో కరణ్‌తో సినిమా ఉండొచ్చు. ఏమో.. ఇప్పుడే చెప్పలేను.

నెగటివ్‌ కామెంట్స్‌ని ఎలా తీసుకుంటారు?
ప్రభాస్‌:నేను ఎక్కువగా సోషల్‌ మీడియాను ఫాలో అవ్వను. కానీ సక్సెస్‌లో అవి కూడా భాగం అనుకుంటాను. సక్సెస్‌ రోడ్‌ స్ట్రైయిట్‌గా ఉండదు కదా. చాలా దార్లు తొక్కి వచ్చాం. కొన్నిసార్లు నా తప్పులు ఉంటాయి. మరికొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం కావొచ్చు. నెగటివ్, పాజిటివ్‌ సక్సెస్‌లో భాగమే.

ఫైనల్లీ దాదాపు 2 కోట్లు (ఫస్ట్‌ సినిమా ‘ఈశ్వర్‌’ బడ్జెట్‌) నుంచి 350 కోట్ల (‘సాహో’ బడ్జెట్‌) వరకు చేరుకున్న మీ ప్రయాణం గురించి?
ప్రభాస్‌:‘ఈశ్వర్‌’కి కోటీపాతిక లక్షలు అయింది. ఆ సినిమా అంతా రోడ్డు మీదే చేశాం. పెద్ద స్టార్స్‌ కూడా లేరు. అక్కణ్ణుంచి కెరీర్‌ ఇంతదాకా వచ్చింది. ఇది నా ఒక్కడివల్ల కాదు. నాతో సినిమాలు చేసిన అందరికీ దక్కుతుంది.

– సినిమా డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement