చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి, అక్కడ మాత్రమే గాక మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించిన పుకార్లు మన తెలుగు రాష్ట్రాల్లోనూ షికారు చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లోనూ ఇది విస్తరించిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. అదెంత ప్రభావపూర్వకమైనదో, ప్రపంచవాసులందరినీ ఎంతగా బెంబేలెత్తిస్తోందో అందరికీ తెలిసిందే. అందుకే అది హైదరాబాద్‌కు వచ్చిందా, రాలేదా అన్న శంక కంటే... వచ్చినా రాకున్నా దాన్ని నివారించుకోవడం ఎలాగో తెలుసుకోవడం మంచిది.
అందుకే దాని లక్షణాలూ, నివారణ తేలిగ్గా అర్థమయ్యేలా ఇక్కడ వివరిస్తున్నాం. ఈ జాగ్రత్తలు పాటిస్తే... కరోనా మాత్రమే కాదు... మరే వైరస్ అయినా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లయినా నివారితమవుతాయి. చికిత్స కంటే నివారణ మెరుగు (ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్) అన్న సామెత మనమంతా ఎరిగిందే. ఇందుకు ఉపయోగపడేదీ ఈ బొమ్మల కథనం
కరోనా వైరస్‌తో జలుబు లాంటి ఇన్ఫెక్షనే వస్తుంది. ఇది అప్పర్ ఎయిర్‌వే రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే.. శ్వాస వ్యవస్థ పైభాగానికే పరిమితమైతే జలుబులాగే తగ్గిపోతుంది. కానీ అది శ్వాసవ్యవస్థ అంతర్గత భాగాలైన ఊపిరితిత్తులోకి వెళ్తే నిమోనియాకి దారితీసి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి ప్రమాదం చిన్నపిల్లలు, వృద్ధుల్లాంటి రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో ఉంటుంది కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
నివారణకు చేయాల్సిందేమిటి?
1 చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం ద్వారా మంచి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించాలి. ఇలా చేతులు కడుక్కునేందుకు సబ్బు లేదా ఆల్కహాల్ బేస్‌డ్ హ్యాండ్Ô >నిటైజర్లు వాడాలి. మరీ ముఖ్యంగా దగ్గడం, తుమ్మడం చేశాక... అడ్డుపెట్టుకున్న ఆ చేతులను శుభ్రంగా కడగాలి. టాయిలెట్‌కు వెళ్లొచ్చాక సబ్బుతో గాని, లిక్విడ్ సోప్‌తోగాని చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి. ఇక వైద్యరంగంలో పనిచేసే (మెడికల్ ప్రొఫెషనల్స్) వారంతా రోగిని లేదా అతడి వస్తువులను ముట్టుకోగానే చేతులను శుభ్రం చేసుకోవాలి.
2 సాధ్యమైనంత వరకు నోటిని, ముక్కును, కళ్లను చేతులతో ముట్టుకోకండి. ముక్కును, కళ్లను అదేపనిగా రుద్దుకోకండి.
3 బాగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు వీలైనంతవరకు మాస్క్ ధరించండి.
4 రోగి ఉపయోగించిన వస్తువులను వారి తాలుకు ఇతర సామగ్రిని వీలైనంతవరకు తాకకండి.
5 వీలైనంత వరకు తుమ్ముతున్నప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు డిస్పోజబుల్ టిష్యూ పేపర్స్ గనక అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించి, తక్షణం వాటిని పారేయండి. అలా టిష్యూ పేపర్ అందుబాటులో లేనివారు... పొడుగు చేతుల చొక్కా (లాంగ్‌స్లీవ్స్ షర్ట్) వేసుకొని ఉంటే... తమ మోచేతి ప్రాంతాన్ని నోరు, ముక్కుకు అడ్డుపెట్టుకొని దగ్గడం/తుమ్మడం చేయాలి.
6 మంచి పోషకాహారం తీసుకోవడం, సాధారణ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అందరికీ మేలు చేస్తుంది.
7 తినేముందర పండ్లు, కోసి వండే ముందర కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత శుభ్రంగా కడగండి.
8 ఆరోగ్యకరమైన అలవాట్లతోపాటు రోజూ వ్యాయామం చేయండి. తగినంతగా నిద్రపొండి. వీటిన్నింటివల్ల మన ఆరోగ్యం బాగుండటంతో పాటు మన రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. అది మనల్ని కరోనా వైరస్ మాత్రమే కాదు... మరెన్నో జబ్బులనుంచీ కాపాడుతుంది.
1 నోరు, ముక్కు గుండా ప్రవేశిస్తుంది
2 ఏదో ఒక కణాన్ని ఆశ్రయించి ఆవాసం ఏర్పరచు కుంటుంది.
3 అలా ఆవాసం ఏర్పరచుకున్న వైరస్... పొరుగునున్న కణాలన్నింటికీ విస్తరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment