ప్రశంసలు ఇచ్చే కిక్కే వేరబ్బా!
లైఫ్‌బుక్: అదితీరావ్ హైదరి
చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ ఒక విషయం చెప్పేవారు... ‘‘మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే...వాటిని జాగ్రత్తగా మనసులో దాచుకోండి. మీలో ఎప్పుడైనా ఉత్సాహం తగ్గినప్పుడు వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎంతో శక్తి వచ్చినట్లుంటుంది’’ అని. ఈ సూత్రాన్ని నేను ఇప్పటికీ అనుసరిస్తుంటాను. అమితాబ్, మీరా నాయర్, అనురాగ్ కశ్యప్...మొదలైన వారు మెచ్చుకున్న సందర్భాలను తరచుగా గుర్తు తెచ్చుకుంటాను.
యౌవనం అంటేనే పెద్ద అలంకరణ. మళ్లీ ప్రత్యేకంగా అలంకరించుకోవడం ఎందుకనేది నా భావన. వీలైనంత ఎక్కువగా మేకప్‌కు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాను.
ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటే అందంగా కనిపిస్తాం.
నేను నటించిన సినిమాలు నాకు ఒక విషయాన్ని చెప్పాయి. ‘‘స్వేచ్ఛగా జీవించు. గౌరవంగా జీవించు’’ అని. అలా అని విశృంఖలమైన స్వేచ్ఛను ఇష్టపడను. గౌరవంగా జీవించగలిగే స్వేచ్ఛను ఇష్టపడతాను.
సిఫారసులతో మంచి పాత్రలు వస్తాయని నేను అనుకోను. మనలో నటించే సత్తా ఉంటే ఎలాంటి సిఫారసులూ అక్కర్లేదు. అయితే విధి కూడా మన విషయంలో కాస్త చల్లని చూపు చూడాలి.
‘నేను ఇలా ఉండాలనుకుంటున్నాను’ అని కొన్ని నియమాలు పెట్టుకున్నాను. కొన్ని సందర్భాలలో వాటి వల్ల కెరీర్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా పట్టించుకోను. మనసుకు నచ్చని పని చేయను.
శక్తిసామర్థ్యాలు ఎక్కడి నుంచో రావు. మన ఇష్టం నుంచే వస్తాయి. మనకు ఒక పని మీద ఇష్టం ఉంటే, శక్తిసామర్థ్యాలు వాటంతట అవే బయటపడతాయి. ఇష్టం లేక పోతే ఉన్నవి కూడా వెనక్కి పోతాయి.