విలక్షణ స్వరూపుడికి వేవేల దండాలు! | Prayers for Lord Ganesh | Sakshi
Sakshi News home page

విలక్షణ స్వరూపుడికి వేవేల దండాలు!

Published Sat, Sep 7 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

విలక్షణ స్వరూపుడికి వేవేల దండాలు!

విలక్షణ స్వరూపుడికి వేవేల దండాలు!

దేవతలందరిలోనూ విశ్వవ్యాప్తమైన విలక్షణ స్వరూపం గణపతిది. ఆసియాఖండంలోని అనేకప్రాంతాలలో గణపతి ఆరాధన ఉంది. మనస్సుపెట్టి ప్రార్థించాలేగాని, వెంటనే అన్నీ ప్రసాదించే భక్తసులభుడు. మనదేశంలో సుప్రసిద్ధమైన గణపతి క్షేత్రాలు అనేకం ఉన్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలలో చాలామంది ఇంట్లోనే గణపతిని ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వహిస్తారు. కాస్త సమయం, డబ్బు వ్యయం చేయదలచుకున్నవారు దేశంలో ఉన్న గణపతి క్షేత్రాలకు వెళ్లి ఆయా క్షేత్రాలలో గణపతి దేవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
 
 శ్రీవరసిద్ధి వినాయక ఆలయం - కాణిపాకం: మన రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైనది కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇది చిత్తూరు జిల్లాలో తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈయన స్వయంభువు. పవిత్ర బాహుదానది ఒడ్డున అలరారుతున్న ఈ క్షేత్రంలో స్వామివారి ఎదుట చేసే ప్రమాణాలు ఎంతో ప్రామాణికంగా ప్రసిద్ధి చెందాయి. కాణిపాకం పూర్వనామం విహారపురి.
 
 సాక్షి గణపతి ఆలయం - శ్రీశైలం: శ్రీశైల ప్రధానాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక, ఈ స్వామి సాక్షి గణపతిగా ప్రసిద్ధుడు. చక్కని నల్లరాతితో మలచబడి, కుడివైపునకు తిప్పిన తొండంతో చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లున్న ఈ సాక్షి గణపతి ప్రస్తావన శ్రీనాథుని కాశీఖండంలో కనిపిస్తుంది. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించ వచ్చే యాత్రికులు ఈ స్వామిని దర్శిస్తారు.
 
 సిద్ధి వినాయక స్వామి ఆలయం - అయినవిల్లి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని శ్రీసిద్ధి వినాయకస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. దక్షప్రజాపతి తాను తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలన్న సంకల్పంతో ఇక్కడున్న సిద్ధివినాయకస్వామిని పూజించినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చే ఈ స్వామిని కొలిచేవారికి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఇక్కడి స్వామిని దర్భగడ్డితో పూజిస్తే పాతకాలన్నీ పటాపంచలయి సకల శుభాలు చేకూరుతాయి.
 
 పాతాళ వినాయకాలయం - కాళహస్తి: శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయ ఉత్తర గోపురానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు పాతాళంలో కొలువుదీరి ఉంటాడు. శ్రీ కాళహస్తీశ్వరస్వామివారిని సందర్శించుకున్న భక్తులంతా ఈ స్వామిని సేవించుకోవడం పరిపాటి. పాతాళ వినాయకుడి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. చిత్తూరు జిల్లా తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
 
 సిద్ధి వినాయకస్వామి ఆలయం - ముంబై: ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న అత్యాధునికమైన విఘ్నేశ్వరాలయమిది. దేశంలోనే అత్యంత అధికాదాయాన్ని ఇచ్చే వినాయకాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి ఏటా 15 కోట్ల రూపాయల ఆదాయం విరాళాల రూపంలో వస్తోంది. 1801వ సంవత్సరంలో నిర్మాణం జరుపుకున్న ఈ ఆలయాన్ని లక్ష్మణ్ వితు పాటిల్, దేవ్‌భాయ్ పాటిల్ అనే భక్తులు నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుని మూర్తి బంగారంతో నిర్మితమైంది. ఇక్కడ కొలువైన స్వర్ణసిద్ధి వినాయక స్వామిని పూజిస్తే, కోర్కెలు నెరవేరతాయని, సంతానంలేనివారు ఈ స్వామిని సేవిస్తే, సంతానభాగ్యం కలుగుతుందని విశ్వాసం.
 
 శ్రీ వినాయక ఆలయం - గణపతి పూలె: మహారాష్ర్టకు పశ్చిమాన రత్నగిరి జిల్లాలో ఉన్న వినాయక ఆలయమిది. సముద్ర తీరాన, ప్రకృతి అందాల నడుమ అలారుతున్న ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. గర్భాలయంలో కొలువుదీరిన వినాయకుడు స్వయంభువు. కొల్హాపూర్ పట్టణానికి 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ముంబై, రత్నగిరిల నుంచి బస్ సౌకర్యం ఉంది.
 
 అష్ట వినాయక ఆలయాలు: మహారాష్ట్రలోని పూణె, రాయగఢ్ జిల్లాల్లో ఎనిమిది వినాయక ఆలయాలున్నాయి. ఇవి అష్టవినాయక ఆలయాలుగా ప్రసిద్ధి. వీటిలో ఆరు ఆలయాలు పుణె జిల్లాలో ఉండగా, రెండు రాయగఢ్ జిల్లాలో ఉన్నాయి. ప్రత్యేతకను సంతరించుకున్న ఆయా క్షేత్రాలలో వినాయకుడు మయూరేశ్వరుడు, మహాగణపతి, చింతామణి గణపతి, గిరిజాత్మక్ గణపతి, విఘ్నేశ్వరుడు, సిద్ధి వినాయకుడు, బల్లలేశ్వరుడు, వరద వినాయకుడు నామధేయాలతో వర్థిల్లుతున్నాడు.
 
 మహాగణపతి ఆలయం - రంజన్ గావ్:
పూర్వం మణిపూర్‌గా పేరుగాంచిన ఈ క్షేత్రంలోని వినాయకుణ్ణి సాక్షాత్తూ శివుడే ప్రతిష్ఠించాడని ప్రతీతి. 1790వ సంవత్సరంలో మాధవరావు పేష్వా... స్వామివారికి గర్భాలయాన్ని నిర్మించాడు. అయితే ఈ ఆలయం 8, 9 శతాబ్దాల నాటిదిగా ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
 
 - దాసరి దుర్గాప్రసాద్

 
 వినాయకుడు అవతరించిన నక్షత్రం హస్త. ఈ నక్షత్రం కన్యారాశికి సంబంధించినది. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడంటే పండితుడని అర్థం చెబుతారు. అందుకే పిల్లలకు చదువు రావాలంటే గణపతి అనుగ్రహం ఉండాలంటారు. ఏ విద్యలో రాణించాలన్నా, ఏ ఆటంకాలను అధిగమించాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా సర్వశాస్త్రాలకు అధిపతి అయిన గణపతి అనుగ్రహం తప్పనిసరి. ఆ స్వామిని రోజూ పూజించలేనివారు ఏడాదిలో ఒకసారి వచ్చే భాద్రపద శుక్ల చతుర్థినాడు తప్పక పూజించాలని శాస్త్రం చెబుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement